జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అధికార విపక్ష పార్టీల విమర్శలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. విమర్శల పదును కూడా పెరిగింది. ముఖ్యంగా బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ ప్రచార సభలను జోరుగా నిర్వహిస్తోంది. ఏకంగా జాతీయ నాయకులను తీసుకొచ్చి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృష్టి చేస్తోంది. నిన్న సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభకు జాతీయ బీజేవైఎం అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య హాజరయ్యారు. ఈరోజు మురళీధర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రోడ్ షోలలో పాల్గొంటున్నారు.ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీపై మంత్రి కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. బీజేపీ నేతలు కేవలం మాటలకే అని, చేతలకు పనికిరారని, వారిదగ్గర అసలు విషయం ఉండదని విమర్శించారు.
మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ ఏమి చేసిందిలేదని మంత్రి తెలిపారు. తెలంగాణకు రూ.లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకొస్తే పీఎం ప్రధానిని తాము కూడా పొగుడుతామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఏమీ చేయలేదని మంత్రి కేటీఆర్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని, కేవలం నీళ్లు, మట్టి తప్పా అని ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే కేటీఆర్ బీజేపీపై చేసిన ఈ కామెంట్స్ పట్ల బీజేపీ నేతలు మండి పడుతున్నారు. నలుగురు బీజేపీ ఎంపీలున్న తాము రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకొస్తే.. మరీ తొమ్మిది మంది ఎంపీలున్న టీఆర్ఎస్ పార్టీ ఎన్ని రూ.లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ మేనిఫెస్టోపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్షరం పొల్లుపోకుండా గత మేనిఫెస్టోనే మళ్లీ విడుదల చేశారన్నారు. టీఆర్ఎస్ మెనిఫెస్టో ఆచరణలో సాధ్యం కాదని, టీఆర్ఎస్ మాటలకు, ఆచరణకు ఏమాత్రం పొంతనలేదని ఆయన విమర్శించారు. దుబ్బాక తరహాలోనే గ్రేటర్ ఎన్నికల్లోనూ ప్రధాన పోటీ టీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉండనున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- ‘అమ్మ’కే స్టార్ క్యాంపెయినర్.. మళ్లీ ఆ పార్టీలోకే..