స్వర్గీయ ఎన్టీరామారావు ప్రారంభించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి పేద క్యాన్సర్ రోగులకు కల్పతరువుగా వెలుగొందుతోంది. మంగళవారానికి 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఆసుపత్రి చైర్మన్, ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని పేదలకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్లు, ప్రస్తుతం 500 పడకలకు విస్తరించి సేవలందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక కారణాలతో ప్రజలు క్యాన్సర్ బారినపడి మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. అత్యాధునిక పరికరాలతో రోగులకు చికిత్సలు చేస్తూ చాలామందికి ఊరట కలిగించినట్లు తెలిపారు. క్యాన్సర్ రోగులకే కాకుండా బ్లాక్ ఫంగస్ సోకిన ఆరుగురికి కూడ చికిత్స అందించి డిశ్చార్జి చేసినట్లు ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.
లాభాపేక్ష లేకుండా సేవలు..
1989లో హైదరాబాద్‌లోని బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ పౌండేషన్, అమెరికాలోని అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్‌లు సంయుక్తంగా ఈ ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించాయి. లాభాపేక్ష లేకుండా క్యాన్సర్ రోగులకు సేవలందించేందుకు ఈ రెండు సంస్థల సహకారంతో 2000లో 50 బెడ్లతో ప్రారంభమైన ఆ ఆస్పత్రి నేడు 500 బెడ్లతో సేవలందిస్తోంది. నిరంతరం అత్యాధునిక పరికరాలను సమకూర్చుకుంటూ నేడు ఏడు విభాగాల్లో సామాన్యులకు కూడ అందుబాటులో ఉండేలా ఆదునిక వైద్య సేవలందిస్తోంది. ఆయా రంగాల్లో నిష్టాతులైన వైద్యలు, ప్రముఖులు ఎంతో మంది ఈ ఆస్పత్రి ట్రస్టులో సభ్యులుగా ఉండి ప్రత్యక్షంగా, పరోక్షంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా..
రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో సేవలందిస్తున్నారు. వైద్యుల కన్సల్టేషన్ ,పరీక్షలు ఇతర అన్ని సర్వీసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అధికారి సహకారంతో పొందవచ్చు. సామాన్యులకు బెడ్లతో పాటు 38 డీలక్స్, సూపర్ డీలక్స్ రూంలు కూడ అందుబాటులో ఉన్నాయి. రోగులకు, వారి వెంట వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులను ఆస్పత్రిలో సమకూర్చారు.
ఈ విధంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్‌లో సామాన్యులకు అందుబాటులో క్యాన్సర్ వైద్యం అందిస్తూ పలువురి ప్రశంసలు పొందుతోంది.
Must Read ;- అటు క్యాన్సర్,ఇటు కరోనా.. BIACH&RI విశేష కృషి