వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఉద్యమాన్ని చల్లార్చడానికి తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి కాబోయేది ఎవరో.. అంచనాలతో కొన్ని పేర్లు కూడా ప్రబలంగా వినిపించాయి. వారిలో జానారెడ్డి ఒకరు. జానారెడ్డికి తాను ముఖ్యమంత్రిత్వానికి అర్హుడినని విపరీతమైన నమ్మకం. ఎంతగా అంటే.. ముఖ్యమంత్రి కాగానే తాను ఎలాంటి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలనే విషయంలో కూడా ఆయనకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. తాను ముఖ్యమంత్రి కాగానే ప్రమాణ స్వీకారం రోజున ధరించడానికి జానారెడ్డి ఒక ‘బంద్ గలా’ సూటు కూడా కుట్టించుకుని సిద్ధంగా ఉంచుకున్నారని కూడా అప్పట్లో వినిపించింది. అంతటి సీనియర్ నాయకుడు- తన నియోజకవర్గంలో అప్రతిహతంగా గెలుస్తూ వచ్చిన నేత.. 2019 ఎన్నికల్లో తెరాస హవా ముందు నిలవలేకపోయారు.
ఇప్పుడు- అనగా.. ఆయన మీద విజయం సాధించిన నోముల నర్సింహయ్య మరణానంతరం జానారెడ్డి వార్తల్లో హాట్ వ్యక్తిగా నిలుస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం ఇప్పుడు చాలా ముమ్మరంగా జరుగుతోంది. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక నిమిత్తం జరిగిన కసరత్తు సమావేశానికి వచ్చిన జానారెడ్డి, మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారే వ్యవహారంపై క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. వార్తల్లో అలా వచ్చిందే తప్ప.. ఆయన ఇచ్చిన క్లారిటీ ఏమీ లేదు. మీడియా వారు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ డొంకతిరుగుడు సమాధానాలు మాత్రమే ఇచ్చారు. వాటివల్ల.. ఆయన పార్టీ మారుతున్నారనే అనుమానాలు మరింత పెరుగుతాయే తప్ప.. తగ్గేలా లేవు.
బీజేపీలో చేరడం గురించి అడుగుతోంటే.. ఆయన మాత్రం.. నన్నెవరూ సంప్రదించలేదు- మిమ్మల్ని సంప్రదించారా? అంటారు! ‘మిమ్మల్ని సంప్రదిస్తే నా దగ్గరకు పంపండి నేను మాట్లాడతా’ అంటారు.. ఏమిటి మాట్లాడేది? డీల్ మాట్లాడుకుంటారా? నాగార్జున సాగర్ నుంచి పోటీచేస్తారా? అని అడిగితే ‘కాంగ్రెస్ పార్టీ పోటీచేస్తుంది’ అని సెలవిచ్చారు.
Must Read ;- బీజేపీలో చేరక ముందే ఎంజాయ్ చేస్తున్న మాజీ ఎంపీ?
ఇంకా సిగ్నల్ రాలేదా?
జానారెడ్డి వ్యవహారం చూస్తోంటే ఢిల్లీ కమలదళాల నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదేమో అనే అనుమానం ఎవ్వరికైనా కలుగుతుంది. మామూలుగానే.. జానారెడ్డి ప్రెస్ మీట్ పెడితే.. ఆయన అందులో కీలకంగా ఏం చెప్పారో ఎవ్వరికీ అర్థం కాదని మీడియా మిత్రులు అంటుంటారు. చెప్పదలచుకున్న విషయాన్ని శిష్టమైన భాషలో, క్లిష్టతను జోడించి.. అర్థం కాకుండా, ఏతత్ పర్యవసానంగా అనుబంధ ప్రశ్నలు అనేవి రాకుండా చెప్పడంలో జానారెడ్డి ఘనాపాటి. ఇప్పుడు కూడా పార్టీ మార్పు గురించి అడిగితే అలాగే చెప్పారు.
ఈ సమాధానాలు వింటే ముహూర్తం కుదరలేదు గానీ.. మార్పు తథ్యం అనిపిస్తుంది. బీజేపీ ఏమో జానారెడ్డిని చేర్చుకుని.. నాగార్జున సాగర్ ను కూడా గెలుచుకుని.. తెలంగాణ ప్రజల్లో ఒక రకమైన ‘కమలమేనియా’ను సృష్టించాలని అనుకుంటోంది. కమల వెలుగులు తెలంగాణ వ్యాప్తం అవుతున్నాయనే భ్రమ కలిగించడం వారి తాపత్రయం.
అయితే జానారెడ్డి.. తనకు గవర్నర్ పదవి, తన కొడుక్కి ఎమ్మెల్యే పదవి అడుగుతున్నారని వార్తలు వచ్చాయి. గవర్నర్ పదవులకోసం ఎదురుచూస్తున్నవారు కమలదళంలో చాలా మందే ఉన్నారు. మోడీకి ముందు వరకు పార్టీకి వైభవస్థితి లేకపోయినా.. కొన్ని దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని, దేశంలో పార్టీ అస్తిత్వాన్ని కాపాడుతూ వచ్చిన సూపర్ సీనియర్లు చాలా మందే ఉన్నారు. కేవలం ఒక ఎమ్మెల్యే సీటు కోసం- ఒక గవర్నర్ గిరీ ఇస్తారా? అనేది ప్రశ్న. ముందైతే పార్టీలో చేర్చేసుకోవడానికి ఆ పదవిని ‘బిస్కట్’గా ఆశ చూపించగలరేమో గానీ.. ‘ప్రామిస్’ చేయలేరు. బహుశా అంత స్పష్టమైన గ్రీన్ సిగ్నల్ రానందువల్లనే.. జానారెడ్డి ఇంకా ఇదమిత్థంగా చేరిక గురించి తేల్చుకోలేదని అనిపిస్తోంది.
Also Read ;- మోడీకి లిట్మస్ టెస్ట్ పెట్టేసిన అన్నదాతల ఆక్రోశం..