నితిన్ హీరోగా రూపొందిన ‘మాస్ట్రో’ చిత్రం ఓటీటీ ద్వారా ఈరోజు విడుదలైంది. బాలీవుడ్ చిత్రం ‘అంధాదున్’కు రీమేక్ గా దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ దీన్ని నిర్మించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి దీనికి నిర్మాతలు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
చూపు ఉన్నా అంధుడిగా నటిస్తే జరిగే పరిణామాలకు క్రైమ్ ట్విస్ట్ జోడించి రూపొందించిన కథ ఇది. అరుణ్ పియానో వాయిద్యకారుడు. కళ్లు లేకపోయినా సంగీత విద్వాంసుడిగా ఉంటే బాగుంటుందనుకుని తనకు ఓ ప్రమాదంలో కళ్లు పోయాయని చెప్పుకుంటూ జీవనం సాగిస్తాడు. పియానో కొనుగోలు చేయడానికి సోఫీ (నభా నటేష్) ఇంటికి వెళతాడు. ఆ పరిచయం ఆమెతో స్నేహంగా మారి ఆమె రెస్టారెంట్ లో పియానో వాయిస్తూ ఉంటాడు. అలా వీరి మధ్య ప్రేమ బంధం కూడా ఏర్పడుతుంది.
ఆ రెస్టారెంట్ కు వచ్చే ఒకనాటి హీరో మోహన్ (వీకే నరేష్)కు అరుణ్ సంగీతం నచ్చుతుంది. తన భార్య సిమ్రన్ (తమన్నా) పుట్టిన రోజున తన ఇంట్లో పియానో వాయించాల్సిందిగా ఆహ్వానించి అడ్రస్ తో పాటు అడ్వాన్స్ కూడా ఇస్తాడు. మోహన్ కు ఆమె రెండో భార్య. అలా మోహన్ ఇంటికి వెళ్లిన అరుణ్ ఆ ఇంట్లో మోహన్ హత్యకు గురై ఉండటాన్ని గమనిస్తాడు. అతను గుడ్డివాడని సిమ్రన్ అనుకుంటుంది. అరుణ్ ఇంట్లో ఉండగానే మోహన్ మృతదేహాన్ని తన ప్రియుడితో కలిసి బయటికి తరలించేస్తుంది.
ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి వెళ్లిన అరుణ్ అక్కడ సిమ్రన్ ప్రియుడే పోలీస్ అధికారి అని గుర్తించి తెలివిగా తప్పుకుంటాడు. ఇలా ఒక హత్య ఇంకో హత్యకు దారితీస్తుంది. అరుణ్ గుడ్డివాడు కాదని తెలుసుకున్న సిమ్రన్ అతనికి విషమిచ్చి నిజంగానే గుడ్డివాడిని చేస్తుంది. చివరికి ఈ కేసు ఎలా మలుపులు తిరిగింది? దాన్ని అరుణ్ ఎలా ఛేదించాడు అన్నదే ప్రధాన కథ.
ఎలా తీశారు? ఎలా చేశారు?
సినిమా ప్రథమార్థం బాగుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ తన నైపుణ్యాన్ని చూపించాడు. ద్వితీయార్థంలో కథనం మందగించింది. దీనికి కారణం హిందీ చిత్రం అంధాధున్ ను మక్కికి మక్కీగా తీయాలనుకోవడమే. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను కొద్దిగా మార్చి ఉంటే బాగుండేది. ముఖ్యంగా ద్వితీయార్థంలో కథ గాడి తప్పింది. హీరో కిడ్నీ రాకెట్ మాఫియా చేతిలో చిక్కుకునే సన్నివేశాలు సుదీర్ఘంగా కొనసాగాయి. మోహన్ ను హత్య చేసిన అసలు విలన్ ఏమయ్యాడో చివరి వరకూ తెలియదు.
అలాగే మోహన్ కూతురు పాత్ర కూడా అంతే. కాకపోతే ఆ కథను మనమే ఊహించుకోవాలి. హిందీ వారికైతే ఫరవాలేదుగానీ తెలుగువారికి మాత్రం కాస్త అరటిపండు ఒలిచినట్టు చెప్పాలి. మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిజం ఎక్కడా ఎలివేట్ కాలేదు. ఆ హీరోయిజం కోసమైనా ద్వితీయార్థంలో కథను మార్చి ఉంటే బాగుండేది. ఒక అపార్ట్ మెంట్ లో హత్య జరిగితే చాలా సులభంగా తప్పించుకోవడం ఈరోజుల్లో సాధ్యమా? అన్న అనుమానం రాకమానదు. మోహన్ హత్యగానీ, మోహన్ ఫ్లాట్ కు ఎదురు ఫ్లాట్ లో ఉండే డిసౌజా హత్య గానీ లాజిక్ కు దూరంగా ఉన్నాయి. సీసీ టీవీ ఫుటేజీలు ఈరోజుల్లో ఉంటున్నాయి.
కేసులో పోలీసు అధికారి ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల కేసు దర్యాప్తు సాగలేదు అని మనం అనుకోవాల్సిందే. ఇక పాత్రల విషయానికి వస్తే నితిన్, నరేష్, తమన్నా, నభానటేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. నిజానికి హిందీ చిత్రంలో టబు పాత్రగానీ, ఆయుష్మాన్ ఖురానా, రాధిక ఆప్టేల పాత్రలుగానీ మంచి హైలైట్ గా నిలుస్తాయి. తెలుగులో ఈ పాత్రలు పోషించిన నితిన్, తమన్నా, రాధికా ఆప్టే కూడా వారికేమీ తీసిపోలేదు. సీఐ బాబీగా సేన్ గుప్తా, అతని భార్యగా శ్రీముఖి బాగానే చేశారు.
సింగర్ మంగ్లీ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఎటొచ్చీ తెలుగు నేటివిటీ కథలో కొరవడింది. హిందీ చిత్రం కూడా ద్వితీయార్థం వీకే. తెలుగులో తప్పనిసరిగా మార్పులు చేయాల్సింది. నితిన్ మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అతడు ఇంతకుముందు నటించిన సినిమాలు కూడా సరిగా ఆడలేదు. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. పైగా హిందీలో విజయవంతమైన ప్రాజెక్టునే టేకప్ చేశారు. థియేటర్లలో ఈ సినిమా విడుదలై ఉంటే ఎలాంటి అనుభూతిని ఇచ్చేదో.
నటీనటులు: నితిన్, తమన్నా, నభానటేష్, వీకే నరేష్, సేన్ గుప్తా, శ్రీముఖి, మంగ్లీ, హర్షవర్ధన్, రచ్చ రవి, శ్రీనివాసరెడ్డి తదితరులు.
సాంకేతిక వర్గం: కథ: శ్రీరాం రాఘవన్, సినిమాటోగ్రఫీ: వై. యువరాజ్, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, సంగీతం: మహతి స్వరసాగర్.
నిర్మాణం: శ్రేష్ఠ్ మూవీస్
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
వేదిక: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
విడుదల తేదీ: 17-09-2021
ఒక్క మాటలో: మ్యాజిక్ చేయలేని మ్యాస్ట్రో
రేటింగ్: 2.5/5











