నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘నేత్రికన్’. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైంది. రౌడీ పిక్చర్స్ పతాకంపై మిలింద్ రావు దర్శకత్వంలో నయన్ కాబోయే భర్త విఘ్నేష్ శివన్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉంది ఏమిటనేది తెలుసుకుందాం.
కథలోకి వెళితే..
ఓ ప్రమాదంలో సీబీఐ ఆఫీసర్ దుర్గ (నయనతార) కంటి చూపును కోల్పోతుంది. అయినా మొండిగా జీవితాన్ని వెళ్లదీస్తుంటుంది. ఈ నేపథ్యంలో సిటీలో అమ్మాయిల కిడ్నాప్ జరుగుతుంటుంది. ఓ రోజు రాత్రి బస్టాప్‌లో క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న దుర్గపై జేమ్స్ (అజ్మల్) దృష్టి పడుతుంది. తాను క్యాబ్ అని చెప్పి ఆమెను ఎక్కించుకుని తీసుకెళతాడు. మధ్యలో జేమ్స్ ఓ వ్యక్తిని కొట్టడంతో అతనిపై అనుమానం వచ్చిన దుర్గ కారు దిగి పారిపోతుంది.
అతని మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుంది. కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తుంటాయి. ఎస్పై మళికంఠ (మణికందన్) ఈ కేసు బాధ్యతలు చూస్తాడు. అసలు జేమ్స్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటాడు? చివరికి కేసు ఎలా పరిష్కారమైంది? లాంటి విషయాలను చూసి తెలుసుకోవలసిందే.
ఎలా తీశారు? ఎలా చేశారు?
కొరియన్ సినిమా బ్లైండ్ ఆధారంగా ఈ సినిమా ని నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన చిత్రమిది. కథను నడపడంలో మిలింద్ రావ్ తన నేర్పరి తనాన్ని ప్రదర్శించాడు. కథనం నిదానంగా సాగడం కొంత మైనస్సే. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిస్ కాకూడనుకుంటే కొరియన్ స్క్రీన్ ప్లే ఫాలో అవడమే మంచిదని దర్శకుడు నిర్ణయించుకున్నట్టుంది. కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో దర్శకుడు తన పనితనాన్ని చూపించాడు. సినిమాలో కొంత సాగతీత కనిపించింది. నిడివి తగ్గించే ప్రయత్నాన్ని చేసి ఉంటే బాగుండేది.
అనవసరమైన సన్నివేశాల జోలికి వెళ్లకుండా ఉండాల్సింది. దుర్గ పాత్రలో నయనతార ఒదిగిపోయింది. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ ఆమె నటనే. అజ్మల్ కూడా బాగా చేశాడు. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సంగీత దర్శకుడు గిరీష్ గోపాల కృష్ణన్ ఈ సినిమాకి న్యాయం చేశారు. సినిమాకి కొంత ఎడిటింగ్ అవసరం. నిడివి తగ్గించే ప్రయత్నం జరిగితే బాగుంటుంది. మొత్తం మీద నయనతారకు మరో మంచి చిత్రం లభించిందని చెప్పాలి. దర్శకుడు ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే ఈ సినిమా ఇంకా మంచి రేంజ్ కి వెళ్లేది.
నటీనటులు: నయనతార, అజ్మల్ అమీర్, శరణ్ శక్తి, మణికందన్.
సాంకేతిక వర్గం: కెమెరా: ఆర్.డి. రాజశేఖర్, సంగీతం: గిరీశ్ గోపాలకృష్ణన్.
నిర్మాణం: రౌడీ పిక్చర్స్,
నిర్మాత: విఘ్నేశ్ శివన్.
దర్శకత్వం: మిలింద్ రావ్
విడుదల: 13-08-2021
ఎక్కడ చూడాలి: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ఒక్క మాటలో: థ్రిల్లర్ జోనర్ కు న్యాయం
రేటింగ్: 2.5/5
– హేమసుందర్ పామర్తి











