కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,23,846 కోట్లు కేటాయించారు. గతేడాది కంటే దాదాపు 1.3లక్షల కోట్లు ఎక్కువగా కేటాయించారు. ఇందులో భాగంగా కోవిడ్ వ్యాక్సిన్ కోసం రూ.35వేల కోట్లు కేటాయించారు. 68.6 కోట్ల జనాభాకు డోసుకు రూ. 255 చొప్పున రెండు డోసుల టీకాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఒకవేళ డోసుల ధర పెరిగితే బడ్జెట్‌ను మరింత పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా త్వరలోనే మరికొన్ని రానున్నాయన్నారు. కాగా భారత్ నుంచి దాదాపు 100 దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే.
సగం జనాభాకు..
ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్ ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో నడుస్తోంది. కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకున్నవారిలో దుష్ర్పభావాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఆ ప్రచారాన్ని వైద్య ఆరోగ్యశాఖలు ఖండిస్తున్నాయి. దేశంలో 65 ఏళ్లు దాటిన వారికి, పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంపై ఇంకా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. వ్యాక్సిన్ వల్ల ఆరోగ్యపరంగా తలెత్తే సమస్యలు, మార్పులపై పూర్తి స్థాయి పరిశోధన అనంతరమే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. అందులో భాగంగానే సగం జనాభాకు వ్యాక్సిన్ కోసం రూ.35వేల కోట్లు కేటాయించారు. కొవిడ్ వ్యాక్సిన్ ప్రాథమిక స్థాయి వ్యాక్సిన్‌గా మారాలంటే..మరికొన్ని పరిశోధనలు అవసరం కానుంది. ఇక ప్రైవేటు రంగంలో వ్యాక్సిన్ ధర వేరుగా ఉండనుంది. మొత్తం మీద రానున్న కాలంలో సైడ్ ఎఫెక్ట్‌లు లేని వ్యాక్సిన్ విషయంపై ఇంకా క్లారిటీ రానుంది. ప్రాథమికంగా అత్యవసర వినియోగంలో భాగంగా నిధుల కేటాయింపు జరిగింది. దేశం మొత్తం జనాభాకు వ్యాక్సిన్ వేయాలంటే.. జాతీయ స్థాయి మొదలు..గ్రామస్థాయి వరకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ తయారైన నాటి నుంచి ఆరునెలల్లోపు వినియోగించాలి. అంటే దశల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొత్తం ప్రభుత్వ పరిధిలో జరిగితే.. మౌలిక ఖర్చులు (రవాణా, నిల్వ, వైద్య ఆరోగ్య సిబ్బంది వేతనాలు, ఇతర ప్రభుత్వ విభాగాల సేవలు) కాకుండా.. వ్యాక్సిన్ కోసమే దాదాపు రూ.70వేల కోట్లు అవసరం. ఇదే విషయాన్ని గతంలో సీరమ్ ఇండియా సంస్థ కూడా ప్రస్తావించింది.
Also Read ;- కొవిడ్ వేక్సిన్ ముసుగులో నిధులు దండుతున్న ‘సీరమ్’
సౌకర్యాలకు ప్రాధాన్యం..
ఓవైపు కొవిడ్‌కు వ్యాక్సినేషన్ కోసం రూ.35వేల కోట్లు కేటాయించగా.. దేశ వైద్య, ఆరోగ్యరంగాల్లో క్షేత్ర స్థాయిలో మౌలిక సదుపాయాల్లో పలు లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వివిధ స్థాయిల్లో ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులకు నిధులు కేటాయించింది. తద్వారా రానున్న కాలంలో కొవిడ్ తరహా వైరస్‌లు వ్యాప్తి చెందే పరిస్థితి కనిపిస్తే.. సదరు ఆరోగ్యకేంద్రాలను వినియోగించేలా.. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా విధానాల రూపకల్పన జరగనుంది. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు, 11 రాష్ర్టాల్లో 3382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 602 జిల్లాల్లో క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్‌లను ఏర్పాటు చేస్తారు. అదే విధంగా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ)ని బలోపేతం చేస్తారు. 15 హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు, 2 మొబైల్ హాస్పిటల్స్, జాతీయ స్థాయిలో వ్యాధి నివారణ కేంద్రం, 9 బయోసేఫ్టీ లెవల్-3 ల్యాబొరేటరీలు, 4 వైరాలజీ ల్యాబులు ఏర్పాటు చేయనున్నారు. వైద్య పరిశోధనల విభాగానికి రూ. 2663 కోట్లు, ఆయుష్ మంత్రిత్వ శాఖకు రూ.2970.30 కోట్లు కేటాయించారు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ ద్వారా వ్యాక్సినేషన్‌కు రూ.35వేల కోట్లు కేటాయించడంతోపాటు ఆరోగ్య రంగానికి రూ.2.238 లక్షల కోట్లు కేటాయించారు. కేటాయింపులు జరపడంతోపాటు నిధుల వెచ్చింపు, సద్వినియోగం జరిగినట్టైతే.. దేశ వైద్య ఆరోగ్య రంగంలో ఈ బడ్జెట్ కీలకంగా మారనుంది.
Must Read ;- వావ్.. చిప్పచేతికిచ్చారు.. కృతజ్ఞతలు జగన్ గారు..!