శవాలపై జీవాలు అనే ఓ మాట ఉంది. అవకాశాన్ని అదునుగా చేసుకుని డబ్బులు దండుకునే బాపతు జనం గురించే ఈ మాటలు. సోనూ సూద్ ఫౌండేషన్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేసుకుంటున్న విషయం తెలిసి సోనూ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. అది పెద్ద స్థాయిలో చేసే దోపిడీ. డబ్బులు లేక పస్తులుంటున్న పావలా శ్యామల పేరుతో కూడా కొందరు డబ్బులు వసూలు చేసుకుంటున్నారట. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమే కానీ కొందరు తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకోవడం దారుణమని ఆమె వాపోతోంది.
కొందరు డబ్బులు వసూలు చేసి లక్ష రూపాయలతో తమ సంస్థ సభ్యత్వం ఇప్పిస్తాం అని వసూళ్లు మొదలుపెడుతున్నారంది. అసలు వాళ్ళు ఇచ్చే ఆరు వేల పెన్షన్ కోసం లక్ష రూపాయలు ఈ వయసులో కట్టుకోవాల్సిన అవసరం తనకు ఉందా అని ఆమె ప్రశ్నించారు. ఆ డబ్బుల్ని తనకు ఇస్తే, మూడు నెలల ఇంటి అద్దె బకాయి చెల్లించుకుంటానని అని శ్యామల అన్నారు. ఇంట్లో పచ్చళ్ళు, కుక్కర్లు, కూలర్లు తమకు ఇవ్వాల్సిన అవసరం లేదని, నెలకు మందులకు తమకు రూ. పది వేలకు పైనే ఖర్చవుతోందన్నారు. దాతలు డబ్బులు ఎవ్వరికీ ఇవ్వొద్దని, నేరుగా తనకు ఇచ్చే ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.
ఎంతో ఆత్మ గౌరవం తో, ఎన్నో పురస్కారాలతో గౌరవంగా బతుకుతున్నానని, కొందరు తన పరువును బజారులో పెట్టి డబ్బులు దండుకోవడం, టీవీలలో ఏదో ఆదుకున్నట్లుగా ఇంటర్వ్యూలు ఇవ్వడం తనలో మరింత బాధ ను పెంచుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా సాయం చేయాలనిపిస్తే నేరుగా తన ఫోన్ నెంబర్ 9849175713 లో సంప్రదించాలని కోరారు. డబ్బులను తన అకౌంట్ లో వేసినా బ్యాంకుకు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి లేదని, గూగుల్ పేటిఎం కూడా తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. ఫోన్ లో సంప్రదించి నేరుగా తనకు డబ్బులు అందించాలని, తనకు మధ్యవర్తులు ఎవ్వరూ లేరని ఆమె వివరించారు.
Must Read ;- హిందూపురం ప్రజల శ్రేయస్సు కోసం రంగంలోకి బాలయ్య











