నిజమే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంటే తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావే తోపు. వినడానికి ఇదేదో కాస్త ఇబ్బంది అనిపించినా.. వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తుంంటే ఈ మాట ముమ్మాటికీ నిజమేనని చెప్పక తప్పదు. రాజకీయ అనుభవం, పాలనానుభవంలో జగన్ కంటే కేసీఆరే సీనియర్ అయినా.. టీఆర్ఎస్ ను మించిన మెజారిటీతో విజయం సాధించిన జగన్.. సాధారణంగానే ఢిల్లీలో కేసీఆర్ కంటే తమ బలమే ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే కేసీఆర్ తాజా ఢిల్లీ పర్యటన మాత్రం జగన్ మాటను పటాపంచలు చేసింది. ఏపీలో జగన్ కు బలముండొచ్చేమో గానీ.. ఢిల్లీలో మాత్రం తానే జగన్ కంటే బలాఢ్యుడిని అని కేసీఆర్ ఒక్క మాట మాట్లాడకుండానే నిరూపించుకున్నారు. అదెలాగో చూద్దాం పదండి.
అపాయింట్‌మెంట్లే దక్కట్లేదుగా
ఏపీ సీఎం హోదాలో రికార్డు విక్టరీ సాధించిన తర్వాత తన తొలి ఢిల్లీ పర్యటనలో జగన్ కు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఈజీగానే దొరికింది. అంతే.. ఆ తర్వాత ఎప్పుడు ఢిల్లీ వెళదామన్నా.. ప్రధాని కాదు కదా కనీసం కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్లు కూడా జగన్ కు దొరకడం లేదు. కొన్ని సార్లైతే.. జగన్ కు అపాయింట్ మెంట్లు ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేసిన కేంద్ర మంత్రులు చాలా మందే ఉన్నారు. ఇక అమిత్ షా అయితే.. తన అపాయింట్ మెంట్ల విషయంలో జగన్ కు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారనే చెప్పాలి. జగన్ ఎప్పుడు అపాయింట్ మెంట్ కోరినా.. తిన్నగా ఏనాడూ అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదనే చెప్పాలి. రేపు, మాపు అంటూ జగన్ అడిగిన చాలా రోజులకు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చేవారు. ఒక్కోసారి తానిచ్చిన అపాయింట్ మెంట్ ను రద్దు చేసిన అమిత్ షా.. జగన్ కు నిజంగానే షాకుల మీద షాకులిచ్చారని చెప్పాలి. వెరసి జగన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా.. ఆయన పర్యటనలో ఏమాత్రం స్పష్టత ఉండేది కాదు. బీజేపీ అడిగిన వెంటనే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినా కూడా జగన్ కు ఢిల్లీలో వెయిటింగ్ లు తప్పలేదు.
అలా వెళ్లి.. ఇలా కలిసి..
అయితే కేసీఆర్ వ్యవహారం జగన్ కు పూర్తిగా భిన్నమనే చెప్పాలి. కేవలం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి భూమి పూజ భూమి పూజ చేసేందుకు హస్తిన వెళ్లిన కేసీఆర్.. వరుసగా ఓ రోజు ప్రధాని నరేంద్ర మోదీని, ఆ మరునాడే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు బయలుదేరే ముందు కేసీఆర్ షెడ్యూల్ లో పీఎంతో గానీ, షా తో గానీ భేటీలే లేవు. అయితే తన మూడో రోజు పర్యటనలో తనదైన శైలి చక్రం తిప్పిన కేసీఆర్.. ఆ మరునాడే మోదీ అపాయింట్ మెంట్ సంపాదించారు. శుక్రవారం నాడు నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లిన కేసీఆర్.. మోదీతో భేటీ అయ్యారు. ఈ మేర చక్రం తిప్పిన కేసీఆర్ ను చూసి అంతా ఆశ్చర్యపడుతుండగానే.. అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా దక్కించుకున్నారు. శనివారం సాయంత్రం అమిత్ షాతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీలో కేసీఆర్ వరుస భేటీలు చూస్తుంటే.. జగన్ కంటే కేసీఆరే తోపు అని ఒప్పుకోవాల్సిందే కదా.
అమిత్ షాతో ఏమేం చర్చించారు?
కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాతో భేటీ సందర్భంగా కేసీఆర్ పలు కీలకాంశాలను ప్రస్తావించినట్టుగా సమాచారం. విభజన చట్టం హామీలను అమలు చేయాలని కోరిన కేసీఆర్.. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్య, వాటికి అవసరమైన సివిల్ సర్వెంట్లు.. ప్రత్యేకించి ఐపీఎస్ అధికారుల కొరతను ప్రస్తావించారట. పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కూడా తెలంగాణకు కేటాయించాలని ఆయన కోరారట. అంతేకాకుండా ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక భవనం తెలంగాణ భవన్ నిర్మాణం కోసం స్తలాన్ని కూడా కేటాయించాలని కేసీఆర్ కోరారట. మరి కేసీఆర్ వినతులకు అమిత్ షా ఏ రీతిన స్పందించారో చూడాలి.
Must Read ;- జగన్ కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసినట్టే!











