తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ పక్కా వ్యూహం పన్నుతోంది. ముఖ్యనాయకులంతా ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగం అయిపోయారు. ఎవరికి సన్నిహితంగా ఉండే ఇతర పార్టీల నేతలను, వారు బీజేపీ లో చేర్పించేందుకు కార్యచరణ సిద్దం చేసుకున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగి వివిధ పార్టీల్లో ఉన్న బలమైన నేతలను తమ వైపు తిప్పుకునేందుకు పక్కా స్కెచ్ వేస్తున్నారు.
ఇతర పార్టీల నుంచి వలసల్ని ప్రోత్సహించి.. బీజేపీ బలం పెంచే పనిని అందరూ పంచుకుంటున్నారు గానీ.. ప్రత్యేకించి తెలంగాణలో తమ గ్రాఫ్ ఘోరంగా పడిపోయి కునారిల్లుతున్న కాంగ్రెస్ మీద ఎగస్ట్రా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసవచ్చిన- ప్రస్తుతం పార్టీ జాతీయ ఉపాధ్యక్షరాలిగా కీలక బాధ్యతల్లో ఉన్న మాజీ మంత్రి డికె అరుణ మీద చాలా పెద్ద బాధ్యతలే పెట్టినట్టు తెలుస్తోంది.
బీజేపీ రాష్ట్రంలో ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది బీజేపీ. సోపానాలుగా వాడుకోవాలని అనుకుంటోంది. ఆ పార్టీలో అసమ్మతితో ఉన్న ముఖ్యనాయకులతో ఇప్పటికే సంప్రదింపుల జరుగుతున్నాయి. కొత్తగా ఇంకా పలువురు నాయకులకు గేలం వేసే పనిని డీకే అరుణకు అప్పజెప్పినట్లు సమాచారం. సూచనలు వచ్చిన వెంటనే డీకే అరుణ రంగంలోకి దిగిపోయారు.
Must Read ;- రాష్ట్రంలో బీజేపీ ‘బండి’లాగే సమర్ధుడు సంజయుడే!
సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండడం, గతంలో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవంతో.. కాంగ్రెస్ ముఖ్యనేతలతో ఆమెకు సన్నిహిత సబంధాలు ఉండటంతో ఆమె పని సులువు అవుతోంది. ఏయే నాయకుల రాజకీయ అవసరాలు ఏమిటో ఆమెకు తెలిసి ఉండటంతో.. ఆమె గేలానికి చిక్కే చేపలు చాలానే ఉండబోతున్నాయని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్వయంగా డీకే అరుణ నేరుగా ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇక ఆపరేషన్ ఆకర్ష్ లో డీకే అరుణ తో పాటు బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సైతం తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసేలా జానారెడ్డిని ఒప్పించేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తోంది డీకే అరుణ . అయితే ఆయన ఇప్పటి వరకు పార్టీలో చేరడంపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని సమాచారం. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యనేతలందరితో డీకే టచ్‌లో ఉన్నారని.. నేడు కాకపోతే రేపైనా వారు పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు.
పెద్ద లక్ష్యాలతో పెద్ద కసరత్తు..
బీజేపీ లక్ష్యం ఇప్పుడు నెంబర్ టూ కాదు, అంతకంటె పెద్దదే. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించిన బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతీసి రాష్ట్ర రాజకీయాలలో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. వివిధ పార్టీల్లో ఉన్న అసమ్మతి నాయకులను తమవైపు తిప్పుకునేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. ముఖ్యనాయకులంతా గ్రౌండ్ వర్క్‌లో బిజీ అయిపోయారు. ఇప్పటికే నేతలు తమ ప్లాన్‌ను వర్కౌట్ చేస్తూ కొంత మంది ముఖ్యనేతలను తమ పార్టీలో చేర్చుకున్నారు . ఢిల్లీ వేదికగా రాష్ట్ర నాయకులకు డైరెక్షన్స్ ఇస్తూ రాష్ట్రంలో అధికారం వైపు అడుగులు పడేలా చేస్తోంది బీజేపీ జాతీయ నాయకత్వం.
జానారెడ్డి బీజేపీలో చేరితే ఇక డీకే అరుణ ఆపరేషన్ ఆకర్ష్ తో మిగిలిన నేతలను బీజేపీలో చేర్చుకోవడం పెద్ద కష్టమైన పనేమి కాదంటున్నారు బీజేపీ నేతలు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఖాళీ చేయడమే పనిగా పెట్టుకున్న ఆ మహిళా నేత ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Also Read ;- బీజేపీలో చేరక ముందే ఎంజాయ్ చేస్తున్న మాజీ ఎంపీ?