(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
కరోనా వైరస్ నిర్ధారణకు వ్యాధి లక్షణాలు ఉన్న వారు పడుతున్నఇబ్బందులకు త్వరలోనే చెక్ పడనుంది.రోజుల తరబడి పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూసే దుస్థితికి పరిష్కారం లభించింది.వైరస్ లక్షణాలు ఉన్నవారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎప్పుడు టెస్టులు చేస్తారా? అని ఎదురు చూసే దయనీయ పరిస్థితుల నుంచి ఐసీఎంఆర్ విముక్తి కల్పించింది.
ఇంటి వద్ద నిర్ధారణ పరీక్ష..
లక్షణాలున్న వ్యక్తి ఇంటి వద్దే స్వయంగా కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇందు కోసం ‘CoviSelf’ పేరుతో మైల్యాబ్ రూపొందించిన యాంటిజెన్ టెస్ట్ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి(ICMR) ఆమోదం తెలిపింది.దీంతో త్వరలోనే ఈ కిట్ విస్తృతంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.
పుణెకు చెందిన మైల్యాబ్..
మైల్యాబ్ రూపొందించిన ఈ కిట్‌లో కొవిడ్ నిర్ధారణ పరీక్షకు కావాల్సిన ఓ ద్రవ పదార్థంతో కూడిన ట్యూబ్,శాంపిల్ సేకరణకు స్వాబ్,టెస్ట్ కార్డుతో పాటు పరీక్ష పూర్తైన తర్వాత వీటిని సురక్షిత విధానంలో డిస్పోజల్ చేసేందుకు ప్రత్యేక కవరు ఉంటాయి.పరీక్ష ప్రారంభించే ముందు మైల్యాబ్ రూపొందించిన కొవిసెల్ఫ్ (CoviSelf) యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ప్రిఫీల్డ్ ఎక్ట్రాక్షన్ ట్యూబ్..
కొవిడ్ నిర్ధారణ పరీక్షకు అవసరమయ్యే ద్రవం ఈ ట్యూబ్‌లో ఉంటుంది.దీనిని మూడు,నాలుగు సార్లు కదిలించి ద్రవాన్ని ట్యూబ్ కింద భాగంలోకి వచ్చేట్లు చూసుకోవాలి. స్టెరైల్ నేసల్ స్వాబ్‌ను నాసికా రంధ్రాల్లో ఉంచి ఐదు సార్లు తిప్పాలి. ఇలా రెండు నాసికా రంధ్రాల్లో చేయడం వల్ల కచ్చితమైన శాంపిల్ తీసుకునే అవకాశం ఉంటుంది.అనంతరం ద్రవపదార్థం ఉన్న ట్యూబులో స్వాబ్‌ను ముంచి,శ్వాబ్‌పై భాగాన్ని తుంచి వేయాలి.అనంతరం ట్యూబ్ మూతను కప్పి వేయాలి. ఇలా శాంపిల్‌ను ముంచిన ద్రవాన్ని టెస్ట్ కార్డుపై రెండు చుక్కలు వేయాలి.అంతే.. ఫలితం కోసం 15 నిమిషాల పాటు వేచి చూస్తే రిజల్ట్ వస్తుంది.
పదిహేను నిమిషాల్లోపే..
ఇందు కోసం రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేసుకున్నఈ యాప్ నుంచి పదిహేను నిమిషాల్లోపే ఓ శబ్దం వస్తుంది.టెస్ట్ కార్డ్ (Test Card)పైన కేవలం C-క్వాలిటీ కంట్రోల్ లైన్ వద్ద మాత్రమే చార కనిపిస్తే కొవిడ్ నెగిటివ్‌గా నిర్ధారించుకోవచ్చు.ఇక క్వాలిటీ కంట్రోల్ లైన్-C తో పాటు టెస్ట్ లైన్-T వద్ద రెండు చారలు కనిపించినట్లయితే కొవిడ్ పాజిటివ్‌గా పరిగణిస్తారు.
కృత్రమ మేధ సహాయంతో యాప్‌లో 5 నుంచి 7 నిమిషాల్లోనే ఫలితం కనిపిస్తుంది.ఈ ఫలితం కోసం గరిష్ఠంగా 15 నిమిషాలు మాత్రమే వేచి చూడాలి.20 నిమిషాల తర్వాత వచ్చే ఫలితాలను పరిగణలోకి తీసుకోకూడదని కొవిడ్ కిట్ రూపకర్తలు వెల్లడించారు.ఇలా వచ్చిన కొవిడ్ ఫలితాన్ని యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.అంతేకాకుండా ఇదే కొవిడ్ నిర్ధారణ ఫలితం ఐసీఎంఆర్‌కు అనుసంధానమైన సర్వర్లోనూ నిక్షిప్తం అవుతుందట.కొవిడ్ పరీక్ష పూర్తైన తర్వాత పరీక్షకు వినియోగించిన వాటన్నింటిని ప్రత్యేకమైన కవర్లో (Bio Hazard Bag)వేసి చెత్త డబ్బాలో వేయాలి. కొవిడ్ లక్షణాలు ఉండి..ఈ యాంటీజెన్ టెస్టులో నెగటివ్ ఫలితం వస్తే మాత్రం ఫలితాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వెంటనే RT – PCR పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.
కిట్ ధర 250 రూపాయలు?
ఈ యాంటిజెన్ కిట్ ధర దాదాపు రూ.250 గా నిర్ధారించినట్టు తెలుస్తోంది.తాజాగా ఈ కిట్‌కు ఐసీఎంఆర్ అనుమతి ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ డైరెక్టర్ సుజిత్ జైన్ వెల్లడించారు.దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ షాప్‌లతో పాటు ఆన్‌లైన్‌లోనూ ఈ కిట్ అందుబాటులో ఉంటుందని మైల్యాబ్ సంస్థ ప్రకటించింది.ఇలా ఇంటిలో స్వయంగా కొవిడ్ నిర్ధారణ చేసుకునే కిట్‌లు అమెరికాలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి.భారత్‌లో మాత్రం ఇదే తొలి యాంటిజెన్ కిట్ కావడం గమనార్హం.
Must Read ;-అటు క్యాన్సర్,ఇటు కరోనా.. BIACH&RI విశేష కృషి











