Nara Lokesh Shows His Fists With Strength :
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను భయపెడదామని చూసిన జగన్ సర్కారు.. ఆయనలోని తెగువను చూసి షాక్ తిన్నదనే చెప్పాలి. రాజకీయంగా ఇబ్బందుల పాలు చేసేందుకు జగన్ సర్కారు చేస్తున్న యత్నాలను లోకేశ్ తనదైన శైలిలో తిప్పికొడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా.. లోకేశ్ పెద్ద నేత కాలేరంటూ వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలిన వైనం తెలిసిందే. అయితే టీడీపీ విపక్షంలో రాగానే.. జనానికి మద్దతుగా నిలుస్తున్న లోకేశ్.. సమస్య ఏదైనా దానిపై పోరు సాగించేందుకు ఉరుకులు పరుగులు పెడుతున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాకుండా ఈ తరహా పోరు ఆయనలోని అసలు సిసలు రాజకీయ నేతను ఎలివేట్ చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోమవారం గుంటూరులో పోలీసులు తనను అరెస్ట్ చేస్తే.. లోకేశ్ అదరలేదు, బెదరలేదు.. ఏకంగా పిడికిలి బిగించి మరీ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపడంతో పాటు తనను బెదరగొట్టేలా వ్యవహరించిన పోలీసులకు చుక్కలు చూపించారనే చెప్పాలి.
అరెస్ట్ లతో అదరం.. బెదరం..
గుంటూరులో ఆదివారం బీటెక్ విద్యార్థిని రమ్యపై జరిగిన దాడిలో ఆమె మరణించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ విడుదల కాగానే.. రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఇక బాధ్యత కలిగిన టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ప్రభుత్వ తీరును ఎండగట్టడాని కంటే ముందుగా బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు నారా లోకేశ్ నేతృత్వంలో టీడీపీ కీలక నేతలు.. బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో పాటు లోకేశ్ ను బెదరగొట్టేలా పోలీసులు వ్యవహరించారు. గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ.. ఏకంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై చేయి చేసుకున్నారు. మీడియా ప్రతినిధులపైనా జులుం ప్రదర్శించారు. దీంతో పోలీసులపై తనదైన రేంజిలో లోకేశ్ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన టీడీపీ నేతలను కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు తనను అరెస్ట్ చేసినా.. ఏమాత్రం బెదరని లోకేశ్.. తన వాహనం మీదకు ఎక్కి.. పిడికిలి ఎత్తి చూపించారు. దీంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా తాము కూడా లోకేశ్ మాదిరే పిడికిళ్లు బిగించి మరీ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లోకేశ్ ను తమ వాహనంలోకి ఎక్కించుకుని హుటాహుటీన అక్కడి నుంచి తరలించారు.
అరెస్ట్ చేసి భోజనం పెడతారా?
లోకేశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనను గుంటూరు నుంచి తొలుత ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడే స్టేషన్ లో ఆయనను మధ్యాహ్నం దాటే దాకా కూర్చోబెట్టారు. ఆ సమయంలో ఆయనకు పోలీసులు మధ్యాహ్న భోజనం చేయాలని విన్నవించారు. అయితే అకారణంగా అరెస్ట్ చేసిన తనకు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి భోజనం పెడతామంటారా? అంటూ పోలీసుల తీరుకు నిరసనగా తాను భోజనం చేసేదే లేదని తేల్చి చెప్పారు. భోజనం చేయమని పోలీసులు ఎంతగా బతిమాలినా కూడా లోకేశ్ మెత్తబడలేదు. ఆ తర్వాత టీడీపీ నేతలు బెయిల్ కోసం యత్నిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు లోకేశ్ ను ప్రత్తిపాడు నుంచి వేరే పోలీస్ స్టేషన్ కు తరలించే యత్నం చేశారు. అయితే లోకేశ్ వెన్నంటే టీడీపీ శ్రేణులు వెళుతూ ఉండటంతో పదే పదే రూట్లు మార్చి.. ఆ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్ అంటూ రాత్రికి ఉండవల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఓ పక్క లోకేశ్ తో పాటు అరెస్టైన టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్ లను పోలీసులు విడిచిపెట్టినా.. లోకేశ్ విడుదలలో మాత్రం జాప్యం ప్రదర్శిస్తున్నారు. అయితే పోలీసులు ఎంతదాకా తనను వేధిస్తారో తానూ కూడా చూస్తానన్న రీతిలో లోకేశ్ కూడా ఏం జరుగుతున్నా.. కామ్ గానే కొనసాగుతున్నారు. మొత్తంగా తనను బెదరగొట్టాలని చూస్తున్న పోలీసులకు లోకేశ్ తనదైన శైలిలో చుక్కలు చూపిస్తున్నారు.
ఎట్టకేలకు విడుదల
గుంటూరు నుంచి తొలుత ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించిన నారా లోకేశ్ ను ఆ తర్వాత పొన్నూరు, పెదనండిపాడు, గుంటూరు పోలీస్ స్టేషన్ల మధ్య అటు ఇటూ తిప్పుతూ చివరకు సాయంత్రానికి ఉండవల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఉండవల్లి పోలీస్ స్టేషన్ కు కాకుండా పెదకాకాని పోలీస్ స్టేషన్ కు తరలించి.. అక్కడ నుంచి ఆయనను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే లోకేశ్ పై సీఆర్పీసీ 151 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా నోటీసులపై లోకేశ్ చేత సంతకం పెట్టించుకుని మరీ ఆయనను వదిలిపెట్టారు. మొత్తంగా లోకేశ్ ను అరెస్ట్ చేసి ఆయనను విడుదల చేసేదాకా పోలీసులు పెద్ద హైడ్రామానే నడిపినా.. లోకేశ్ ఏమాత్రం తగ్గకుండానే పోలీసుల తీరుపై తనదైన శైలి నిరసన తెలిపారు.
Must Read ;- లోకేశ్ తొలి అరెస్ట్ ఏపీని షేక్ చేసింది!











