(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అచ్చెన్నాయుడు నియామకంతో వైసీపీలో ఆందోళన నెలకొంది. సాధారణంగా టీడీపీకి కంచుకోటగా భావించే శ్రీకాకుళంలో ఇప్పుడిప్పుడే వైసీపీ వేళ్లూనుకుంటోంది. ఈ నేపథ్యంలో సిక్కోలుపై మంచి పట్టున్న అచ్చెన్న రాష్ట్రసారధి అయినప్పుడు తన సొంత జిల్లాలో ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంపై ఫోకస్ పెంచే పరిస్థితి ఉంది. అటువంటి అవకాశం ఇవ్వకుండా వైసీపీ ముందు జాగ్రత్త పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇంతవరకు పట్టించుకోని వైసీపీ సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞుడు ధర్మాన ప్రసాదరావును రంగంలోకి దింపింది.
కాంగ్రెస్ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ధర్మానకు శ్రీకాకుళం జిల్లాపై మంచి పట్టుండటం, ప్రజలతో సత్సంబంధాలు ఉండటం వల్ల ఆయనను యాక్టివ్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలోనూ శ్రీకాకుళం నుండి ఎమ్మెల్యేగా ఎంపికైనప్పటికీ ఆయనకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇంతవరకూ శ్రీకాకుళంకే పరిమితమయ్యారు. వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన కొద్దిరోజులుగా జిల్లా అంతటా కలియతిరుగుతున్నారని, పాత పరిచయాలకు మళ్లీ జీవం పోస్తున్నారని చర్చలు జరుగుతున్నాయి.
వైఎస్ వద్ద మంత్రి కావడమే బలం..
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన ధర్మాన ప్రసాదరావు వైఎస్ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో శ్రీకాకుళం జిల్లాపై మంచిపట్టు సంపాదించారు. జిల్లాలో జరిగే ప్రతి కార్యక్రమం ఆయన కనుసన్ననల్లోనే జరిగేది. యువకుడిగా ఉన్నపుడే ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మాన- నేదురుమల్లి జనార్దనరెడ్డి మంత్రివర్గంలోనూ మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీలో విపక్షంలో ఉన్నా కూడా మంచి విషయపరిజ్ఞానంతో మాట్లాడేవారు. శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు కుటుంబం కంటే ముందే మంత్రి పదవులు పొందడం వల్ల విశేష ఆదరణ ఉండేది.
Must Read ;- అలా అయితే ఎంతో నష్టం.. పునర్విభజనపై సిక్కోలులో నిరసన
పులివెందులలో గెలవడం కాదు..
2014 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చిన ధర్మాన ప్రసాదరావు ఓటమి పాలయ్యారు. అయితే అప్పట్లో ఆయన ‘పులివెందులలో గెలవడం కాదు .. శ్రీకాకుళంలో గెలవాలి’ అంటూ వైసీపీ అధినేత జగన్‌పై చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం నుండి ఎమ్మెల్యేగా గెలిచినా .. ఆ కామెంట్ మూలంగానే ఆయనను పక్కన పెట్టినట్టు తెలిసింది. దాంతో ధర్మాన కూడా ఇన్నాళ్లు సైలెంట్‌గానే ఉన్నారు. కానీ అన్న క్రిష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి కావడం, అధిష్టానం సూచించడం వల్ల మరోమారు తన జోరు పెంచుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అచ్చెన్నకు చెక్ పెట్టేందుకేనా..
వైసీపీ అధిష్టానం తనని పట్టించుకోవడం లేదని కొద్దిరోజుల క్రితం వరకు నియోజకవర్గం దాటి కాలు కదపకుండా.. అంటిపెట్టుకొని ఉన్న ధర్మాన ఇప్పుడు జిల్లా అంతటా తిరుగుతున్నారు. కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నప్పుడు సంపాదించుకున్న అనుచరులను కూడా యాక్టివ్ చేస్తున్నారు. ఇటీవల టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించగా వైసీపీ శ్రేణులు గ్రూపులను మరిచిపోయి ఘన స్వాగతం పలికాయి. ఆయన కూడా అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకెళ్లారు.
అయితే జగన్ నేరుగా చెప్పడంతోనే ధర్మాన ఇదంతా చేస్తున్నారని తెలుస్తోంది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు చెక్ పెట్టేందుకు ధర్మానను రంగంలోకి దింపారని ప్రచారం జరుగుతోంది. కాగా, మంత్రివర్గ విస్తరణ జరిగితే ధర్మానకు అవకాశం గ్యారంటీ అని ఆయన అనుచరులు ఆశపడుతున్నారు. ఒకే కుటుంబం నుంచి, ఒకే జిల్లానుంచి ఇద్దరిని కేబినెట్ లోకి తీసుకునేంత వెసులుబాటు జగన్ మంత్రివర్గంలో ఉంటుందా? అనేది కూడా అనుమానమే. అలాగని జగన్ కు ఎంతో విశ్వాసపాత్రుడిగా ఉన్న కృష్ణదాస్ ను తప్పించడం అంత ఈజీ కాకపోవచ్చు కూడా! మంత్రి పదవి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. అచెన్నాయుడుకు చెక్ పెట్టడానికి ధర్మాన ప్రసాదరావును తెరమీదికి తేవడం జరిగింది..’ అనే వాదన నిజమే అయితే గనుక, ఏం జరుగుతుందో వేచిచూడాలి!
Also Read ;- టీమ్ జగన్ 2.0: లోనికి ఎవరు? బయటికి ఎవరు?