మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగ సమస్యలపై భావోద్వేగంతో మాట్లాడటం సినిమా వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. తమ్ముడు ఆవేశంతో మాట్లాడితే, ఈ అన్న మాత్రం ఆవేదనతో మాట్లాడారు.. అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్.
తమ్ముడు వ్యక్తిగతంగా వెళితే, అన్న వ్యవస్థాగతంగా వెళ్లారు. చిత్ర పరిశ్రమ అనేది భాషకు సంబంధించింది. రెండు రాష్ట్రాలు ఉన్నా సినిమా భాష మాత్రం ఒక్క తెలుగే. కానీ టిక్కెట్ల రేట్ల విషయంలో తెలంగాణలో ఒక విధంగా, ఏపీలో మరో విధంగా ఉంది. పైగా ఏపీలో ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద కాకపోయినా టిక్కెట్ల రేట్లను పెంచితేనే సినిమా పరిశ్రమకు మనుగడ అన్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి ప్రసంగం కొనసాగింది. తమ్ముడు తనవాడైనా మెగాస్టార్ ధర్మమే మాట్లాడారు.
తన ప్రసంగానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వేదిక చేసుకోగా, అన్న చిరంజీవి మాత్రం సంతోషం – సుమన్ టీవీ ఇండియన్ ఫిలిమ్ అవార్డుల వేడుకను వేదిక చేసుకున్నారు. ఐదు రూపాయలు, పది రూపాయలను యాచకులు కూడా తీసుకోని ఈ రోజుల్లో టిక్కెట్ల రేట్లకు పెంచకపోవడం ఎంతవరకు సబబు అన్నట్లుగా మెగాస్టార్ మాట్లాడారు. టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించడాన్ని ఆయన దుయ్యబట్టారు. ఒకప్పుడు మహారాజులు సైతం కళాకారుల్ని ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈరోజున 100 కోట్లు, 200 కోట్లతో నిర్మాతలు సినిమాలు తీస్తున్నారంటే వారి దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి సినిమాలు చేయడం లేదన్నారు.
కలిసి మాట్లాడే అవకాశమే లేదట
తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నప్పుడు ప్రభుత్వం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. టిక్కెట్ రేటు ఇంత తక్కువగా ఉంటే పెద్ద సినిమాలు తీయడం కష్టసాధ్యమవుతుందని అన్నారు. ఇంత పెద్ద సినిమాలు తీయడం వల్ల ట్యాక్సుల రూపంలో కూడా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ హీరోల పారితోషికం విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు అతి తక్కువ మంది ఉన్నారని, కానీ వీరు చేసే సినిమాల వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి తాను అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా వాళ్ల కష్టాల గురించి అర్థమయ్యేలా చెప్పాలన్నదే తన తపన అన్నారు.
ఈమధ్య కాలంలో మెగాస్టార్ ఇంత భావోద్వేగంగా ఎప్పుడూ మాట్లాడలేదు. దీనిపై మిగిలిన హీరోలు, దర్శకులు కూడా గళం విప్పితే బాగుంటుందేమో. ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు పెంచకపోవడం వల్ల చాలా సినిమాలు విడుదల కాకుండా ఉన్నాయి. ఏపీలో 15, 20, 35 రూపాయలుగా టిక్కెట్ రేట్లు ఉన్నాయి. ఇన్ని రకాలుగా కాకుండా దీన్ని రూ. 100గా మార్చమని చిత్ర పరిశ్రమ కోరుతోంది. కానీ ప్రభుత్వం దీనిపై స్పందించడం లేదు. వచ్చే డిసెంబరు, జనవరిలో భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వాటి విడుదలకు ముందే ప్రభుత్వ పరంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్లు చిత్ర పరిశ్రమ నుంచి ఉన్నాయి.
ప్రభుత్వం పై ఘాటైన విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని ప్రభుత్వం ఈ విషయంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదని సినీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ఆయన నటించిన ‘భీమ్లానాయక్’ను ఇరుకున పెట్టాలని ప్రభుత్వం చూస్తోందని కొందరు అంటున్నారు. ఒక వేళ ప్రభుత్వం పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే టిక్కెట్ రేట్లను పెంచుకోవచ్చంటే మాత్రం భీమ్లా నాయక్ లాంటి సినిమాలు ఇరుకున్న పడతాయి. ఏంజరగబోతుందో వేచి చూడాలి.
Must Read ;- మెగాస్టార్ మూవీలో పవర్ స్టార్.? ఇది నిజమా?











