తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురవడంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ లో చికిత్స నిమిత్తం చేరారు. బీపీ పెరగడంతో ఇబ్బందిపడ్డ ఆయన ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, చికిత్స అందిస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు ఒక అధికార ప్రకటనను విడుదల చేశారు. రజనీకాంత్ – మోహన్ బాబు మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నారు. తన స్నేహితుడు అస్వస్థతతో హాస్పిటల్‌లో చేరారనే వార్త తెలుసుకున్న ఆయన ఆందోళనకు గురయ్యారు.
వెంటనే ఆయన యోగక్షేమాలు తెలుసుకునేందుకు రజనీ భార్య లతకు, కుమార్తె ఐశ్వర్యకు, సోదరికి ఫోన్లు చేశారు. రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఎలాంటి ఆందోళనా పడాల్సిన అవసరం లేదనీ వారు చెప్పడంతో మోహన్‌బాబు కుదుటపడ్డారు. రజనీ మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తి అనీ, ఈ అస్వస్థత నుంచి ఆయన త్వరగా కోలుకుని, ఎప్పటిలా తన పనులు మొదలుపెడతారనీ మోహన్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
Must Read ;- తలైవా రజనీకాంత్ సినిమాకి కరోనా షాక్ .. !