ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసులో సహ నిందితుడిగా ఉన్న హెరిటో ఫార్మా చైర్మన్ బండి పార్ధసారధి రెడ్డికి సంబంధించి చీకటి కోణాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాలుగు రోజులుగా హెటిరో ఫార్మా కార్యాలయాలు, యూనిట్లు, కంపెనీ డైరెక్టర్లు, సీఈఓ ఇళ్లపై ఆదాయపన్ను శాఖ నాన్ స్టాప్‌గా సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూసినట్లుగా శనివారం నాడు స్వయంగా ఐటీ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం హెటిరో ఫార్మాలో రూ.550 కోట్ల నిధులకు అసలు లెక్కలే లేవని, ఇందులో రూ.142.87 కోట్ల మేర నగదు పట్టుబడింది. అంతేకాకుండా కంపెనీకి సంబంధించి చీకటి కోణాలు కూడా భారీ ఎత్తునే వెలుగు చూసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
సీక్రెట్ డెన్లు.. వాటిలో నోట్ల కట్టలు
హెటిరో ఫార్మాకు సంబంధించిన ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో ఉంది. ఇక ఆ సంస్థ ఉత్పత్తి చేసే ఔషధాలకు సంబంధించి హైదరాబాద్‌తో పాటు విశాఖల్లోనూ యూనిట్లు ఉన్నాయి. అయితే ఐటీ సోదాలు మాత్రం ఆ సంస్థకు చెందినవిగా భావించిన 50 ప్రాంతాల్లో జరిగాయి. ఓ ప్రాంతంలో సోదాలు చేస్తే.. ఆ సంస్థకు చెందిన మరో స్థావరం బయటపడుతూ వచ్చాయి. ఇలా హైదరాబాద్‌లోని బోరబండలోనూ ఓ కీలక స్థావరం కూడా ఐటీ అధికారుల దృష్టికి వచ్చింది. హెటిరో రహస్య స్థావరంగా భావిస్తున్న ఈ డెన్‌లో ఏకంగా రూ.142.87 కోటమ్ల నగదు కట్టల రూపంలో బయటపడింది. ఈ నగదును తరలించేందుకు ఐటీ అధికారులు ఏకంగా నాలుగు వాహనాలను వినియోగించాల్సి వచ్చింది. ఈ నగదుకు సంబంధించి ఒక్కటంటే ఒక్క పత్రమూ లేదట. అసలు విశాలంగా ఉన్న కంపెనీ హెడ్ ఆఫీస్ ఉండగా.. బోరబండలోని సీక్రెట్ డెన్‌ను ఆ సంస్థ యాజమాన్యం ఏర్పాటు చేసుకున్న వైనం.. యాజమాన్యం అక్రమాలను ఇట్టే కళ్లకు కట్టేసినట్టుగా చెప్పింది. ఇక ఈ సీక్రెట్ డెన్‌తో పాటుగా 16 బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు గుర్తించారట. మరి వీటిలో ఏ మేర అక్రమ సంపాదన ఉందో తెలియాల్సి ఉంది.
హురూన్ సంతోషం మిగల్లేదే!
ఇటీవలే దేశంలో అత్యంత ధనవంతుల జాబితాను హురూన్ అనే సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో హెటిరో చైర్మన్‌గా ఉన్న పార్థసారధి రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. దీంతో మీడియాలో పార్థసారధి రెడ్డి పేరు మారుమోగిపోతోంది. పార్థసారధి రెడ్డి కూడా ఫుల్ ఖుషీలో మునిగిపోయారు. ఈ జాబితాకు వారం పది రోజుల ముందు ఆయనకు టీటీడీ బోర్డులో వరుసగా రెండో సారి సభ్యత్వం ఇస్తూ జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు టీటీడీ బోర్డు సభ్యత్వం దక్కిన ఆనందం.. అంతకుమించి హురూన్ జాబితా సంబరం.. ఈ రెండు కూడా పార్థసారధి రెడ్డి ఎంతో సేపు నిలవలేదు. ఈ జాబితా విడుదలైన రెండు రోజులకే ఐటీ అధికారులు దాడులు మొదలెట్టేశారు. సరే.. వ్యాపారవేత్తలన్నాక ఐటీ దాడులు సర్వ సాధారణమే అనుకున్న పార్థసారధి రెడ్డి లైట్‌గా తీసుకున్నారు. అయితే ఐటీ అధికారులు ఒక్కరోజుతోనే దాడులు ముగించకపోగా.. రోజుల తరబడి సోదాలు.. రోజుకో కొత్త డెన్‌ను వెలికి తీస్తూ అందులోని అక్రమాలు లాగేస్తున్న నేపథ్యంలో పార్థసారధి రెడ్డిలో ఆనందం ఆవిరైపోయింది. అయినా మొత్తం ఆన్‌లైన్ లావాదేవీలే జరిగే కంపెనీలో.. రూ.142.87 కోట్ల మేర నోట్ల కట్టలు.. అది కూడా కంపెనీకి చెందిన ఓ సీక్రెట్ డెన్‌లో పట్టుబడిన వైనంతో పార్థసారధి రెడ్డి మరింత కష్టాల్లో చిక్కుకున్నట్టైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- రాజన్న రాజ్యం కాదు దోపిడీ రాజ్యం










