135 కోట్ల జనాభా..3 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ.. ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశాల్లో అగ్రగామిగా ఉన్న భారత్ ..కరోనా సెకండ్ వేవ్ ధాటికి విలవిలలాడుతోంది. నిత్యం 3లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కొరత వెంటాడుతోంది. రానున్న కాలంలో వైద్యం విషయంలో ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన వైఖరి ఏంటో కరోనా తేటతెల్లం చేస్తోంది. భారత్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు దేశాలు చేయూత నిస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, సౌదీ అరేబియా,స్విట్జర్లాండ్, కెనడా, బ్రిటన్, భూటాన్ తదితర దేశాలు సాయాన్ని ప్రకటించాయి. ఇవి కాకుండా కొన్ని సంస్థలు, టాస్క్ ఫోర్స్‌లు కూడా సాయాన్ని ప్రకటించాయి. ఈ సాయంలో అమెరికా ముందుందని చెప్పవచ్చు. అమెరికా నుంచి 10 కోట్ల డాలర్ల విలువైన పరికరాలు, వస్తువులు అందనున్నాయి. వీటిలో వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ల విలువైన ఎన్ 95 మాస్కులు, 10 లక్షల రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ పరికరాలతో పాటు ఆస్ట్రాజెనికా కంపెనీ భారత్ కోసం 20 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి పంపనుంది.ఇక వ్యాక్సిన్ తయారీకి కూడా సాయం చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇతర దేశాలు ఆక్సిజన్ కాంన్సన్‌ట్రేటర్లు,వెంటిలేటర్లు సరఫరాతో పాటు సాంకేతిక సాయాన్ని అందించనున్నాయి. తాజాగా ఐక్యరాజ్యసమితి కూడా భారత్ అడిగితే సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ట్వీట్ చేశారు. ఈ చేయూత కార్యక్రమాలు ఎలా ఉన్నా.. భారత్ గతంలో ఈ స్థాయిలో అంతర్జాతీయ సహాయం స్వీకరించిన సందర్భాలూ చర్చకు వస్తున్నాయి.
16 ఏళ్ల తరువాత అంతర్జాతీయ సాయం..
సంక్షోభ సమయాల్లో ఆర్థిక చేయూత విషయానికి వస్తే భారత్ 16 ఏళ్ల తరువాత అంతర్జాతీయ సహాయ స్వీకరణకు సిద్ధమైంది.ఈ మేరకు కొన్ని నిబంధనలు కూడా మార్చింది. దౌత్య సాయం, రక్షణ పరికరాలు-సాంకేతిక అంశాల్లో మాత్రమే ఈ 16ఏళ్లలో సహాయాన్ని స్వీకరించిన భారత్ ఇప్పుడు వైద్య, సాంకేతిక విభాగాల్లో సహాయం స్వీకరిస్తోందని చెప్పవచ్చు.ఈ సహాయ స్వీకరణ కూడా దేశాల వారీగా, అంశాల వారీగా ఉండనుంది. చైనా నుంచి ఆక్సిజన్, మెడికల్ కిట్స్ సహాయం పొందేందుకు అంగీకరించినట్టు వార్తలు వస్తుండగా పాకిస్తాన్ కూడా భారత్‌కు సాయం చేస్తామని ప్రకటించింది. పాకిస్తాన్ నుంచి సహాయం స్వీకరించాలా వద్దా అనే అంశంపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తం మీద 2004 తరువాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో యూపీఏ 1 ప్రభుత్వ హయాంలో విదేశీ సహాయ స్వీకరణకు సంబంధించి విధానాలను మార్చింది. ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప దేశ రక్షణ విషయం, అంతర్జాతీయ దౌత్యం మినహా ఎలాంటి సాయం కూడా తీసుకునేందుకు వీల్లేకుండా విధానాలను మార్చింది. అప్పటి నుంచి ఇటీవలి వరకు విదేశీసాయం అందలేదని చెప్పాలి. స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు, వ్యక్తిగత విరాళాలపై కూడా నిఘా పెంచిందని చెప్పవచ్చు.
ఎన్నో విపత్తులు..
1991లో అప్పటి ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఉత్తరఖండ్ (ఉత్తర కాశీ)లో తీవ్ర భూకంపం వచ్చింది. వేలాదిమంది చనిపోయారు. వేల కోట్ల నష్టం వచ్చింది. అలకనంద నదీ పరివాహక ప్రాంతంలో వచ్చిన భూకంపం వల్ల దాదాపు 3లక్షల మంది నిరాశ్రయులయ్యారు.1294 గ్రామాలకు నష్టం వాటిల్లింది. అప్పుడు భారత్‌కు విదేశాల నుంచి ఆర్థిక సాయం అందింది. ఇక 1993లో మహారాష్ట్రలో వచ్చిన భూకంపం భారీగా ప్రాణాలను బలిగొంది.పదివేల మంది చనిపోగా 30వేల మంది గాయపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్, రష్యా, ఇరాన్, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు భారీగా చేయూత ప్రకటించాయి. ఇక 2001లో జనవరి 26న గుజరాత్‌లోని కచ్ డివిజన్‌లో వచ్చిన భూకంపం వల్ల దాదాపు 18వేల మంది ప్రాణాలు కోల్పోయారు.4లక్షల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. భూకంప కేంద్రానికి దగ్గరలో ఉన్న భుజ్ ప్రాంతం శవాల దిబ్బగా మారింది. ఆ తరువాత 2002లో బెంగాల్‌ను తుపాను అతలాకుతలం చేసింది. 2004 జులైలో బీహార్‌ను వరదలు ముంచెత్తాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అంతర్జాతీయంగా భారత్ విదేశీ సాయం స్వీకరించడం ఈ విపత్తుతోనే చివరిదని చెప్పవచ్చు.
Must Read ;- భారత్‌కి 40 కంపెనీల బాసట.. అమెరికా నుంచి స్ట్రైక్ టీం
సాయానికి పలు దేశాలు ముందుకు వచ్చినా..
2004లో డిసెంబరు 26 సునామీ భీభత్సం కారణంగా 14దేశాల్లో 2.3లక్షల మంది చనిపోయారు. భారత్‌లో 10వేల మంది చనిపోయినట్లు అంచనా. ఈ సమయంలో అంతర్జాతీయంగా సహాయం అందించేందుకు పలు దేశాలు ముందుకు వచ్చినా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అంతర్జాతీయ సహాయాన్ని తిరస్కరించారు. అవసరమైతే చేయూత కోరతామని, తమ దేశం ప్రస్తుత్తం అంతర్జాతీయ సహాయం తీసుకునేందుకు సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. ఆ తరువాత కొన్ని రోజులకే పాలసీల్లో మార్పులు చేశారు. అప్పటి నుంచి కొన్ని అంశాల్లో తప్ప భారత్ విదేశీ సాయం పొందలేదు. 2005లో కశ్మీర్ భూకంపం, 2013లో ఉత్తరఖండ్ వరదలు, 2014లో కశ్మీర్ వరదల సమయంలోనూ స్వీకరించలేదు. 2018లో కేరళ వరదల సమయంలో UAE రూ.700కోట్ల భారీ ఆర్థిక సహాయం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు సమాచారాన్ని కేరళ ప్రభుత్వం కేంద్ర సర్కారుకు పంపింది. అయితే అప్పటి పాలసీ కారణంగా అందుకు కేంద్రం సమ్మతించలేదు.
పాలసీల్లో మార్పులు ఇలా..
భారత్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు, 20కి పైగా దేశాలు భారతదేశానికి సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. భూటాన్ ,అమెరికా,బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఐర్లాండ్, బెల్జియం, రొమేనియా, లక్సెంబర్గ్, పోర్చుగల్, స్వీడన్, ఆస్ట్రేలియా, సింగపూర్, సౌదీ అరేబియా, హాంకాంగ్, థాయిలాండ్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, నార్వే , ఇటలీ, యుఎఇ ముందుకు వచ్చాయి. అయితే ఇవి నేరుగా సాయం అందించేందుకు వీల్లేదు. భారత ప్రభుత్వ అనుమతి ఉన్న పీఎం కేర్స్ ఫండ్‌కి, లేదా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కాని అందించాల్సి ఉంటుంది. వైద్య సహాయం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ (పబ్లిక్ హెల్త్)తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. దిగుమతులు కూడా కేంద్ర పరిధిలోనే ఉంటున్న నేపథ్యంలో కేంద్ర పర్యవేక్షణలో మాత్రమే సాయం పొందే వీలుంది. మొత్తం మీద 16ఏళ్ల తరువాత భారత్ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పవచ్చు.
Also Read ;- అందరి దృష్టి భారత్‌పై.. మోదీ పరపతికి దెబ్బ?