పౌరాణిక పాత్రల ప్రస్తావన రాగానే వెంటనే గుర్తుకువచ్చేది నందమూరి తారక రామారావు. ఆయా పాత్రలు పోషించడానికే పుట్టారేమో అని కూడా అనిపిస్తుంది. మనం ఏనాడూ చూడని పాత్రలకు ఆయన రూపకల్పన చేసిన కారణజన్ముడు. తనలోని నటుడుని సంతృప్తిపరచడానికి ఆయన విభిన్న పౌరాణిక పాత్రలు పోషించారు. ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలో మూడు పాత్రలు పోషించడమే కాకుండా ఆ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు.
అలాగే ‘శ్రీమద్విరాట పర్వం’ చిత్రంలో ఏకంగా కృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, అర్జునుడు, బృహన్నల పాత్రలు పోషించి సంచలనం సృష్టించారు. ఆయన నటవారసుడు బాలకృష్ణకు కూడా పౌరాణిక పాత్రలంటే ఆసక్తి. షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు పెద్దాయన ఎన్టీఆర్ నటించిన పౌరాణికాల్లోని పాటలు, పద్యాలు విని తన్వయత్వం చెందుతుంటారు. ఆ ఆసక్తితోటి ‘శ్రీకృష్ణార్జున విజయం’ చిత్రంలో శ్రీకృష్ణుడిగా, అర్జునుడిగా నటించారు బాలకృష్ణ. తండ్రిలా దర్శకత్వం వహించాలనే కోరిక బాలకృష్ణతో చిరకాలంగా ఉంది.
తను దర్శకత్వం వహించే సినిమా అంటే అంత ఆషామాషీగా ఉండదని చాలా సందర్భాల్లో చెప్పారు బాలకృష్ణ. ఎన్టీఆర్ నటించిన పౌరాణికాల్లో నర్తనశాలకు ప్రత్యేక స్ధానం ఉంది. అందుకనే తను దర్శకత్వం వహించే తొలి చిత్రానికి ఆ పౌరాణికాన్నే ఎన్నుకున్నారు బాలకృష్ణ. ఆ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు అర్జునుడు, కీచకుడు, బృహన్నల పాత్రలను పోషించాలని నిర్ణయించుకుని ముందడుగు వేశారు. వ్యాసుడి భాగవతాన్ని ఫాలో అవుతూ ఈ చిత్రం స్క్రిప్ట్ తయారు చేశారు బాలకృష్ణ. సంభాషణల రచనలో పరుచూరి సోదరులు, నాగభైరవ కోటీశ్వరరావు, మహారధి ఆయనకు అండగా నిలిచారు.
బెల్లంకొండ సురేష్ తో కలిసి లక్ష్మీ నరసింహా సినిమాని నిర్మించిన పూసపాటి లక్ష్మీపతి రాజు నిర్మాతగా నర్తనశాల షూటింగ్ 2004 మార్చి 1న రామోజీ ఫిలింసిటీలో మొదలైంది. ఈ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి అన్నీ అడ్డంకులే. ఈ సినిమా ప్రారంభ ముహుర్తమే సరైంది కాదని అప్పట్లో చాలా మంది అన్నారు. పదిరోజుల పాటు అర్జునుడిగా బాలకృష్ణ, తెమ్మరాజుగా శరత్ బాబు, భీముడిగా శ్రీహరి, ద్రౌపదిగా సౌందర్య పాల్గొన్న కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అంతే.. ఆ తర్వాత నుంచి ‘నర్తనశాల’ సినిమాకు కష్టాలు మొదలయ్యాయి.
ఆ తర్వాత ‘విజయేంద్రవర్మ’ సినిమా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం కోసం రాజస్ధాన్ వెళ్లారు బాలకృష్ణ. జోథ్ పూర్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు 40 అడుగుల నుంచి దూకినప్పుడు కాళ్లకి గాయాలై మంచానికే పరిమితం కావాల్సివచ్చింది. ఈ గాయం నుంచి కోలుకుంటున్నాక షూటింగ్ లో పాల్గాంటారు అనుకుంటుంటే.. వరసగా మరికొన్ని సంఘటనలు. ఆ కారణంగా నాలుగు నెలల పాటు షూటింగ్ లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో ఆ సినిమాలో ద్రౌపది పాత్ర పోషిస్తున్న సౌందర్య మరణం బాలకృష్ణను షాక్ కి గురి చేసింది. అయినప్పటికీ ద్రౌపది పాత్రకు గ్రేసీ సింగ్ ను ఎంపిక చేసి చిత్రం కొనసాగించాలని అనుకున్నారు. కాలం కలిసి రాకపోవడంతో చివరికి ‘నర్తనశాల’ చిత్రాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అదీ నర్తన శాల ఆగిపోవడం వెనక అసలు కథ. ఆ సినిమా కోసం తీసిన కొన్ని సన్నివేశాలను ఇటీవల బాలకృష్ణ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ బాలయ్య మెగా ఫోన్ ఎప్పుడు చేతబడతారో చూడాల్సిందే.
Must Read ;- బాలయ్య ఎన్ని సినిమాలు చేస్తున్నారో తెలుసా?