దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి. దేశ వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ మమత బెనర్జీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఇక్కడ అధికారం చేపట్టేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయని చెప్పవచ్చు. ఇక తమిళనాడులో బీజేపీ-ఏఐఏడీఎంకే(ఎన్డీయే)కు ఎదురుగాలి వీచింది. డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. కేరళలో ఎల్‌డీఎఫ్ అధికారంలోకి రానుండగా అస్సాంలో బీజేపీ కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంది. పుదుశ్చేరిలో బీజేపీ కూటమి మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంది. మొత్తం మీద చూస్తే..బీజేపీ కూటమి అధికారంలో ఉన్న తమిళనాడులో అధికారం చేజారగా అంతకంటే చిన్నదైన 30 స్థానాలున్న పుదుశ్చేరిలో బీజేపీ కూటమి అధికారంలోకి రానుంది.
పశ్చిమ బెంగాల్‌లో దీదీకే జై..
దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పశ్చిమబెంగాల్‌లో ఓటర్లు మమతా బెనర్జీకే జై కొట్టారు. ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(AITC,TMC)కి అధికారాన్ని కట్టబెట్టారు. మొత్తం 292 స్థానాలను గాను అధికారానికి కావాల్సిన 148సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన నందిగ్రమ్ అసెంబ్లీ స్థానంలో మమత బెనర్జీ 1200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గతంలో ఇక్కడ టీఎంసీ నుంచి సువేంధు అధికారి పోటీచేసి 81వేల మెజార్టీతో గెలిచారు.అయితే కొన్నాళ్ల క్రితం టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. మమత బెనర్జీ అనూహ్యంగా ఇక్కడ పోటీకి దిగారు. సువేందు అధికారిపై ప్రతీకార పోరాటానికి దిగారని చెప్పవచ్చు. అయితే తొలి ఆరు రౌండ్ల ఫలితాలు వచ్చేటప్పటికి మమత బెనర్జీ వెనుకంజలో ఉన్నా..చివరికి గెలుపు సాధించారు. పార్టీ అధికారంలోకి రావడంతో పాటు ఉత్కంఠ రేపిన నందిగ్రమ్‌లో మమత బెనర్జీ గెలవడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాగా గెలుపు సంబరాలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురు అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. కాగా ఇక్కడ బీజేపీ దాదాపు 81స్థానాల్లో గెలుపొందనుంది. ఇక 2016 జరిగిన ఎన్నికల్లో టీఎంసీ 211 స్థానాలు దక్కించుకోగా 2011లో 184 చోట్ల గెలుపొందింది. ఈ సారి 208కి పరిమితం కానుంది.
తమిళనాడులో..
తమిళనాడులో కాంగ్రెస్- డీఎంకే కూటమి సత్తా చాటుతోంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా అధికారంలోకి రావాలంటే 118 చోట్ల గెలవాల్సి ఉంది. డీఎంకే ఇప్పటికే 134చోట్ల గెలవగా మరో 11స్థానాల్లో అధికారంలో ఉంది. పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే-బీజేపీ కూటమి వెనుకంజలో ఉంది. 83 స్థానాలకు పరిమితం కానుంది ఇక డీఎంకే సీఎం అభ్యర్థి స్టాలిన్ తాను పోటీ చేస్తున్న కొళత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
కేరళలో మళ్లీ ఎల్డీఎఫ్..
కేరళలో ఎల్డీఎఫ్ కూటమి అధికారంలోకి రానుంది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో అధికారంలోకి రావాలంటే 71సీట్లు అవసరం కాగా అధికార ఎల్డీఎఫ్ 99స్థానాల్లో అధిక్యంతో ఉంది. యూడీఎఫ్ కూటమి 42, ఎన్డీఏ 1 స్థానంలో అధిక్యంలో ఉన్నాయి. కాగా ఇక్కడ రాహుల్ గాంధీ ఈ సారి ప్రయోగాత్మకంగా 50 మంది కొత్త అభ్యర్థులను బరిలోకి దింపారు. ఆ ప్రయోగం ఘోరంగా విఫలమైందన్న అంచనాలున్నాయి. ఇండియన్ యూత్ కాంగ్రెస్, శశి థరూర్ నేతృత్వంలోని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ వంటి సంస్థల ద్వార అభ్యర్థల ఎంపిక జరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పవచ్చు. కాగా ఇక్కడ బీజేలో చేరిన మెట్రోమ్యాన్ పాలక్కడ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగినా ఓటమి పాలయ్యారు. ప్రస్తుత సీఎం(ఎల్డీఎఫ్) పినరయి విజయన్ ధర్మదాం నుంచి గెలిపొందారు.
పుదుశ్చేరిలో ఎన్డీయే కూటమి..
ఇక పుదుచ్చేరి విషయాని కొస్తే.. ఎన్డీఏ కూటమి 16, యూపీఏ 12 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుదుచ్చేరిలో మొత్తం సీట్లు 30 ఉండగా అధికారంలోకి రావాలంటే 16 సీట్లు అవసరం. ఎన్డీయే గెలుపొందడంతో ఇక్కడ బీజేపీ కూటమి అధికారంలోకి రానుంది. ఇటీవలే సీఎం నారాయణ స్వామి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ మెజార్టీ నిరూపణలో విఫలం కావడంతో ప్రభుత్వం కూలిన విషయం తెలిసిందే.
అస్సాంలో మళ్లీ ఎన్డీయే..
అసోంలో మళ్లీ ఎన్డీయే కూటమి అధికాంరలోకి రానుంది. మొత్తం 126 స్థానాలకు గాను 64స్థానాలు గెలవాల్సి ఉంటుంది. ఇక్కడ బీజేపీ కూటమి 35స్థానాల్లో గెలవగా 36స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 40స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు..
Must Read ;- ఇక రాజకీయ వ్యూహకర్తగా ఉండను: ప్రశాంత్ కిషోర్