పంటల బీమా ప్రీమియం మొత్తం తామే చెల్లిస్తామంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనల్లో డొల్లతనం మరోసారి బయట పడింది. అసెంబ్లీలో స్లైడ్స్ వేసి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంత మంది రైతులకు ప్రీమియం చెల్లించారు, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎంత మంది రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించారో వివరిస్తూ సీఎం అసెంబ్లీలో చూపిన స్లైడ్స్ ఇప్పుడు వారికే చుట్టుకున్నాయి. తాజాగా ఇవాళ రైతులకు పంటల బీమా విడుదల చేస్తున్నామంటూ కేవలం రూ.918 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో వేయడంతో రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీలో 58.77 లక్షల మంది రైతులకు 2019లో పంటల బీమా ప్రీమియం చెల్లించామని సీఎం ప్రకటించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో ఆ సంఖ్య 49.80 లక్షలకు పడిపోయింది. ఇది కూడా సరైన గణాంకాలా అంటే అది లేదు. దీంతో ఏపీ ప్రభుత్వం పంటల బీమా విషయంలో రైతులను ఎంత మోసం చేస్తోందో మరోసారి తెలిసివచ్చింది.
ప్రభుత్వం చెల్లించింది 26 లక్షల మంది రైతులకే..
ఏపీ ప్రభుత్వం కేవలం 26 లక్షల మంది రైతులకే 2019 సంవత్సరానికి పంటల బీమా చెల్లించిందని సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ పార్లమెంటులో ప్రకటించారు. కొన్ని రాష్ట్రాల్లో పంటల బీమా రైతు షేర్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలే పంటల బీమా ప్రీమియం చెల్లించే ప్రాంతాల్లో రైతులు తీసుకున్న పంట రుణంలో నుంచి ఫసల్ బీమా కింద కనీసం ఒక్క రూపాయి కట్ చేస్తున్నారు. ఇలా కట్ చేస్తేనే ఆ రైతు పంటల బీమా పరిధిలోకి వస్తారు. ఇలా 2019లో ఏపీ ప్రభుత్వం రైతుల తరఫున కేవలం 26 లక్షలు మాత్రమే చెల్లించిందని కేంద్ర మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం 49.80 లక్షల మంది రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించామని ఇవాళ పత్రికల్లో అసత్య ప్రకటనలు గుప్పించింది.
భారీగా కోత వేశారు
2019 పంటల బీమా పరిహారం కింద ఏపీకి రూ.1819కోట్లు విడుదల అయ్యాయి. కానీ ఏపీ ప్రభుత్వం కేవలం రూ.918 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో మంగళవారం జమ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది రైతులకు 2019 ఖరీఫ్ పంటల నష్టాలని బీమా కింద ఏపీ ప్రభుత్వం రూ.918 కోట్లు విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం పంటల బీమా కంపెనీలకు ముందే ప్రీమియం చెల్లించి ఉంటే నేడు రైతులకు రూ.1819 కోట్లు వారి ఖాతాల్లో పడేవి. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చెల్లించే ఉద్దేశం లేక బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించలేదు. కానీ అసెంబ్లీలో ప్రతిపక్షాలు పంటల బీమాపై ఆర్టీఐ చట్టం కింద సమాచారం తీసుకువచ్చి ప్రదర్శించడంతో ప్రభుత్వం అడ్డంగా ఇరుక్కు పోయింది. ఇక చేసేది లేక ఏపీ ప్రభుత్వమే పంటల బీమా చెల్లిస్తుందని సీఎం ప్రకటించారు. సీఎం అసెంబ్లీలో ఇచ్చిన ప్రకటన మేరకు ప్రస్తుతం కొంత బీమా చెల్లించారు.
Must Read ;- జగనన్న ఫైర్ : బీమా చెల్లింపులతో వారికేం సంబంధం!


నివర్ తుఫాను నష్టం ఎవరు భరిస్తారు
2020 నవంబరులో వచ్చిన నివర్ తుఫానుకు ఏడు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లిస్తామని చెప్పి రైతులను మోసం చేసింది. 2019లో ఖరీఫ్ పంటల బీమాను ఇవాళ చెల్లిస్తున్న ప్రభుత్వం, నివర్ తుఫానుకు నష్టపోయిన 30 లక్షల మంది రైతులకు పంటల బీమా ఎప్పుడు చెల్లిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే పంటల బీమా ప్రీమియం చెల్లించి ఉంటే నివర్ తుఫానుకు నష్టపోయిన రైతులకు రూ.3,500 కోట్ల పరిహారం అందేది. రైతుల తరఫున మొత్తం ప్రీమియం తామే చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2019 ఖరీఫ్ నష్టం ఇవాళ చెల్లిస్తే 2020 ఖరీఫ్ నష్టం ఎప్పుడు చెల్లిస్తారు? అసలు నివర్ తుఫానుతో నష్టపోయిన రైతులను పంటల బీమా వస్తుందా? రాదా అనే సందేహాలు వస్తున్నాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read ;- పంటల బీమాకు తిలోదకాలు : అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ నిరసన