తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దండుకున్నారని, ఇలా తనకు సహకరించిన వారికి వైఎస్సార్ సర్కారు నుంచి మేళ్లు జరిగాయన్న ఆరోపణలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయ్యింది. సీబీఐ నమోదు చేసిన ఈ కేసులను ఆధారంగా చేసుకుని ఈ కేసుల్లో మనీ లాండరింగ్ కూడా జరిగి ఉంటుందన్న భావనతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా జగన్‌పై కేసులు నమోదు చేసింది. ఈ కేసులన్నింటిలో ఇప్పటికే అటు సీబీఐతో పాటు ఇటు ఈడీ కూడా కోర్టులకు చార్జిషీట్లను కూడా అందించింది. అంటే.. ఇక విచారణే తరువాయి అన్న మాట. ఇలాంటి సమయంలో ఈ కేసుల విచారణను మరింత ఆలస్యం చేసే దిశగా జగన్‌తో పాటు జగన్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా తమదైన ఎత్తులు ప్రయోగిస్తున్నారు. ఈ ఎత్తులన్నీ పటాపంచలు కాగా.. కేసుల విచారణకు రంగం సిద్ధమైపోయిన తరుణంలో జగన్ మరో పిటిషన్‌ను దాఖలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
జగతి కేసు నుంచి జగన్‌ను తొలగించాలట
జగతి పబ్లికేషన్స్ పేరు తెలిసిందే కదా. జగన్ ప్రారంభించిన సాక్షి పత్రిక యజమాని ఈ కంపెనీనే. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా.. జగనే ఎండీగా ఈ కంపెనీ ప్రారంభమైంది. ఆ తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక, వైసీపీ ప్రారంభమయ్యాక.. కంపెనీ వ్యవహారాలను తన సతీమణికి అప్పగించిన జగన్.. ఆ కంపెనీ నుంచి దూరం జరిగారు. అయినా కూడా ఇప్పటికీ జగన్ కుటుంబమే జగతి పబ్లికేషన్ యజమాని. ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ, ఇతరులతో జగన్ క్విడ్ ప్రొకోకు పాల్పడ్డారన్నది సీబీఐ ఆరోపణ. ఇదే అంశాన్ని ఆధారం చేసుకుని ఈడీ కూడా కేసు నమోదు చేసింది. తాజాగా ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ జగన్ సీబీఐ-ఈడీ కోర్టులో డిశ్చార్జీ పిటిషన్ దాఖలు చేశారు. జగతి పబ్లికేషన్ కేసులో మనీ లాండరింగ్ జరగలేదని, ఈ కారణంగా ఆ కేసు నుంచి జగన్ పేరును తొలగించాలని ఆయన తరఫు న్యాయవాది మంగళవారం నాడు ఈడీ కోర్టును కోరారు. దీనిపై సమాధానం ఇచ్చేందుకు తమకు గడువు కావాలని ఈడీ కోరగా.. కేసు విచారణను కోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది.
మరి క్విడ్ ప్రొకో మాటేమిటో..?
జగతి పబ్లికేషన్స్ కేసులో మనీ లాండరింగ్ జరగలేదని స్వయంగా జగనే చెబుతున్నా.. మరి ఇదే సంస్థ పేరిట సీబీఐ నమోదు చేసిన క్విడ్ ప్రొకో వ్యవహారం మాటేమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్విడ్ ప్రొకో పద్దతిన నిమ్మగడ్డ ప్రసాద్ జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెడితే.. ఆయనకు చెందిన వాన్ పిక్ కంపెనీకి భారీ ఎత్తున వైఎస్సార్ సర్కారు భూములు కట్టబెట్టిందన్న ఆరోపణలున్నాయి కదా. మనీ లాండరింగ్ జరగలేదంటే.. క్విడ్ ప్రోకో జరిగినట్టుగా జగన్ ఒప్పేసుకున్నట్లేనా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అసలు ఆర్థిక పరమైన అక్రమాల గురించి మాట్లాడకుండా.. కేవలం మనీ లాండరింగ్ మాత్రమే జరగలేదని చెబుతున్నారంటే.. ఆర్థికపరమైన అక్రమాలు జరిగినట్టుగా ఒప్పుకున్నట్లే కదా అన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయినా అన్ని కేసుల్లో ఏ1గా ఉన్న జగనే స్వయంగా ఓ కేసులో తన పేరును తొలగించాలంటూ డీశ్చార్జీ పిటిషన్ దాఖలు చేయడం అత్యంత అరుదు అనే చెప్పాలి.
Must Read ;- ఆ ఇద్దరి ప్రైవేట్ జెట్లలో జగన్ విలాసం










