టాలీవుడ్లో ఇంతవరకూ అపజయమెరుగని దర్శకుల జాబితాలో రాజమౌళి .. కొరటాల శివ తరువాత స్థానంలో అనిల్ రావిపూడి కనిపిస్తాడు. దర్శకుడిగా మారడానికి ముందు అనిల్ రావిపూడి రచయితగా కొన్ని హిట్ చిత్రాలకు పనిచేశాడు. అందువలన ఆయనకి కథాకథనాలపై .. సంభాషణలపై మంచి పట్టువుంది. ఈ కారణంగానే ఆయన తన సినిమాల్లో కంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోగలుగుతున్నాడు. ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న ఆయన, ఆ తరువాత ఆ సక్సెస్ ను కొనసాగిస్తూనే వస్తున్నాడు. యాక్షన్ కామెడీకి పెద్దపీట వేస్తూ ఆయన తెరకెక్కించిన సినిమాలకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది.
క్రితం ఏడాది అనిల్ రావిపూడి నుంచి వచ్చిన ‘F2’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. తమన్నా .. మెహ్రీన్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమా, ప్రేక్షకులకు వినోదాల విందుచేసింది. అనిల్ రావిపూడితో పాటు హీరోహీరోయిన్ల కెరియర్లోను ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోయింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ‘F3’ తీయడానికి ఆయన రంగంలోకి దిగాడు. ఇందుకు సంబంధించిన కథపై ఆయన గట్టిగానే కసరత్తు చేశాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాలో, వెంకటేశ్ .. వరుణ్ తేజ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా వుండనున్నట్టు ఆ మధ్య వార్తలు షికారు చేశాయి. మూడో హీరోగా రవితేజ పేరు ఎక్కువగా వినిపించింది.
డిసెంబర్ 14వ తేదీ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. వినోదం పరంగా ‘F2’కి ఎంతమాత్రం తగ్గకుండా ‘F3’ రూపొందనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి ముందు మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టింది. అందువలన ఆ తరువాత సినిమాగా వస్తున్న ‘F3’ పై అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను అందుకోవడానికి బడ్జెట్ పెంచవలసి వస్తోంది. ఇదే నేపథ్యంలో అనిల్ రావిపూడి తన ఇమేజ్ కి తగినట్టుగా పారితోషికాన్ని పెంచేశాడని టాక్. ఇక ఈ సీక్వెల్లో చేస్తున్న వరుణ్ తేజ్ కూడా తన పారితోషికాన్ని పెంచాడు. ఈ కారణంగా ఈ సినిమా బడ్జెట్ బాగానే పెరగనున్నట్టు ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Must Read ;- సక్సెస్ కోసం నిరీక్షిస్తున్న అందాల రాక్షసి











