హిట్ సినిమాలు మళ్లీ వస్తున్నాయ్
రీ-రిలీజ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడో పోయింది. వంద రోజుల పండగలే కనుమరుగైపోయాయి. ఇలాంటి టైమ్ లో ఆల్రెడీ రిలీజైన సినిమాలే మరోసారి థియేటర్లలోకి రాబోతున్నాయి. 80ల నాటి ట్రెండ్స్ ను ఇప్పటి జనరేషన్ కు చూపించబోతున్నాయి.
ఓ సినిమా హిట్ అవ్వడమే ఇప్పుడు గగనంగా మారింది. టాలీవుడ్ లో సక్సెస్ రేటు 10శాతం లోపే. వంద సినిమాల్లో 10 హిట్టయితే పెద్ద విషయం. అలాంటిది రిలీజైన సినిమానే మళ్లీ రిలీజ్ అయ్యే అవకాశాలు అస్సలు లేవు. కానీ పరిస్థితులు మారిపోయాయి. కరోనా వచ్చిన తర్వాత బాక్సాఫీస్ లో అసాధారణ పరిస్థితులు చూస్తున్నాం. అందులో భాగంగానే సినిమాలు కూడా ఆల్రెడీ రిలీజైనవే మళ్లీ మరోసారి థియేటర్లలోకి రాబోతున్నాయి.
ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకోవడమే గగనం అయింది. సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరిచినా సినిమాలు వెంటనే రావడం ఇబ్బందిగా మారింది. దీంతో ఇప్పటికే విడుదలై హిట్ అయిన సినిమాల్ని మళ్లీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇఁదులో భాగంగా వకీల్ సాబ్, క్రాక్ లాంటి సినిమాలు త్వరలోనే మరోసారి థియేటర్లలో కనువిందు చేయబోతున్నాయి.
ఏప్రిల్ లో రిలీజైంది వకీల్ సాబ్ సినిమా. సినిమాకు మంచి టాక్ వచ్చింది. వసూళ్లలో ఊపు కనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ మెల్లమెల్లగా బయటకు రావడం మొదలైంది. సరిగ్గా అప్పుడే సెకెండ్ వేవ్ వచ్చింది. దీంతో ఏం చేయలేని పరిస్థితి. ప్రభుత్వం చెప్పకముందే థియేటర్లు మూసేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య వకీల్ సాబ్ ను కూడా థియేటర్ల నుంచి ఎత్తేయాల్సి వచ్చింది. అలా తొలిగించిన ఈ సినిమాను ఈ నెలాఖరు నుంచి తిరిగి థియేటర్లలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు నిర్మాత దిల్ రాజు.
థియేటర్లు తెరవడానికి అనుమతులు వచ్చిన వెంటనే మరోసారి తెలంగాణ, ఏపీ అంతటా వకీల్ సాబ్ ను రీ-రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఆల్రెడీ ఓటీటీలో వచ్చేసింది. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పటికీ కొంతమంది ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా పవన్ అభిమానులు ఈ సినిమాను మరోసారి థియేటర్లలో చూడ్డానికి అస్సలు వెనకాడరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వకీల్ సాబ్ ను మరోసారి రిలీజ్ చేయాలనుకుంటున్నాడు దిల్ రాజు.
అటు క్రాక్ సినిమాను కూడా ఇంకోసారి వెండితెరపైకి తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. రవితేజకు చాన్నాళ్ల తర్వాత ఓ హిట్ అందించింది. ఆ తర్వాత ఓటీటీలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. థియేటర్లు మరోసారి తెరుచుకున్న తర్వాత ఆడియన్స్ ను మరోసారి థియేటర్లకు రప్పించాలంటే క్రాక్ లాంటి హిట్ సినిమాలు పడాల్సిందేననని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడ్డారు. దానికి తగ్గట్టే క్రాక్ మరోసారి రిలీజ్ కాబోతోంది.
క్రాక్, వకీల్ సాబ్ సినిమాలే కాదు. ఇదే కోవలో జాతిరత్నాలు, ఉప్పెన సినిమాల్ని కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్లు తెరుచుకున్న తర్వాత స్క్రీన్స్ అందుబాటులో ఉంటే ఈ రెండు సినిమాలు కూడా చెరో వారం పాటు సినిమా హాళ్లలో కనిపించబోతున్నాయి. ఇలా 80ల నాటి ట్రెండ్ ను గుర్తుచేస్తూ.. 2021లో రీ-రిలీజ్ ల హవా మొదలైందని చెప్పొచ్చు. అయితే ఇదంతా తాత్కాలికం మాత్రమే. ఓ మోస్తరు సినిమాలు ఎప్పుడైతే విడుదలకు సిద్ధమౌతాయో.. అప్పుడిక ఈ పాత సినిమాలన్నీ తిరిగి వెనక్కి వచ్చేస్తాయన్నమాట.
Must Read ;- అనిల్ రావిపూడితో సినిమా పై బాలయ్య క్లారిటీ