ఒకరేమో ఏపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి.. మరో ఇద్దరేమో.. పోలీస్ వ్యవస్థలో పెద్ద పదువుల్లో ఉన్న వ్యక్తులు. అటువంటి వారిపై హైకోర్టు న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. కోర్టు దిక్కరణ కేసులో హైకోర్టు ముందు హాజరైన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఐజీలపై న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొందరు అధికారుల తీరు విస్తుగొలుపుతోందని, వారు తాము చట్టానికి అతీతులమనే భావనలో ఉన్నారని, ఇలాంటి ధోరణి ఏపీలోనే చూస్తున్నామని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఇంత నిర్లక్ష్యమా?
ఎవరైనా, ఎంతటి వారైనా రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో కోర్టుకు హాజరైన డీజీపీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి ను ఉద్దేశించి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో ఓ కేసు విచారణకు డీజీపీ హాజరైన సందర్భంగా.. సిన్సియర్ ఆఫీసర్ అన్న భావన వ్యక్తపరిచామని.. ప్రస్తుత పరిణామాలు గమనించాక ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వస్తోందని పేర్కొంది.
Must Read ;- ఆలయాలపై దాడులపై డీజీపీ యూటర్న్& రీజనేంటంటే?
అసలేంటి విషయం?
ఎస్సైగా పనిచేస్తున్న రామారావుకు సీఐగా ప్రమోషన్ ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు నోటీసులు అందుకున్న హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఐజీలు డిసెంబరు 29న విచారణ హజరుకాలేదు. దీంతో.. జనవరి 25కి కేసు వాయిదా వేశారు. ఈ నెల 25న కూడా ప్రతివాదులు కోర్టుకు రాకపోవడంతో.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. డీజీపీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అనంతరం.. ప్రభుత్వం తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు వారెంటు ఉపసంహరించుకున్నారు. 27న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో.. బుధవారం ప్రతివాదులందరూ హాజరయ్యారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎప్పుడు అందుకున్నారని డీజీపీని న్యాయమూర్తి ప్రశ్నించారు. డీజీపీ వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేయగా…. న్యాయమూర్తి స్పందిస్తూ అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవడానికి ఇది మీ కార్యాలయం కాదని, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కోర్టు అని అన్నారు. పూర్తి వివరాలతో కోర్టు ముందుకు హాజరు కావాలన్నారు. డీజీపీ బదులిస్తూ తీర్పు అమలు విషయంలో జేడీ ప్రాసిక్యూషన్ నుంచి సలహా తీసుకోవడంలో జాప్యం జరిగిందని వివరించారు. ఆదేశాల అమలులో జాప్యం ఎందుకు జరిగిందో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను ఫిబ్రవరి 25కి వాయిదా వేశారు.
Also Read ;- హైకోర్టు సీరియస్ : కోర్టు దిక్కరణ కేసులో హాజరు కావాలని డీజీపీకి నోటీసు
ఎంతకంత నిర్లక్ష్యధోరణి?
డీజీపీ కోర్టు మొట్టికాయలు ఇదేం కొత్త కాదు. గతంలో కూడా చాలా సార్లు కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. అయినా సరే, తన ప్రవర్తనలో ఇసుమంతైనా మార్పు రాకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పైగా గతంతో పోలిస్తే, డీజీపీ ప్రవర్తనలో నిర్లక్ష్య ధోరణి, కోర్టుల తీర్పుల పట్ల ఉదాసీనత కన్పించడం ఆందోళన కలిగిస్తున్న విషయం. చట్టం, న్యాయం ఒకదానితో ఒకటి సమన్వయపరచుకుంటూ పోతేనే రాష్ట్రమైనా, దేశంలోనైనా శాంతి భద్రతలు ఉంటాయి. అలాంటిది పోలీసు వ్యవస్థాధిపతిగా వ్యవహరిస్తున్న డీజీపీ స్థాయి వ్యక్తి ఇలా ప్రవర్తించడం న్యాయమూర్తులు సైతం విస్తుపోయేలా చేసింది. గతంలో మీ పైన ఉన్న సదభిప్రాయం నేడు పోతుందని అర్ధం ధ్వనించేలా న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం అందుకు నిదర్శనం. ఇకనైనా డీజీపీ తన ప్రవర్తన మార్పు తెచ్చుకుని బాధ్యతాయుతంగా ఉంటారేమో చూడాలి.
Also Read ;- ‘చంపడానికైనా సిద్దమే’ వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు