తెలుగు తెరపై అందాల కథానాయికగా కుర్రకారు మనసులను మెహ్రీన్ దోచేసుకుంది. చక్కని స్కిన్ టోన్ తో కలువమొగ్గలా కనిపించే ఈ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి కుర్రాళ్లకి కంటినిండా నిద్ర కరువైంది. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న ఈ అమ్మాయికి, ‘మహానుభావుడు’ .. ‘రాజా ది గ్రేట్‘ వంటి భారీ విజయాలు వెంటవెంటనే పడ్డాయి. దాంతో ఇక ఈ సుందరి దూకుడుకి అడ్డుకట్ట వేయడం కష్టమేనని అంతా అనుకున్నారు. అలా వాళ్లంతా అనుకున్నట్టుగా అవకాశాలైతే వచ్చాయిగానీ, అవి సక్సెస్ కి చాలా దూరంలోనే ఉండిపోయాయి. వరుస పరాజయాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
ఈ నేపథ్యంలోనే ఇక మెహ్రీన్ పనైపోయిందని అంతా అనుకున్నారు. ఆమెలో కూడా అభద్రతా భావం కలగిందేమో, తమిళ .. పంజాబీ అవకాశాలపై దృష్టిపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ‘ఎఫ్ 2’ సినిమాలో కథానాయికగా అవకాశం ఆమె తలుపు తట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె వరుణ్ తేజ్ జోడీగా అలరించింది. ఈ సినిమాలో ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ ఆమె చేసిన సందడిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. గ్లామర్ పరంగానే కాదు, కామెడీ టచ్ ఉన్న ఈ పాత్రను మెహ్రీన్ బాగా చేసిందనే మంచి మార్కులు కొట్టేసింది. ‘ఎఫ్ 2’ నుంచి మళ్లీ మెహ్రీన్ కెరియర్ పుంజుకుంటుందని అంతా భావించారు. కానీ ఈసారి కూడా అందుకు భిన్నంగానే జరుగుతూ వచ్చింది.
Must Read ;- ఇక్కడ రకుల్ స్పీడ్ తగ్గింది అందుకే ..!
‘ఎఫ్ 2’ తరువాత మెహ్రీన్ చేసిన ‘చాణక్య’ .. ‘ఎంతమంచివాడవురా’ .. ‘అశ్వద్ధామ’ సినిమాలలో, ఒక్క ‘ఎంతమంచివాడవురా’ మాత్రమే ఫరవాలేదనిపించుకుంది. ‘అశ్వద్ధామ’తో ఈ ఏడాది ఆరంభంలో పలకరించిన మెహ్రీన్, ఆ తరువాత జాడలేదు. అభిమానులకు ఆమె కొత్త ప్రాజెక్టులను గురించిన క్లారిటీ లేదు. ఆ మధ్య ఒకటి రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఆమె పేరు వినిపించినా, ఆ తరువాత ఎలాంటి అప్ డేట్లు లేవు. కొత్తగా ప్రకటిస్తున్న సినిమాల్లో కథానాయికలుగా ఎవరెవరి పేర్లో వినిపిస్తున్నాయిగానీ మెహ్రీన్ మాత్రం కనిపించడం లేదు. అవకాశాలు లేవా? అప్ డేట్లు లేవా? అనే విషయంలో అభిమానులు అయోమయానికి లోనవుతున్నారు. ఈ విషయంపై అందాల సుందరి స్పందిస్తే బాగుంటుంది.
Also Read ;- ప్రియాంక జవాల్కర్ దశ తిరిగేనా?