గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. సత్తెనపల్లి పట్టణం నిర్మలనగర్ లో పన్నిండేళ్ల బాలుడు వినయ్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. వినయ్ ను కిడ్నాప్ చేసిన దుండగులు రూ.10 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. పోలీసులకు చెబితే చంపివేస్తామంటూ బాలుడి కుటుంబ సభ్యులకు దుండగులు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. వినయ్ కిడ్నాప్ పై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిన్న రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు.
ఫోన్ చేసి బెదిరింపులు
బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు, వినయ్ బంధువులకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. వినయ్ ను కిడ్నాప్ చేసి విజయవాడ తీసుకెళుతున్నామని చెప్పారు. డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకుంటే వినయ్ ను చంపివేస్తామని బెదిరింపులకు దిగారు. అయితే పేద కుటుంబానికి చెందిన వినయ్ ను కిడ్నాప్ చేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ కిడ్నాప్ తెలిసిన వారే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బాలుడి కిడ్నాప్ ను ఛేదించేందుకు పోలీసులు సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ నగరాల్లో తనిఖీలు చేపట్టారు.
Also Read ;-సినిమా స్టైల్లో డాక్టర్‌కు బురఖా ధరించి కిడ్నాప్ చేశారు!
వరుస ఘోరాలు మాస్ సైకాలజీనా..
ఒక చోట జరుగుతున్న ఇలాంటి దురాగతాలు ఇతర ప్రాంతాల్లోని వారికి స్ఫూర్తి ఇస్తున్నాయా? ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న కిడ్నాప్ ఘటనలను చూస్తోంటే.. ఇలాంటి అనుమానమే కలుగుతోంది. ఇటీవలి కాలంలో వరుస కిడ్నాప్ లు శృతిమించుతున్నాయి. ఒకచోట కిడ్నాప్ ఉదంతం బయటకు రాగానే.. మరొక చోట ఇలాంటి నేరగాళ్ల స్ఫూర్తి పొందుతున్నారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనుకునే వారికి ఇలాంటి తప్పుడు పనులు కిక్ ఇస్తున్నాయి. సులువైన దారిగా కనిపిస్తున్నాయి. ఒక్కో కిడ్నాప్ ఉదంతంలో దొరికిపోయిన వారి వార్తలు చదువుతూ ఆ ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త నేరాలు చేస్తున్నారు.
Must Read ;- రా అధికారినంటూ నాలుగేళ్లుగా మహిళకు మోసం!











