ప్రకాశం జిల్లాలో మూడు నియోజకవర్గాల వైసీపీ నేతలకు పదవీ గండం పొంచి ఉంది. 2019 ఎన్నికల్లో చీరాల, పర్చూరు, కొండెపి, అద్దంకి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. చీరాలలో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మిగిలిన చోట్ల ఓడిన అభ్యర్ధులు వైసీపీ ఇన్ ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు. అయితే కొన్ని సర్దుబాట్లతో మూడు నియోజకవర్గాల నేతలకు పదవీ గండం తప్పేలా లేదు.
చీరాల వైసీపీలో ఆగని రచ్చ
గత ఎన్నికల్లో చీరాలలో టీడీపీ అభ్యర్థి కరణం బలరాం గెలిచారు. అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరణం బలరాం, ఆమంచి వర్గీలయుల మధ్య పోరు తప్పడం లేదు. దీనిని పరిష్కరించేందుకు ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు ఇన్ ఛార్జిగా పంపాలని వైసీపీ అధినేత భావిస్తున్నారట. దీంతో పర్చూరులో ఇప్పటి వరకూ వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న రామనాధంబాబుకు పదవీ గండం ఏర్పడింది.
Must Read ;- టీడీపీ కార్యకర్తలంటే భయమెందుకు: నారా లోకేష్
పర్చూరులో పదనిసలు
2019 ఎన్నికల్లో పర్చూరులో టీడీపీ అభ్యర్ధి ఏలూరు సాంబశివరావు విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ టికెట్ రాలేదని రామనాధంబాబు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఆ తరవాత వైసీపీ అధికారంలోకి రావడం, దగ్గుబాటు వెంకటేశ్వరావు ఆ పార్టీకి దూరంగా జరగడంతో రామనాధంబాబు మరలా వైసీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి పర్చూరు వైసీపీ ఇన్ ఛార్జిగా రామనాధంబాబును కొనసాగిస్తున్నారు. పర్చూరుకు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ ఇన్ ఛార్జిగా వస్తే రామనాధంబాబు పదవికి గండం పొంచిఉన్నట్టేనని తెలుస్తోంది.
కొండెపిలో జూపూడి పాగా…
కొండెపి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బాలవీరాంజనేయస్వామి విజయం సాధించారు. స్వామి చేతిలో వైసీపీ అభ్యర్థి వెంకయ్య పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి కొండెపి వైసీపీ ఇన్ ఛార్జిగా వెంకయ్య వ్యవహరిస్తున్నారు. అయితే కొండపి వైసీపీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వైసీపీ శ్రేణుల మధ్య గొడవలు కామన్ గా మారాయి.
తాజాగా కొండెపి నియోజకవర్గంపై జూపూడి ప్రభాకర్ కన్నేశారు. నియోజకవర్గంలో వెంకయ్య వ్యతిరేక గ్రూపులను జూపూడి ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. టీడీపీ హయంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఓ వెలుగు వెలిగిన జూపూడి, 2019 ఎన్నికల ఫలితాల తరవాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా కొండపి వైసీపీ నుంచి పోటీ చేయాలని జూపూడి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రకాశం జిల్లాలో వైసీపీ ఇన్ ఛార్జులకు పదవీగండం తప్పేలాలేదు.
Also Read ;- ప్రకాశం జిల్లాకు అన్యాయం.. వైసీపీ నేతలు సైలెంట్…!