ఈ లాక్ డౌన్ కాలంలో కాలక్షేపం చేయాలనుకొనే ప్రేక్షకులకు భాషతో పనిలేకుండా చూడగలిగే మంచి సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ‘కవలుదారి’ కన్నడ సినిమా. 40 ఏళ్ళ క్రితం వదిలివేసిన మూడు హత్యల కేసును.. ఓ ట్రాఫిక్ పోలీస్ ఛాలెంజింగ్ గా తీసుకుంటే.. ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయి? అన్నదే ఈ సినిమా కథాంశం. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే.. ఉత్కంఠను రేపే సన్నివేశాలు ఈ సినిమా ప్రత్యేకతలు.
కథేంటి? : శ్యామ్ ఒక ట్రాఫిక్ పోలీసాఫీసర్. తన ప్రమోషన్ కోసం పై ఆఫీసర్స్ కు ఎంత మొరపెట్టుకొన్నా పట్టించుకోరు. అలాంటి టైమ్ లో ఒక మెట్రో నిర్మాణ స్థలంలో మూడు పుర్రెలు ఒక పిల్లవాడి కంటపడతాయి. శ్యామ్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ను పెర్సనల్ గా తీసుకుని.. దాని మూలాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఒక జర్నలిస్ట్ సాయం తీసుకుంటాడు.
40 ఏళ్ళ క్రితం తన కుటుంబంతో సహా పరారయ్యాడని అభియోగం ఉన్న గురుదాస్ నాయుడు అనే ఆర్కియాలజీ ఆఫీసర్ కు, ఆ కేసుకూ లింక్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ప్రయత్నంలో అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముత్తణ్ణను కలిసి.. ఆ కేస్ ను మరింత లోతుగా పరిశీలిస్తాడు. అప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇంతకీ హత్యకుగురైన ఆ ముగ్గరూ ఎవరు? ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? శ్యామ్ ఈ కేస్ ను ఎలా డీల్ చేశాడు అన్నదే మిగతా కథ.
ఎలా తీశారు?: అన్ని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లాగానే ‘కవలు దారి’ మూవీ కూడా.. ఒక మర్డర్ తో టేకాఫ్ అవుతుంది. అది 1977 లో జరిగిన సంఘటన అని తెలుస్తుంది. ఎప్పుడో 43 ఏళ్ళ క్రితం ఆ హత్యజరిగితే.. ఇప్పుడు దాన్ని ఏ కోణంలో డీల్ చేస్తారనే ఆత్రుత ప్రేక్షకుల్లో కలుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఆసక్తికరమైన సన్నివేశాలతో ఫస్ట్ ఆఫ్ అంతా నడుస్తుంది. మరిన్ని షాకింగ్ అంశాలతో ద్వితీయార్ధం .. క్లైమాక్స్ సాగుతాయి. ట్రాఫిక్ పోలీస్ గా రిషి నటన ఆకట్టుకుంటుంది. అలాగే.. జర్నలిస్ట్ గా అచ్యుత్ కుమార్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా అనంతనాగ్ మెప్పిస్తారు. ఇక విలన్ పాత్ర లో సంపత్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు.
హైలైట్స్ : దర్శకుడి టేకింగ్ అబ్బుర పరుస్తుంది. ప్రతీ సన్నివేశాన్నీ ఎంతో క్రియేటివ్ గా , అడుగడుగునా ఉత్కంఠతను రేకెత్తిస్తూ… నడిపించాడు. ఎలాంటి బిల్డప్పుల్లేకుండా .. చాలా ఇంటెలిజెన్స్ తో హీరో పాత్రను డిజైన్ చేశాడు. అలాగే.. 40 ఏళ్ళ క్రితం తాలూకు వాతావరణాన్ని చాలా సహజంగా చిత్రీకరించాడు దర్శకుడు. టోటల్ గా ‘కవలుదారి’ సినిమా థ్రిల్లర్స్ ను కోరుకునే ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇదే సినిమాను తెలుగులో సుమంత్ హీరోగా ‘కపటధారి’గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో సుమంత్ కూడా సక్సెస్ కొడతాడేమో చూడాలి.
నటీనటులు : రిషి, అచ్యుత్ కుమార్, అనంతనాగ్, సుమన్ రంగనాథ్, సంపత్, సిద్ధార్ధ మాధ్యమిక, రోషిణీ ప్రకాష్, అవినాష్, సులీల్ కుమార్ తదితరులు
దర్శకత్వం : హేమంత్ యం. రావు
ఎక్కడ చూడాలి?: అమెజాన్ ప్రైమ్
ఒక్కమాటలో : ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
రేటింగ్ : 3.5 /5
- ఆర్కే