గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ‘సీటీమార్’ చిత్రం ఈరోజు విడుదలైంది. తమన్నా, దిగంగనా సూర్యవంశి, భూమిక, రెహ్మాన్ లాంటి తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కింది. కబడ్డీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఎలా ఉందన్నది తెలుసుకుందాం.
కథలోకి వెళితే..
కడియం అనే చిన్న ఊరు నుంచి ఢిల్లీకి సాగే కథ ఇది. బ్యాంకు మేనేజర్ కార్తీక్ (గోపీచంద్) స్పోర్ట్స్ కోటాలో ఆ ఉద్యోగం సాధించుకుంటాడు. తన తండ్రి కట్టించిన స్కూలును బాగుపరచాలనే లక్ష్యంతో ఓ మహిళా కబడ్డీ జట్టును తయారు చేస్తాడు. కోచ్ గా వారికి శిక్షణ ఇచ్చి ఆంధ్ర ప్రదేశ్ తరఫున నేషనల్ కబడ్డీ పోటీకి ఆ జట్టును ఢిల్లీకి తీసుకెళతాడు. అక్కడికి తెలంగాణ జట్టు కోచ్ గా జ్వాలా రెడ్డి (తమన్నా) తన జట్టుకు తీసుకువస్తుంది.
అక్కడ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉంటూనే అరాచకాలు సృష్టించే మక్కన్ సింగ్ (తరుణ్ అరోరా)తో అతనికి శత్రుత్వం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రా జట్టును మక్కన్ సింగ్ కిడ్నప్ చేస్తాడు. అసలు మక్కన్ సింగ్ తో అతనికి వైరం ఎలా ఏర్పడింది? తన జట్టును కాపాడుకోడానికి అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? దానికి జ్వాలారెడ్డి ఎలా తోడ్పడింది? లాంటి అంశాలతో ఈ కథ సాగుతుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రామాలో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
కథలో కొత్త దనం ఏమీ లేదు. క్రీడల నేపథ్యంలో ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. ప్రథమార్థమంతా ఫ్యామిలీ డ్రామాగా సినిమాని నడిపారు. ద్వీతాయర్థంలో యాక్షన్ మోతాడు పెంచారు. లాజిక్ కు అందని అంశాలు అనేకం సినిమాలో ఉన్నాయి. తమ పిల్లలతో కబడ్డీ ఆడించడం ఇష్టం లేని తల్లిదండ్రులకు హీరో నచ్చచెప్పడం లాంటి అంశాలు చాలా సినిమాల్లో చూశాం. ఉపోద్ఘాతాలను జీర్ణించుకునే స్థితిలో ప్రేక్షకులు లేరన్న విషయాన్ని దర్శకుడు గుర్తుంచుకోవాలి. ఇలాంటి అనవసర సన్నివేశాలు సినిమాలో అక్కడక్కడా ఉన్నాయి.
కార్తీక్ గా గోపీచంద్ బాగా నటించాడు. ముఖ్యంగా తనదైన యాక్షన్ మసాలా ఇందులో కూడా ఉంటుంది. ఇక జ్వాలా రెడ్డిగా తమన్నా తన దైన దూకుడును ప్రదర్శించింది. దిగంగనా సూర్యవంశిని మరో హీరోయిన్ గా చూపినా ఆమె ప్రథమార్థానికే పరిమితమైంది. ఈ ఇద్దరి భామల్లో హీరో ఎవరి వైపు మొగ్గు చూపాడన్న అంశాన్ని దర్శకుడు ప్రేక్షకులకే వదిలేశాడు. కార్తీక్ బావగా రెహ్మాన్, కార్తీక్ అక్కడా భూమిక పాత్రలు బాగున్నాయి. మాస్ అంశాలు కోరుకునే ప్రేక్షకుల కోసమే ఈ కథను తయారు చేసుకున్నట్టు ఉంది.
కబడ్డీ జట్టు కోసం మంచి అమ్మాయిల్ని మాత్రం ఎంపిక చేసుకున్నారు. గోపీచంద్ జట్టులో ప్లేయర్ గా నటించిన ప్రీతి అస్రానీలో గ్లామర్ తో పాటు చలాకీ తనం కూడా బాగా కనిపించింది. ఆకట్టుకునే పాత్ర ఇది. జ్వాలారెడ్డి పాత్ర పక్కా మాస్ మసాలా అంశాలతో ఉంది. మాస్ సినిమా కాబట్టి లాజిక్ జోలికి పోకుండా ఎంజాయ్ చేయాలేమో. మెడను కోసేస్తే కుట్టు వేసుకుని ఉన్న శైలు పాత్ర క్లైమాక్స్ లో అమాంతం జట్టులోకి వెళ్లి జట్టును గెలిపించడం సినిమాటిక్ అనుకోవాలి.
అలాగే రెహ్మాన్ గుండెల్లో గునపం పొట్టలో నుంచి దిగి వీపు పైకి వచ్చినా సూపర్ మేన్ లా బతికిపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. హీరో పాత్ర కూడా అలాగే ఉంటుంది. రావు రమేష్ పాత్ర డైలాగులతోనే సరిపెట్టేద్దామని ముందే నిర్ణయించుకున్నట్టుంది. ఆయనని కూడా సరిగా వాడుకోలేదు. పాత్రలెక్కువైతే వాడుకోవడం కూడా కష్టమే కదా. సంగీతదర్శకుడిగా మణిశర్మ తన వరకూ న్యాయం చేశాడు.
నటీనటులు: గోపీచంద్, తమన్నా, దిగంగనా సూర్యవంశీ, రెహ్మాన్, భూమిక, రావు రమేష్, అన్నపూర్ణ, ప్రగతి, ప్రీతి అస్రానీ, తరుణ్ అరోరా, పోసాని కృష్ణమురళి తదితరులు.
సాంకేతికవర్గం: సంగీతం మణిశర్మ, కెమెరా సౌందరరాజన్, ఎడిటింగ్ తమ్మిరాజు.
నిర్మాత: సి. శ్రీనివాస్
దర్శకత్వం: సంపత్ నంది
విడుదల: 10-09-2021
ఒక్క మాటలో: ఊరమాస్ కావాలంటేనే
రేటింగ్: 2.75/5











