త్రిమూర్తులలో ఎవరి ప్రత్యేకత వారిది .. బ్రహ్మ తన ‘సృష్టి’ రచన నిరంతరం కొనసాగిస్తూ ఉంటాడు. శ్రీమహావిష్ణువు ‘స్థితి’ కారకుడిగా తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇక మహాదేవుడు ‘లయ’ కారకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటాడు. అటు బ్రహ్మకు .. ఇటు శివుడికి మధ్య ‘స్థితి’ కార్యాన్ని శ్రీమహావిష్ణువు నడిపిస్తూ ఉంటాడు. సృష్టి మొత్తంలో సమతుల్యతను సాధిస్తూ ఉంటాడు. అలాంటి శ్రీమహావిష్ణువును ఇంద్రాది దేవతలు .. మహర్షులు అనునిత్యం సేవిస్తూ ఉంటారు. ఎంతోమంది మహాభక్తులు శ్రీమహావిష్ణువు ఆరాధనలో తరిస్తుంటారు.
శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు ‘ఏకాదశి’ అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి మాసంలో శుక్ల పక్షంలో ఒక ఏకాదశి .. కృష్ణ పక్షంలో ఒక ఏకాదశి చొప్పున రెండు ఏకాదశులు వస్తాయి. అలా ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ‘ఏకాదశి’ ఎంతో ప్రత్యేకతను .. మరెంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. అలా ‘ధనుర్మాసం’లో వచ్చే ఏకాదశి ‘వైకుంఠ ఏకాదశి’గా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏకాదశి ప్రత్యేకతతో కూడుకుని ఉన్నప్పటికీ, ‘వైకుంఠ ఏకాదశి’ మరింత విశేషాన్ని కలిగినదనేది మహర్షుల మాట.
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహావిష్ణువు, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆ యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. ఆ తరువాత లక్ష్మీదేవి సమేతంగా ‘బృందావనం’ (తులసి కోట)లో ఉంటూ పూజలు అందుకుంటాడు. అలా భక్తులకు తన పూజా భాగ్యాన్ని కల్పించిన స్వామి, ధనుర్మాసంలోని శుద్ధ ఏకాదశి రోజున లక్ష్మీదేవి సమేతుడై గరుడ వాహనంపై ‘వైకుంఠం’ చేరుకుంటాడు. అప్పటికే ఇంద్రాదిదేవతలు లక్ష్మీనారాయణుల రాక కోసం ఉత్తరద్వారం చెంత ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు.
లక్ష్మీనారాయణులు వైకుంఠానికి చేరుకోగానే, ఇంద్రాదిదేవతలు ఉత్తరద్వారం గుండా వచ్చి వారి దర్శనం చేసుకుంటారు. ముక్కోటి దేవతలు లక్ష్మీనారాయణులను స్తుతిస్తూ .. సేవించుకుంటారు. ముక్కోటి దేవతలు ఒక్కసారిగా లక్ష్మీనారాయణులను దర్శించుకునే ఏకాదశి కావడం వల్లనే ‘వైకుంఠ ఏకాదశి’కి ‘ముక్కోటి ఏకాదశి’ అనే పేరు వచ్చింది. ముక్కోటి దేవతలే స్వామివారి .. అమ్మవారి దర్శనం కోసం వేచి ఉంటారంటే ‘వైకుంఠ ఏకాదశి’ ఎంతటి విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే మహర్షులు .. మహాభక్తులు .. స్వామిని సేవించే ఈ అవకాశాన్ని ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోరు.
‘వైకుంఠ ఏకాదశి’ రోజున వైష్ణవ సంబంధమైన ప్రతి దేవాలయంలోను ‘ఉత్తరద్వారం’ ఏర్పాటు చేస్తారు. ఆ రోజున తెల్లవారు జామునే నిద్రలేచి తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. దగ్గరలోని వైష్ణవ ఆలయానికి వెళ్లి ఉత్తరద్వారం గుండా లక్ష్మీనారాయణులను దర్శించుకోవాలి. తాజా పండ్లను .. తాజాగా కోసిన పరిమళవంతమైన పువ్వులను .. తులసి మాలలను .. భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. తీర్థ ప్రసాదాలను స్వీకరించి, ఆలయ మంటపంలో కాసేపు కూర్చోవాలి. తమ జీవితంలో అనేక అవాంతరాలను దాటుతూ రావడంలో భగవంతుడు చేసిన సాయానికిగాను ఆయనకి కృతజ్ఞతలు తెలిజేయాలి.
పురాణాలు సూచించిన ప్రతి వ్రతము ప్రత్యేకమైనదే. వాటిలో ‘ఏకాదశి వ్రతం’ మరింత విశేషమైనదిగా చెబుతారు. ఈ రోజున చాలామంది ‘ఏకాదశి వ్రతం’ జరుపుకుంటారు. ఉపవాస దీక్షను చేపట్టి .. పూజాభిషేకాలు నిర్వహించి .. నైవేద్యాలు సమర్పించి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజు రాత్రి స్వామి సంకీర్తనలతో … భజనలతో జాగరణ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా వ్రత విధానం సూచించిన నియమాలను పాటిస్తూ వ్రతాన్ని పూర్తిచేయవలసి ఉంటుంది. ఇలా చేయడం వలన సకల శుభాలు కలుగుతాయనీ, ఆ తరువాత ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
సహజంగానే ‘ధనుర్మాసం’ ఎంతో విశేషమైనది. గోదాదేవి (ఆండాళ్) రంగనాయక స్వామిపట్ల తనకి గల అపారమైన ప్రేమను ఆవిష్కరించి, ఆ స్వామి సరసన స్థానాన్ని సంపాదించుకుంది. మధురభక్తితో సాక్షాత్తు ఆ రంగనాథుడినే భర్తగా పొందింది. అందువలన శ్రీమన్నారాయణుడిని స్తుతిస్తూ ‘గోదాదేవి’ రచించిన పాశురాలను ఈ మాసంలో వైష్ణవ దేవాలయాలలో గానం చేస్తుంటారు. స్వామివారికి ఇష్టమైన ‘పొంగలి’ .. ‘దధ్యోదనం’ ప్రసాద వితరణ ప్రతి ఆలయంలో జరుగుతూ ఉంటుంది.
ఈ మాసంలోనే గోదాదేవి రంగనాయకుల కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. గోదాదేవి తన భర్తగా రంగనాయకస్వామిని పొందింది ‘భోగి’ పండుగ రోజున. అందువలన అదే రోజున వైష్ణవ సంబంధమైన ఆలయాలలో కల్యాణోత్సవాన్ని జరుపుతుంటారు. భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కల్యాణోత్సవంలో పాల్గొంటారు. గోదాదేవి కల్యాణాన్ని తిలకించడం వలన, కన్యలకు తాము కోరుకున్నవారితో వివాహమవుతుందని విశ్వసిస్తుంటారు. అలాగే స్త్రీలకు సంతాన సౌభాగ్యాలు వృద్ధి చెందుతాయని చెబుతారు.
ఇలా శ్రీమహావిష్ణువు ఆరాధన పరంగా ‘ధనుర్మాసం’ ఎంతో ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. అలాంటి ఈ పుణ్య మాసంలో వచ్చే ‘వైకుంఠ ఏకాదశి’ .. మరింత పుణ్య విశేషాన్ని కలిగిందనేది శాస్త్రవచనం. అందువలన ‘వైకుంఠ ఏకాదశి’ రోజున ఆలయ దర్శనం .. ఉపవాస దీక్ష .. జాగరణ .. ఏకాదశి వ్రత ఆచరణ .. స్వామివారి సంకీర్తన .. పురాణ శ్రవణం .. అత్యుత్తమమైన ఫలాలను అందిస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు సెలవిస్తున్నారు.
— పెద్దింటి గోపీకృష్ణ











