బాక్సాఫీసు బద్దలైంది.. సర్కారు వారికి ఇక కాసుల వర్షమే. సినిమా రంగానికి కొత్త జీవో రూపంలో ‘సర్కారు వారి పాట’ మొదలైంది. ఎవరికీ నోట మాట రావడం లేదు. గొంతులో పచ్చి వెలక్కాయ పడటంతో నోరు పెగలడం లేదు. హీరోవారి ట్విట్టర్ పిట్ట కూడా మూగవోయింది.
ఏపీ సర్కారు ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు నిర్ణయం జరగ్గానే హీరోల ట్విట్టర్ పిట్టలు తమ కూతలతో హోరెత్తించాలి. అక్కడ ఏ హోరూ లేదూ.. ఏ హీరో లేడు. పెరుగుట విరుగుట కొరకేనా అనుకోవాల్సి వస్తోంది కూడా. స్టార్ డమ్ కి కౌంట్ డౌన్ కూడా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. కొత్త నిర్ణయాలతో స్టార్ డామ్ అనేలా పరిస్థితి ఉంది. అయినా ఏ హీరోలోనూ చలనం లేదు. హీరో అనేవాడు సినిమాల్లో ఎన్ని రకాల ఫైట్స్ అయినా అవలీలగా చేసేస్తాడు.. ఎన్ని రకాల ప్రశ్నలైనా గుప్పిస్తాడు. నిజజీవితంలో మాత్రం ఫైట్స్ చేసే దమ్ములేదా అన్న మాట వినిపిస్తోంది. కనీసం ప్రశ్నిస్తాడా అంటే అదీలేదు. కోట్లకు కోట్ల పారితోషికం అయితే కావాలి. నిర్మాత చంకనాకిపోయినా ఫర్లేదు.
నిర్మాత కర్తవ్యం ఏమిటి?
ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంతిమంగా నష్టపోయేది మాత్రం నిర్మాతే. ఆల్రెడీ నిర్మాత ఎప్పుడో చంకనాకిపోయాడు. ఒక వ్యవస్థలో ఉన్నామంటే అది బాగుండాలని కోరుకోవాలి.. దాన్ని బాగుచేయడానికి పూనుకోవాలి. ప్రభుత్వం తప్పుచేసిందా ఒప్పు చేసిందా అన్నది రెండో విషయం.. అసలు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అన్నదాని మీద ఒక అభిప్రాయమంటూ వ్యక్తం చేయాలిగా. మౌనంగా ఉంటే ఏమని అర్థం చేసుకోవాలి? మౌనం అంగీకారం అనుకోవాలా? ఉత్తప్పుడు సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు ఎవరికి కావాలి? టిక్కెట్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎన్ని ట్వీట్లు చేశారు?
పోనీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది అనుకున్నప్పుడు దాన్ని సమర్థించవచ్చుగా. ఇదే నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం గనుక తీసుకుని ఉంటే అందరూ ప్రశ్నించేవారే. ఆందోళనలు చేపట్టి ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు కోకొల్లలు.. ఆ గట్స్ ఇప్పుడు ఏమయ్యాయి? కరోనా సోకి ఇప్పటికే సినిమా సగం చచ్చిపోయింది. దీనికి ఏ వ్యాక్సిన్ పనిచేస్తుందో అర్థంగావడం లేదు. ఒకప్పుడు ఆ షీల్డు ఈ షీల్డు అనే మాటలు వినిపించేవి.. ఇప్పుడు కోవీషీల్డు కూడా దీనికి పనిచేసేలా లేదు. క్యాషియర్ అనే పేరున్న నిర్మాతలోనూ ఇప్పుడు అసలు ఫియర్ మొదలైంది.
సినిమా ‘చిన్న’బోయినట్టే
సినిమా పరిధి పెరిగిపోయిందన్నది వట్టి మాటేనని అర్థమవుతోంది. ఇక సినిమా ‘చిన్న’బోక తప్పదు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నమాదిరే సినిమా కూడా తయారవుతుంది. భవిష్యత్తులో అన్నీ చిన్న సినిమాలే రావడానికి అవకాశం ఉంది. తెలంగాణలో కల్చరల్ డిపార్ట్ మెంట్ 200 మంది యువతకు సినిమాల పరంగా శిక్షణ ఇస్తోంది. తెలంగాణలో సెపరేట్ సినిమా రెడీ అవుతోంది. ఇంకో వైపు ఓటీటీ అనేది చిన్న సినిమాలకు వరప్రసాదంగా మారింది. ఆంధ్రా మార్కెట్ జీరోగా మారింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం తెలుగు సినిమా రంగానికి విఘాతమే. ఇప్పటికే థియేటర్ వ్యవస్థ కుప్పకూలేదశలో ఉంది.
పాన్ ఇండియా సినిమాలంటూ చంకలు గుద్దుకుంటున్నాం. ఇక పాన్ ఇండియా సినిమా అనే పేరు ఉండకపోవచ్చు.. ఎంచక్కా పాన్ వేసుకుని ఇంట్లో పడుకోవడమే. నేను తోపు, నేను తురుము అనుకునే హీరోలు ఇక కూరగాయలు తురుము కోవడమే తరువాయేమో. పెరుగుట విరుగుట కొరకే అని పెద్దలు ఊరికే అనలేదు. నిర్మాతలు హీరోలకు ఏరియాలు అమ్ముకోవడం బదులు ఇన్ని టిక్కెట్లు అని ఇస్తారేమో చూడాలి. ఎంటర్ టైన్ మెంట్ రంగానికి వచ్చిన ముప్పేమీ లేదుగానీ భారీ పారితోషికాలు, భారీ బడ్జెట్ సినిమాలు ఇక ఉండకపోవచ్చు. తారలు దిగివచ్చిన వేళ.. అన్నట్టుగానే తారలు అనుకున్నవారు దిగి రాక తప్పదు.
లెక్కల్లో జిమ్మిక్కులు చేయకపోవడం ఇక కుదరదు గాక కుదరదు. ప్రభుత్వానికి టాక్సుల రూపంలో ట్రాన్సపరెంట్ గా డబ్బులు ముడతాయి. తమకు రావలసిన డబ్బుల కోసం ప్రదక్షిణలు తప్పకపోవచ్చన్న భయం మాత్రం అందరిలోనూ ఉంది. ఈ కరోనా సమయంలో ఓ పక్క ప్రభుత్వం ఏమైనా వరాలు ఇస్తుందేమోనన్న ఆశతో సినిమాలు పూర్తయినా పెద్ద సినిమాలను విడుదల చేయకుండా ముందేసుకు కూర్చున్నారు. ఇక మందేసుకు పడుకోవాలేమో. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోంది. అందుకే హీరో కాస్తా జీరో కాకముందే మేలుకుంటే మంచిదేమో. ఎందుకంటే నిర్మాతను రక్షించాల్సిన బాధ్యత కూడా హీరోదే కదా. అంతేకాదు కొందరు హీరోలు కూడా నిర్మాతలేగా.











