సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘అన్నాత్త’. ఎప్పుడో మొదలైన చిత్రం షూటింగ్ మిగిలిన సినిమాల షూటింగ్స్ లాగానే కరోనా కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. తిరిగి ఈమధ్యనే అన్ని సినిమాల షూటింగ్స్ మొదలయ్యాయి. కాని రజినీకాంత్ ‘అన్నాత్త’ మాత్రం ఇప్పటికీ తిరిగి మొదలవ్వలేదు. రజినీ గతంలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. అందుకనే డాక్టర్ల సలహా మేరకు కరోనా సమయంలో ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. కరోనా ఉద్రిక్తత తగ్గే వరకు సినిమా షూటింగ్స్ లో జాయిన్ అవ్వనని ఇప్పటికే స్పష్టం చేశారు రజనీ.
మరి ‘అన్నాత్త’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియక రజనీ అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. దర్శకనిర్మాతల్లో ఎవరోఒకరు సినిమా ఎప్పుడు మొదలవుతుందో అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా షూటింగ్ రీస్టార్ట్ కానుందని తెలుస్తోంది. అంతేకాకుండా సమ్మర్ నుండి షూటింగ్ మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని దర్శకుడు శివ ప్లాన్ చేస్తున్నారని టాక్.
ఇకపోతే ‘అన్నాత్త’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం దర్శకుడు శివ దర్శకత్వం వహించిన ‘వీరం’, ‘వివేగం’, ‘వేదాళం’, ‘విశ్వాసం’ సినిమాలు సూపర్ హిట్స్ అవ్వడమే. హీరోయిజంను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ శివది అందివేసిన చేయి. ఇక ‘అన్నాత్తే’ సినిమాలో రజినీకాంత్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి మరి. కరోనా ఉద్రిక్తత త్వరలోనే తగ్గి తమ అభిమాన హీరో రజినీకాంత్ షూటింగ్ లో పాల్గొని సినిమాను త్వరగా రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Must Read ;- మరో మల్టీస్టారర్ కు రెడీ అవుతోన్న తమిళ స్టార్ హీరో










