సినిమాలను రివ్యూల పేరుతో వివిధ సామాజిక మాధ్యమాలు ఖూనీ చేస్తున్నాయా? నిజానికి ఈ రేటింగుల్లో నిజానిజాలు ఎంత? ఏ ప్రాతిపదిక మీద ఈ రివ్వ్యూలు ఇస్తున్నాయి? లాంటి అంశాలన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.
సినిమా ఎంత బాగున్నా 5కు 3 రేటింగులకు మించి ఇవ్వడం లేదు. ఒక్కోసారి బాగున్న సినిమాకు 2 రేటింగులు కూడా ఇచ్చేస్తున్నారు. అసలు సినిమాలు చూడకుండానే రివ్వ్యూలు రాసేస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇంతకుముందు దర్శకుడు పూరి జగన్నాథ్ ‘నేనింతే’ సినిమాలో ఇలాంటి రివ్వ్యూల మీద డైలాగులు కూడా పెట్టారు. అనేక సందర్భాల్లో హీరోలు సైతం రేటుంగుల మీద అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాకి ఇచ్చిన రేటింగుల విషయంలోనూ ఆక్రోశం వెళ్లగక్కారు.
ఇలాంటి రేటింగులు ఎంత లేదన్నా సినిమా కలెక్షన్ల మీద ప్రభావం చూపుతాయన్న అభిప్రాయం నిర్మాతల్లో ఉంది. ముఖ్యంగా చిన్న సినిమాలు ఇలాంటి రేటింగుల వల్ల దెబ్బతింటున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదే విషయం మీద దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవల మళ్లీ స్పందించారు కూడా. జర్నలిస్టులు ఇచ్చే రేటింగులు తెలుగు సినిమాలను ప్రమాదంలో పడేస్తున్నాయని, ఫ్లాప్ నిర్మాతలను సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టి పారిపోయేలా చేస్తున్నాయని అన్నారు. ఆయన లెక్క ప్రకారం ఒక ఏడాది 200 సినిమాలు విడుదలైతే 190 సినిమా ఫ్లాప్ అయ్యాయట. సినిమా పరిశ్రమ బతికి బట్టకట్టాలంటే ఈ 190 సినిమాలే కీలకం. వీటి మీద ఆధారపడే సినిమా పరిశ్రమ మనుగడ సాగిస్తోంది.
సినీ పరిశ్రమలో చాలామందికి తిండి పెడుతున్నది ఈ సినిమాలే. నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరులంతా దీని మీదే ఆధారపడుతున్నారు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం చేకూరేది కూడా ఈ సినిమాల రూపంలోనే. సినిమా నిర్మాణం కోసం చేసే ఖర్చు ఒక ఎత్తయితే, ప్రచారం చేసే ఖర్చు ఇంకో ఎత్తు. పూరి జగన్నాథ్ నిర్మాతల మండలికి రాసిన లేఖలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సినిమా ప్రచారం కోసం పెట్టే ప్రెస్ మీట్లలో కవర్లు ఇవ్వడం, సోషల్ మీడియాని మేనేజ్ చేసుకోవడం కోసం ఖర్చు చేయడం నిర్మాతకు భారంగా మారిందని పూరి జగన్నాథ్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ రివ్వ్యూలు, నెగిటివ్ ట్వీట్లతో అందరికీ అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని అంతర్గత విషయాలను గాసిప్స్ రూపంలో రాయడం వల్ల కూడా నటుల నుంచి నిర్మాతలకు డేట్లు లభించడం లేదని కూడా ఆయన ప్రస్తావించారు. నెగిటివ్ రివ్వ్యూలతో ఫ్లాప్ చేసే సినిమాలను సేవ్ చేయాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. హిట్లు ఇచ్చిన దర్శకనిర్మాతల కన్నా ఫ్లాప్ ఇచ్చిన దర్శకనిర్మాతలను రక్షించాల్సిన బాధ్యత జర్నలిస్టుల మీద ఉందని పూరి జగన్నాథ్ అభిప్రాయపడుతున్నారు. పూరి వాదనలో నిజం లేకపోలేదు. ప్రస్తుతం సినీ రంగం సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. చాలా మంది సినిమా జనాలు నగరంలో బతకలేక పొరుగూళ్లకు వెళ్లిపోయారు. షూటింగులు కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఇంకోటి ఉంది దాని గురించి కూడా చూద్దాం.
Also Read ;- రాజమౌళి తదుపరి చిత్రం మహేష్ తో కాదా..? మరెవరితో..?
ఎవరి డబ్బు ఎక్కడికి పోతోంది?
సినీ పరిశ్రమను బతికించడానికి జనం డబ్బును త్యాగం చేయాలా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఏది హిట్ సినిమా ఏది ఫ్లాప్ సినిమా అని నిర్ణయించడానికి సరైన ప్రమాణాలు ఏవీ లేవు. ఎవరి దృష్టి కోణంలో వారు సినిమా చూస్తూ ఉంటారు. ఆమేరకు వారు అభిప్రాయాలు ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం పెద్ద హీరోల సినిమాలు భారీ పబ్లిసిటీతో విడుదలవుతున్నాయి. ఆ సినిమా మీద విపరీతమైన హైప్ చేసేస్తున్నారు. నిజంగా ఆ సినిమా అద్భుతమేనేమో అనుకుని జనం అడ్వాన్సుగా టిక్కెట్లు బుక్ చేసేసుకుంటున్నారు.
చివరికి ఆ సినిమాలో దమ్ము ఉండటం లేదు. కానీ జనం డబ్బు మాత్రం ఆయా నిర్మాతకు పోతోంది. నాలుగు రోజులు సినిమా ఆడినా వేలాది షోలు ప్రదర్శించడం వల్ల కోట్లాది రూపాయలు ముందే వచ్చేస్తున్నాయి. ఒకవిధంగా ఈ మారిన టెక్నాలజీ పెద్ద సినిమాలకు వరప్రసాదమేననుకోవాలి. పెద్ద సినిమాలను ఏ నెగిటివ్ రివ్యూలూ ఏమీ చేయలేకపోతున్నాయి. కేవలం స్టార్స్ లేని సినిమాలు మాత్రమే రివ్వ్యూల కారణంగా సరైన ఓపెనింగ్స్ లేక దెబ్బతింటున్నాయి.
ప్రచారం కోసం అంత వ్యయం అవసరమా?
పూరి జగన్నాథ్ ప్రస్తావించిన అంశంలో జర్నలిస్టులకు డబ్బుల పంపిణీ వ్యవహారం కూడా ఉంది. నిజానికి ఇప్పుడా పరిస్థితి లేదు. మారిన టెక్నాలజీలో వందలాదిగా ప్రెస్ మీట్లకు వచ్చే విలేఖరులే ఎక్కువ. అంతమందికి కవర్లు ఇచ్చే పరిస్థితి నేడు లేదు. పైగా ప్రెస్ మీట్లు పెట్టకుండానే బండి నడిపే వ్యవహారం వచ్చేసింది. ఏ ట్విట్టర్ లోనో, ఇన్ స్టాగ్రామ్ లోనో ఆ సినిమాలకు సంబంధించిన సమాచారం ఉంటే చాలు ఆవురావురుమంటూ వార్తలు రాసేసుకుంటున్న జర్నలిస్టులూ ఉంటున్నారు. పెద్ద సినిమాలకూ , పెద్ద హీరోలకూ ఇది బాగా ఉపయోగపడుతోంది. ఇక్కడ కూడా చిన్న నిర్మాతలే నష్టపోతున్నారు. చిన్న సినిమాల సమాచారాన్ని ఈ వెబ్ సైట్లు రాయడం లేదు. దీనికి కూడా ఓ పరిష్కార మార్గం కూడా ఉంది.
అది ఏమిటంటే నిర్మాతల మండలి తరఫున ఓ పోర్టల్ పెట్టి సినిమా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించవచ్చు. పూరి జగన్నాథ్ రాసిన లేఖపై నిర్మాత మండలి కూడా స్పందించింది. ఈ విషయంలో జర్నలిస్టులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పూరి జగన్నాథ్ అభిప్రాయంతో తాము కూడా ఏకీభవిస్తున్నామని పేర్కొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జర్నలిస్టులు తమకు సహకరించాలని నిర్మాతల మండలి కార్యదర్శులు టి. ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల కోరారు. పత్రికలు, టీవీ ఛానెల్స్, వెబ్ సైట్స్, సోషల్ మీడియాలాంటి మాధ్యమాలన్నీ సహకరించాలని వారు కోరారు.
-హేమసుందర్ పామర్తి

Also Read ;- అఖిల్ మూవీ సెట్లోకి అడుగుపెట్టిన మెహబూబా బ్యూటీ.. !











