బాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ హీరో ఎవరంటే.. అందరూ విక్కీ కౌశల్ గురించే చెబుతారు. అతడి నటనా కౌశలం గురించి ఎంత చెప్పినా తక్కువే. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ కెరీర్ ప్రారంభించిన విక్కీ .. చాలా తక్కువ సమయంలోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘మసాన్, రామన్ రాఘవ్, లస్ట్ స్టోరీస్, సంజూ, మన్మర్జియాన్’ లాంటి సినిమాలు విక్కీకి బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక ‘యురి’ మూవీ అయితే చెప్పనక్కర్లేదు. అందులో అతడి నటనకి నేషనల్ అవార్డు సైతం వరించి తరించింది.
ప్రస్తుతం ‘భూత్’ , ‘సర్దార్ ఉధమ్ సింగ్’ బయోపిక్ లో నటిస్తున్న విక్కీ.. త్వరలోనే సూపర్ హీరోగా రాబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ‘యురి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి ‘అశ్వథ్థామ’ అనే టైటిల్ కూడా నిర్ణయించారట. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో విక్కీ కౌశల్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన టెక్నీషియన్స్ ను ఖరారుచేశారు. సూపర్ హీరో పాత్రకు సంబంధిచిన వి.యఫ్.ఎక్స్ డిజైన్ ను రెడీ చేస్తున్నారట. అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సూపర్ హీరో సినిమా విక్కీకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.










