విశాఖలో టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు దేవాలయాల్లో ప్రమాణాలకు దారితీసింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ భూ కబ్జాలకు పాల్పడ్డాడని, ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా సహించేది లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వారం క్రితం హెచ్చరించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, కావాలంటే గుడిలో ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు. సవాల్‌ను స్వీకరించాల్సిన వైసీపీ నేతల విజయసాయిరెడ్డి సైడైపోయారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సవాల్‌ను విశాఖ తూర్పు వైకాపా ఇన్ ఛార్జి విజయనిర్మల స్వీకరించారు.
విశాఖ ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడిలో ఇరువురి నేతలూ ప్రమాణాలకు సిద్దం అయ్యారు. దీంతో విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇంటి ముందు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. రెండు పార్టీల శ్రేణులు రోడ్లపైకి రావడంతో పోలీసులు సాయిబాబా గుడివద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
గజం కూడా కబ్జా చేయలేదు
విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణదిగా బావిస్తున్న ఓ స్థలాన్ని గత వారం కార్పొరేషన్ సిబ్బంది స్వాధీనం చేసుకుని ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెట్టారు. అయితే ఆ భూమికి నాకు ఎలాంటి సంబందం లేదని వెలగపూడి రామకృష్ణ స్పష్టం చేశారు. కబ్జా ఆరోపణలు చేస్తున్న దానిలో తనకు గజం భూమి కూడా లేదని, సాయిబాబా గుడిలో ప్రమాణం చేయడానికి సిద్దమని విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. ఎలాంటి అవినీతికి తాను పాల్పడలేదని రూ.100 స్టాంపు పేపరుపై రాసి ఇస్తానని, వారు కూడా ఇవ్వడానికి సిద్దమా అని ఆయన సవాల్ విసిరారు. దీనిపై ఇంత వరకూ విజయసాయిరెడ్డి స్పందించలేదు. కానీ విశాఖ తూర్పు వైసీపీ ఇన్ ఛార్జి విజయనిర్మల సవాల్ ను స్వీకరించారు.
Must Read ;- వెలగపూడి సవాల్‌ను విజయసాయిరెడ్డి స్వీకరిస్తారా..?
సాయిబాబా గుడిలో ప్రమాణం చేసిన విజయనిర్మల
సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య విశాఖ తూర్పు వైసీపీ ఇన్ ఛార్జి విజయనిర్మల, అనుచరులు పెద్ద ఎత్తున ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా ఆలయానికి చేరుకున్నారు. అక్రమాస్తులపై ఎమ్మెల్యే వెలగపూడి ప్రమాణం చేయాలని వైసీపీ నేతలు నినాదాలు చేశారు. అనంతరం విశాఖ తూర్పు వైసీపీ ఇన్ ఛార్జి విజయనిర్మల సాయిబాబా గుడిలో ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే రాకుంటే సాయిబాబా ఫోటోను ఆయన ఆఫీసుకు తీసుకెళ్తామని కార్యకర్తలు స్పష్టం చేశారు.
విజయసాయిరెడ్డి సవాల్ స్వీకరించాలి
తాను విసిరిన సవాల్ ను విజయసాయిరెడ్డి స్వీకరించాలని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ డిమాండ్ చేశారు. కేసుల మాఫీ కోసం ఢిల్లీలో బీజేపీ నేతల కాళ్లు పట్టుకునే పనిలో విజయసాయిరెడ్డి ప్రస్తుతం బిజీగా ఉంటే, ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు తాను సాయిబాబా గుడిలో ప్రమాణం చేయడానికి సిద్దంగా ఉన్నానని సవాల్ విసిరారు. వేల కోట్ల అవినీతి కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి తనపై అవినీతి ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించనట్టుగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డికి ఇవాళ తీరిక లేకపోయినా, ఆయన ఎప్పుడు వస్తారో చెబితే వెంటనే పది నిమిషాల్లో సాయిబాబా గుడికి వచ్చి సత్యప్రమాణం చేస్తానని చెప్పారు. దీంతో వ్యవహారం ప్రస్తుతానికి సద్దుమణిగినట్టే కనిపిస్తోంది.
Must Read ;- గణపయ్య సాక్షిగా ఎమ్మెల్యే, మాజీల సత్యప్రమాణాలు.. అనపర్తిలో ఉద్రిక్తత