నోరు జారితే దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టమే. అలా నోరు జారి సినిమా రంగంలో నష్టపోయినవారు చాలామందే ఉంటారు. అందులో ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కూడా ఉంటారు. అందుకే ఎక్కడైనా ఏదైనా వేదిక మీద మాట్లాడాల్సి వచ్చినపుడు నోరు అదుపులో పెట్టుకుంటే చాలామంచిది. రామానాయుడు విషయంలో ఏం జరిగిందో చూద్దాం. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు ఎంతో మంది దర్శకుల్ని తెలుగు తెరకు పరిచయం చేసిన విషయం విదితమే. అలాగే ఎంతోమంది నటీనటుల్ని అందలం కూడా ఎక్కించారు.
ఓ విషయం తెలియాలంటే ఆయన నిర్మించిన ‘సెక్రటరీ’ సినిమా సంగతుల్లోకి వెళ్లాలి. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అక్కినేని నాగేశ్వరరావు, వాణీశ్రీ నటించిన ఈ సినిమా పెద్ద హిట్. యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమా వంద రోజుల వేడుక జరుగుతోంది. ఆ వేదికపై నటుడు కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ ‘రామానాయుడు గారు తలుచుకుంటే నేను హీరోగా నటించినా సినిమా సూపర్ హిట్టవుతుంది’ అన్నారట. దాంతో నాయుడుగారు ‘మీకు హీరో అవ్వాలనుంటే చెప్పండి సినిమా తీసేస్తాను’ అని వేదిక మీదే నోరు జారారు.
ఏదో కాకతాళీయంగా జరిగిందే కదా అని నాయుడుగారు ఆ విషయాన్ని మరచిపోయారు. కానీ కైకాల మాత్రం ఊరుకోలేదు. తాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో హీరోగా నటించబోతున్నానంటూ ప్రెస్ మీట్ లో ప్రకటించేశారు. కైకాల విషయం అలా ఉంచితే కృష్ణ, జయచిత్ర జంటగా రామానాయుడు నిర్మించిన ‘సావాసగాళ్లు’ చిత్రంలో హాస్యనటుడు నగేష్ ఓ ప్రధాన పాత్ర పోషించారు. షూటింగ్ జరిగే సమయంలో దర్శకుడు బోయిన సుబ్బారావుకు సలహాలు ఇవ్వడం ప్రారంభించారు నగేష్. పైగా అది బోయిన సుబ్బారావుకు మొదటి చిత్రం.
ఇలా నగేష్ ఇన్వాల్వ్ అయితే సినిమా పాడవుతుందేమోనని ‘కొత్త కుర్రాడిని కంగారు పెట్టొద్దు.. మీకు దర్శకత్వం చేయాలనుంటే చెప్పండి.. అవకాశం ఇస్తాను’ అని మాట ఇచ్చారట. దాంతో నగేష్ కూడా కథ పట్టుకెళ్లి నేను రెడీ మీరు రెడీయా అన్నారట. మొహమాటానికి మాట ఇచ్చినందుకు సినిమా చేయక తప్పలేదు. ఇద్దరి మాటా నిలబెట్టాలి కాబట్టి సత్యనారాయణ హీరోగా నగేష్ దర్శకత్వంలో ‘మొరటోడు’ నిర్మించారు. మొహమాటానికి పోతే ఏదో అవుతుంది అన్నట్టుగానే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. లెక్కలు తేలిస్తే ఐదు లక్షలు బొక్క పడింది. అదన్నమాట సంగతి.
Must Read ;- ‘మాయాబజార్’ సినిమా అంటే జంధ్యాలకి అంతిష్టం మరి!











