నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు కాక ముందే సమీకరణలు రోజుకోరకంగా మారుతున్నాయి. ఏ పార్టీ నుండి ఎవరు బరిలో ఉంటారో తెలియని పరిస్థితి. అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంలో తర్జన భర్జనలు పడుతున్నాయి. అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ , బీజేపీల్లోనూ కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉంటారని కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు రాష్ట్ర ఇన్‌ఛార్జి , పీసీసీ అధ్యక్షుడు కూడా ఖరారు చేసినా అధికారికంగా ధృవీకరణ కాలేదు. రోజులు మారుతున్న కొద్దీ ఆయన కూడా మారే అవకాశాలున్నాయని నాగార్జునసాగర్ కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. తాజాగా జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని అంటున్నారు.
చేరికలపైనే బీజేపీ దృష్టి..
దుబ్బాక, గ్రేటర్ ఫలితాలతో జోష్ మీద ఉన్న బీజేపీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు వచ్చే సరికి కొద్దిగా స్లో అయినట్టు కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా బరిలో దిగాలని భావిస్తోంది బీజేపీ. దీంతో అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. నియోజకవర్గంలో గతంలో బీజేపీ పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు తమ పార్టీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో ఎవరిని బరిలో దింపాలన్న దానిపైనా పార్టీలో తీవ్ర చర్చసాగుతోంది. జానారెడ్డి కాంగ్రెస్ నుండి బరిలో ఉంటారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారడంతో బీజేపీకి ఆశలు పెరిగాయి. జానారెడ్డి బరిలో దిగకపోతే తమకు గెలుపు అవకాశాలు పెరుగుతాయన్న భావనలో కమళం పార్టీ ఉంది. అయితే, కాంగ్రెస్ నుండి ఎవరు బరిలో దిగుతారు…. టీఆర్ఎస్ ఎవరికి టికెట్ కేటాయిస్తుందో చూసిన తరువాతే అభ్యర్థిత్వాన్ని ఖారారు చేసే యోచనలో ఉంది బీజేపీ. పార్టీ తరఫున పోటీ చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని.. గెలుపు గుర్రాన్నే బరిలో దింపబోతున్నామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read ;- గెలుపు గుర్రాల వేట.. తేలని నాగార్జునసాగర్ బీజేపీ అభ్యర్థి
ఇంటి పోరుతోనే జానారెడ్డి వెనక్కు తగ్గుతున్నారా?
ఇప్పటివరకు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందే ఉందన్న చర్చ సాగింది. జానారెడ్డి తాజా వ్యాఖ్యలతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. జానారెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇంటి పోరుతోనే ఆయన పోటీకి వెనకడుగు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి ఎన్నికల బరిలో దిగేందుకు బలంగా ప్రయత్నిస్తున్నారని నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. జానారెడ్డికి టికెట్ ఖరారు అయినట్టు చెప్పినా ఆయన మాత్రం తన కుమారుడు ఎన్నికల బరిలో ఉన్నా అంతా సహకరించాలని చెప్పడంతో అధిష్టానంలో కూడా కంగారు మొదలైంది అన్న చర్చ సాగుతోంది. మొదట పోటీకి సై అన్న జానారెడ్డి ఇంట్లో కొడుకు ఒత్తిళ్ళ మేరకు మాట మార్చినట్టు చెబుతున్నారు. మరి జానారెడ్డే కాంగ్రెస్ తరఫున బరిలో ఉంటారా.. అందుకు ఆయన కుమారుడిని అధిష్టానం బుజ్జగిస్తుందా.. జానారెడ్డి బరిలో లేకపోతే గెలుపు ఎవరిని వరిస్తుందన్నచర్చలు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జోరుగా జరుగుతున్నాయి.
Must Read ;- ఠాగూర్ తీరుపై కారాలు, మిరియాలు.. టీకాంగ్రెస్‌లో కొత్త లొల్లి