ఈ రోజుల్లో అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు చెప్పండి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది యంగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపించాలనుకుంటారు. అయితే అందంగా కనిపించాలంటే కచ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో కావాల్సిందే మరి. అవేంటో తెలుసుకొని ఫాలో అయిపోండి ఇక. అరవైలో కూడా ఇరవైలా కనిపించవచ్చు.
కంటి నిండా నిద్ర
చర్మం పొడిబారుతోంది అంటే సరైన నిద్రకు దూరంగా ఉన్నారని అర్థం. రోజూ ఎనిమిది గంటల నిద్ర లేకపోతే కళ్ల కింద వలయాలు ఏర్పడతాయి. ఉదయం, రాత్రి పడుకునే ముందు వేలి కొసలతో తేనె అద్దుకొని కళ్ల కింద ఉబ్బుగా ఉన్న చోట రాయాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్లో ముంచిన దూదితో ముఖమంతా రాయాలి. యోగాలో ఫేస్ యోగా ద్వారా ఫేస్ ను కాంతివంతంగా మార్చుకోవచ్చు. రోజువారి దినచర్యలో భాగంగా ఫేస్ యోగా చేస్తే, ఎల్లప్పుడు ఫేస్ లో కాంతి కనిపిస్తుంది.
Must Read ;- గ్యాస్ట్రిక్ సమస్యా.. అయితే వీటికి దూరంగా ఉండండి!
ఫేస్ మాస్క్స్
వయసు పెరుగుతున్నకొద్దీ స్కన్ నునుపుదనం తగ్గుతుంది. కాంతివిహీనంగా మారుతుంది. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కొన్ని యాంటీ ఏజింగ్ ఫేస్ మాస్కులు మార్కెట్లలో దొరుకుతున్నాయి. వీటిని వారానికి రెండు, మూడుసార్లు ముఖానికి రాసుకుంటే చర్మం పట్టులా మెరుస్తుంది.
ముడతలకు చెక్
గుడ్డులోని తెల్లసొనలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు బాగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముడతలు పడకుండా కాపాడుతాయి. అంతేకాకుండా తెల్లసొన చర్మానికి అవసరమైన అదనపు పోషకాలను కూడా అందిస్తుంది. అందుకే తెల్లసొనలో కొద్దిగా పాలమీగడ, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా అవుతుంది.
ముఖానికి అరటిపండు
అరటిపండులో విటమిన్ ఎ, ఇ, బిలు బాగా ఉంటాయి. అందుకే బాగా మగ్గిన అరటిపండును తీసుకుని దాన్ని సన్నటి ముక్కలుగా తరిగి వాటిల్లో ఒక్కొక్క టీస్పూన్ చొప్పున రోజ్ వాటర్, తేనె, పెరుగు వేసి ఆ మిశ్రమాన్ని బ్లెండర్లో వేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
కాంతివంతం కోసం..
చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో బంగాళాదుంప ఎంతగానో ఉపయోగపడుతుంది. బంగాళాదుంపలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం నిగనిగలాడుతూ యవ్వనంగా ఉండేలా చేసే కొలొజిన్ ఉత్పత్తిని బాగా పెంచుతుంది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. అందుకే బంగాళాదుంపలను ముక్కలుగా తరిగి, వాటిని మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేయాలి. ఆ పేస్టును పలుచని వస్త్రంలో పెట్టి గట్టిగా పిండితే రసం వస్తుంది. దూదితో ముఖం, మెడ భాగాలను రుద్దుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
చర్మ యవ్వనానికి…
చర్మం యవ్వనానికి కొబ్బరి పాలు కూడా మేలు చేస్తాయి. కొబ్బరిపాలు చర్మానికి రాసుకుంటే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఇందులో యాంటాక్సిడెంట్లు, యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని కాలుష్యరహితంగా చేస్తాయి. చర్మ రంధ్రాల్లోని మురికిని పోగొడతాయి. కొబ్బరిపాలలో ముఖాన్ని, మెడను బాగా రుద్దుకొని, పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం పట్టులా మారుతుంది.
Also Read ;- బీట్ ది హీట్ : సమ్మర్ కేర్ ఇలా..