తెలుగు .. తమిళ భాషా ప్రేక్షకులను ‘త్రిష‘ గురించి అడిగితే, ‘అందమైన అభినయానికి ఆమె ఆనవాలు’ అనే సమాధానం వెంటనే వస్తుంది. 1999లో ఓ తమిళ సినిమా ద్వారా నటిగా ఆమె కెరియర్ మొదలైంది. ఆ తరువాత కొంతకాలానికే, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అటు గ్లామర్ .. ఇటు నటన పుష్కలంగా ఉండటంతో, త్రిషకి వంకబెట్టవలసిన పనిలేదనే టాక్ వచ్చింది. అప్పటి నుంచి ఈ రెండు భాషల్లోను ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. స్టార్ హీరోల సరసన అవకాశాలు .. భారీ విజయాలు .. ప్రముఖుల ప్రశంసలు ఆమెను వరించాయి.
త్రిష తనకి లభించిన క్రేజ్ ను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయలేదు .. ఏ సందర్భంలోను అంకితభావాన్ని వదిలిపెట్టలేదు. తెలుగు .. తమిళ భాషల్లో తన స్థానానికి ఎలాంటి ప్రమాదం లేకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. ఇతర భాషల నుంచి అవకాశాలు వచ్చినా, వాటిపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఇంత బిజీలోనూ ఆమె కథల ఎంపికలో తడబడలేదు .. పాత్రల విషయంలో మొహమాటాలకు పోలేదు. త్రిష సుదీర్ఘ కాలంగా తన కెరియర్ ను కొనసాగిస్తూ రావడానికి ఇదే ప్రధానమైన కారణమని చెప్పొచ్చు. హీరో జోడీగా తన ఆటపాటలు ప్రేక్షకులు అంగీకరించినంతవరకే ఆమె ఆ తరహా పాత్రలను చేసింది. ఆ తరువాత నాయిక ప్రాధాన్యత కలిగిన కథలను ఎంచుకుంటూ ఆ దిశగా వేగాన్ని పెంచింది.
Must Read ;- తల్లిగా నటిస్తున్న ఓల్డ్ బ్యూటీ!
‘లయన్’ సినిమా నుంచి త్రిషకి తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గుతూ వచ్చాయి. ‘నాయకి‘ అనే హారర్ మూవీ కూడా ఆమెకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టలేకపోయింది. అప్పటి నుంచి త్రిష పూర్తిగా తమిళ చిత్రాలపైనే దృష్టిపెట్టింది. నాయిక ప్రాధాన్యత కలిగిన హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ కథలపైనే ఎక్కువగా శ్రద్ధ పెట్టింది. ఇప్పుడు ఆమె చేతిలో అరడజను తమిళ సినిమాలు వున్నాయి. వీటిలో త్రిష ప్రధాన పాత్రధారిగా సాగే ‘పరమపదం విలయాట్టు’ ముందుగా రానుంది. త్రిషకు ఇది 60వ సినిమా కావడంతో, సంఖ్యాపరంగా అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. లాక్ డౌన్ కారణంగా విడుదలను వాయిదా వేసుకున్న ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వదిలిన టీజర్ .. ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. ఈ సినిమాతో త్రిషకి హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలు బలంగానే వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో త్రిష .. ‘డాక్టర్ గాయత్రి’ పాత్రలో కనిపించనుంది. ఒకానొక సంఘటన కారణంగా రాజకీయ నాయకుల నుంచి .. రౌడీలా నుంచి ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది అనే కథతో ఈ సినిమా సాగనుంది. ఓ పసిబిడ్డ తల్లిగా ఆమె నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. దినేశ్ ఫొటోగ్రఫీ .. అమ్రిశ్ సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసికెళతాయని చెప్పుకుంటున్నారు. ఆ తరువాత కూడా త్రిష నటించిన నాయిక ప్రధానమైన సినిమాలే లైన్లో వున్నాయి. ‘రాంగి’ .. ‘గర్జనై’ సినిమాల్లో ఆమె పాత్రలు మరింత వైవిధ్యభరితంగా వుండనున్నట్టు తెలుస్తోంది.
మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాలోను త్రిషకి విలక్షణమైన పాత్ర దక్కడం విశేషం. వివిధ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై అందరిలోను ఉత్కంఠ వుంది. ఇక మలయాళంలో మోహన్ లాల్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ‘రామ్’ సినిమాలోను ఆమె కీలకమైన పాత్రలో కనిపించనుంది. మలయాళ ‘దృశ్యం‘ సినిమాతో మరిచిపోలేని గుర్తింపు తెచ్చుకున్న జీతూ జోసెఫ్, ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అందువలన ఈ యాక్షన్ థ్రిల్లర్ పై అక్కడ ఒక రేంజ్ లో అంచనాలు వున్నాయి. ఈ జాబితా చూస్తుంటే .. వచ్చే ఏడాది త్రిష వరుస సినిమాలతో సందడి చేయనున్నట్టు అర్థమవుతోంది. 60 సినిమాల తరువాత కూడా త్రిష తన హవాను కొనసాగిస్తుండటం విశేషమేనని చెప్పుకోవాలి.
Also Read ;- బాబు విజన్ గ్రేట్.. ఐఎస్బీ దేశంలోనే నెంబర్ వన్










