ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉండే ఎన్నికల హడావుడీ ఎంఐఎం పార్టీలో ఉండదు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఎన్నికల హామీలు ఉండవు. ఓటర్లను ఆకర్షించడంలో మిగతా రాజకీయ పార్టీల మాదిరి కాకుండా ఎంఐఎం పార్టీది ఓ ప్రత్యేకత ఉంది. ఇక ఎన్నికల మేనిఫెస్టో అంటరా.. అది అస్సలే ఉండదు. ఒకవేళ మీ ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉంది అని ఆ పార్టీ కార్యకర్తలను అడిగారనుకోండి. మెనిఫెస్టో ఏంటిదనే అభిప్రాయం వాళ్ల నుంచి వస్తోంది. మేనిఫెస్టో అంటే అదొక ఎన్నికల మోసపూరితమైన పత్రంగా ఆ పార్టీ వర్గాలు భావిస్తాయి. కానీ ఎన్నికల సమయంలో యాక్షన్ ప్లాన్ పేరుతో ఓ డ్యాక్యుమెంట్‌ను మాత్రం అప్పుడప్పుడు విడుదల చేస్తారు. 2002లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో, 2009లో గ్రేటర్ హైదరాబాద్ యాక్షన్ ప్లాన్ పేరుతో డాక్యుమెంట్లను రూపొందించారు.
ఎన్నికల్లో పోటీ చేస్తారు గానీ భూగోళం బద్దలయ్యే హామీలను ఎఐఎం నేతలు గుప్పించరు. వాళ్ల ప్రచారం చాలా సింపుల్‌గా ఉంటుంది. ఏవో చిన్నా చితకా వాగ్దానాలతో ప్రచారం సాగుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటాయి. పగటి పూట, సాయంత్రం వేళల్లో కేవలం పాదయాత్రలే ఉంటాయి. అందులో గడప గడపకు పలకరింపులు చేస్తారు. వాళ్ల వ్యూహం, ప్రతి వ్యూహాలు మిగతా రాజకీయ పార్టీలకు అంతుచిక్కవు. రాత్రి వేళల్లో మాత్రం బహిరంగ సభలతో పార్టీనేతలు అక్బరుద్దీన్, అసదుద్దీన్ పాల్గొని తమ పార్టీ శ్రేణులను ఉర్రూతలూగిస్తారు. అంతే పాతబస్తీలో వార్ వన్‌సైడ్ అయిపోతుంది.
Must Read ;- మంచినీటి సరఫరా.. ఉచిత నల్లా కనెక్షన్: టీడీపీ మేనిఫెస్టో
don’t miss ;- అసదుద్దీన్‌కు ఆ స్పెషల్ బిర్యానీ తినిపిస్తామన్న రాజాసింగ్
వారిదే హవా…
పాతబస్తీ పరిధిలో దాదాపు 50 వరకు డివిజన్లు ఉన్నాయి. ఇందులో ప్రతి గ్రేటర్ ఎన్నికల్లో 30 నుంచి 50 లోపు ఎఐఎం పార్టీయే తన ఖాతాలో వేసుకుంటుంది. ఇతర పార్టీల అభ్యర్థులు అక్కడ పోటీ చేయాలన్నా వెనుకంజ వేస్తారు. గెలవని చోట పోటీ చేయడమెందుకనే ఆలోచనలో వారు ఉంటారు. అయినా ఈసారైనా గెలవకపోమా.. అని బరిలో నిలుస్తుంటారు. పాతబస్తీలో మజ్లీస్‌కు ఎదురే ఉండదనేది ప్రచారం. దీంతో అక్కడ మజ్లీస్ ఆడిందా ఆట పాడిందే పాటగా చెప్పుకుంటారు.
అధినేత నిర్ణయమే ఫైనల్…
మిగతా పార్టీల్లాగా ఎంఐఎం పార్టీలో పార్టీపై అసంతృప్తి, ఫిరాయింపులు, ఆధిపత్య పోరు, నేతల మధ్య లడాయి లాంటివేవీ దాదాపు కనబడవు. పార్టీ టిక్కెట్ ఇవ్వలేదనో, పార్టీ తమను పట్టించుకోలేదనో లాంటివి ఆ పార్టీలో కనిపించవు.. వినిపించవు కూడా. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రత్యర్ధి పార్టీలతో కలిసి ఓడించే రాజకీయ వ్యూహాలను సైతం ఆ పార్టీ అభ్యర్థులు దాదాపు అమలు చేయరు. అక్కడ ఆ పార్టీ అధినేత నిర్ణయమే అంతిమం. పార్టీ బాస్ చెప్పినట్లుగా ఆచరించాల్సిందే.. ఆయనదే ఫైనల్ నిర్ణయం.
గత గ్రేటర్ ఎన్నికల్లో దాదాపు 60 డివిజన్లలో పోటీ చేసి 44 డివిజన్లను ఎంఐఎం కైవసం చేసుకుంది. ఈసారి మజ్లీస్ పార్టీ 51 స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే ఈ సారి బరిలో దింపిన వారిలో దాదాపు 15 మంది సిట్టింగ్ అభ్యర్థులను పక్కనబెట్టింది. అయినా కానీ వారు ఎలాంటి పార్టీ ఫిరాయింపులు, రెబల్‌గా బరిలోకి దిగడాలు లాంటి కనిపించవు.
Also Read ;- వాటర్ అండ్ పవర్ ఫ్రీ: మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్











