ఆవిడ స్వయంగా ముఖ్యమంత్రికి సోదరి. బాబాయ్ కూతురు. ఆవిడకే రక్షణ లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. కడప జిల్లాఎస్పీని కలిసి తమకు సెక్యూరిటీ కావాలని కోరిందావిడ. ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరువు ఈవిడ వల్ల ఇప్పటికే చాలాసార్లు పోయింది. తన తండ్రి హత్య కేసు విచారణ సరిగా జరగటం లేదన్నప్పుడు… రాష్ట్ర ప్రభుత్వం కాదు సీబీఐయే విచారణ చేయాలన్నప్పుడు.. తమ బంధువులే అనుమానితులు అన్నప్పుడు..ఇలా ప్రతిసారీ పరువు పోతూనే ఉంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి. ఇప్పుడు తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కోరుతూ ఎస్పీని కలిశారంటే..ఎవరి నుంచి హాని ఉన్నట్లు… ఎవరి నుంచి రక్షణ కోరుతున్నట్లు? ఆలోచిస్తే అందరికీ సమాధానాలు దొరికిపోతాయ్.
రాజకీయ కారణాలతో వివేకానందరెడ్డి హత్య అంటూ..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ విభిన్నకోణాల్లో చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే డాక్టర్ సునీతారెడ్డి తన తండ్రి హత్య కేసులో ఎవరెవరిని అనుమానిస్తున్నారో పెద్ద లిస్టే ఇచ్చారు. మధ్యలో చాలాసార్లు సీబీఐ విచారణ ఆలస్యమవుతుందని ఢిల్లీ దాకా వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. అంతే కాదు రాజకీయ కారణాలతో తన తండ్రి హత్య జరిగిందని..ఎవరో చెబుతున్నట్లు రియల్ ఎస్టేట్ వేరే కారణాలు కానే కాదని సునీతారెడ్డి సూటిగా చెప్పారు. అప్పటి నుంచి జగన్ సర్కార్‌కు ఆమె శత్రువు అయిపోయారు.
ప్రజాస్వామిక వ్యవస్ధలో ఒక డాక్టర్.. అందులోనూ పలుకుబడి, ప్రతిష్ట కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి… తనకు ఇక్కడ రక్షణ లేదంటున్నారంటే… ప్రభుత్వం సిగ్గుపడాల్సిందే. అయితే ఆమె తన రక్షణ విషయంలో అనుమానపడటంలో ఆశ్చర్యం లేదు. హైకోర్టులో సీబీఐ విచారణ కావాలని వివేకా భార్య పిటిషన్ వేస్తే..జగన్ కూడా ఇంప్లీడ్ అవుతూ మరో పిటిషన్ వేశారు. ఇద్దరూ సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు. ఇదంతా ఎన్నికలకు ముందు..ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సీబీఐ విచారణ అవసరం లేదని హైకోర్టుకు తెలియ చేశారు.దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.
అందరూ ఉండగానే ఆమెకు ఫోన్లు..
మరోవైపు డాక్టర్ సునీతారెడ్డి మొదటిసారి ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు… అందరూ ఉండగానే ఆమెకు ఫోన్లు ఎలా వచ్చాయో లైవ్‌లోనే అందరూ చూశారు. ఆ తర్వాత జగన్మోహన్‌రెడ్డి స్వయంగా సునీతారెడ్డిని తాడేపల్లి పిలిపించుకుని భేటీ అయ్యారు. ఆ తర్వాత నుంచే సునీతారెడ్డి వైఖరి మారింది. ప్రతిపక్షాల ఆరోపణల ప్రకారం అయితే ఈ విషయం ఇంతటితో వదిలేయాలని జగన్ బెదిరించటంతోనే సునీతారెడ్డి వైఖరి మార్చుకున్నారని.. తన తండ్రిని చంపినవారికి శిక్ష పడాల్సిందేనని పట్టుదల పెంచుకున్నారని చెబుతున్నారు. ఇక తర్వాత సునీతారెడ్డి ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి దాదాపు జగన్ నిందితులను కాపాడుతున్నరన్నంతగా పరోక్ష ఆరోపణలు చేశారు. దీంతో ప్రతిపక్షాలు కూడా సునీతారెడ్డి మాటలను చూపించి..జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆ ఎపిసోడ్‌తో జగన్ ప్రభుత్వానికి ఫ్రస్టేషన్ పీక్స్‌కి వెళ్లిపోయింది.
ఇప్పుడు సీబీఐ వేగంగా విచారణ చేస్తోంది. అది ఏ కోణంలో జరుగుతోందో తెలియదు. ఒకవేళ సునీతారెడ్డి సీబీఐ రిపోర్టుతో సంతృప్తి చెందకపోతే మళ్లీ కోర్టుకు వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఇప్పటికీ వారికి, వారి కుటుంబసభ్యులకు బెదిరింపులు వస్తున్నాయని చెబుతున్నారు. అందుకే ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను డాక్టర్ సునీతారెడ్డి కోరారు.
Must Read ;- బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. భద్రత కల్పించాలని కడప ఎస్పీని కోరిన సునీతారెడ్డి











