మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ ల కలయికలో సినిమా రాబోతుందన్నది తెలిసిన విషయమే. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ట్రిపుల్ ఆర్, ఆచార్య సినిమాలు రెండూ షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. దాంతో శంకర్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

దక్షిణాది సినిమాకి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన ఘనత దర్శకుడు శంకర్ కే దక్కుతుంది. భారతీయుడు, జెంటిల్ మేన్ లాంటి పెద్ద హిట్ల తర్వాత రజనీకాంత్ కాంత్ తో శివాజి, రోబో లాంటి సినిమాలు చేసి సినిమా మార్కెట్ పరిధిని ఆయన విస్తరింపజేశారు. ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు సీక్వెల్ చేస్తున్నా అది మధ్యలోనే ఆగిపోయింది. బడ్జెట్ విషయంలో నిర్మాతకూ, శంకర్ కూ మధ్య గొడవలు రావడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. దాంతో రామ్ చరణ్ సినిమాపై శంకర్ దృష్టిపెట్టారు.
ఈరోజు జరిగిన పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరోగా ఇది రామ్ చరణ్ కు 15వ సినిమా. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సంస్థకు ఇది 50 వ చిత్రమవుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇతర పాత్రల్లో అంజలి, సునీల్, రవిబాబు, జయరామ్ నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇది ఎలాంటి సినిమా, ఏమిటన్నది తెలియాల్సి ఉంది. సినిమా అయితే వెంటనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
Must Read ;- పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో జెంటిల్ మేన్ 2











