కోవిడ్ సెకండ్ వేవ్‌లో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు దృష్టి సారిస్తున్నాయి. అదే సమయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. దీంతోపాటు #ResignPmModiJi పేరు ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉండడాన్ని కూడా అంతర్జాతీయ మీడియా ప్రధానంగా ప్రస్తావిస్తోంది. రెండురోజుల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ‘ది ఆస్ట్రేలియన్ ’ పత్రిక వేసిన కేరికేచర్ తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై భారత ప్రభుత్వం ఆస్ట్రేలియా రాయబారికి తన నిరసన తెలిపింది. న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్ పత్రికలు కూడా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోవనే రీతిలో కథనాలు ప్రచురించాయి. వాస్తవ కార్యాచరణకు, బయట చేసుకుంటున్న పబ్లిసిటీకి సంబంధం లేదనే అర్థం వచ్చేలా ది గార్డియన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 2014 తరువాత మోదీపై ఈ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు రావడం ఇదే తొలిసారిగా చర్చ నడుస్తోంది.
ముప్పును అంచనా వేయడంలో విఫలం
కరోనా సెకండ్ వేవ్ ముప్పును అంచనా వేయడంలో మోదీ సర్కారు విఫలమైందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొనగా కరోనాతో చిక్కి శల్యమైన ఏనుగు అంబారీపై మోదీ సవారీ చేస్తున్నారని ది ఆస్ట్రేలియన్ మీడియా గ్రూపునకు చెందిన ఫైనాన్షియల్ రివ్యూ వివాదాస్పద కార్టూన్ ప్రచురించింది. ఈ కార్టూన్‌పై ప్రధాని కార్యాలయం ఆస్ట్రేలియా రాయబారికి లేఖ రాయడంతో పాటు నిరాధార వార్తలను ప్రచురించారని నిరసన తెలిపింది. ది స్కైన్యూస్ దిల్లీలో ఓ శ్మశాన వాటిక, ఓ ఆసుపత్రి నుంచి లైవ్ కవరేజీ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ కోసం కరోనా బాధితులు పడుతున్న ఇబ్బందులపై ఏకేసింది. ఇక న్యూయార్క్ టైమ్స్ పలు ఫొటోలతో సహా నిరంతరం అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. భారత్ లో కరోనా వ్యాప్తిని నియంత్రించే విషయంలో సరైన కార్యాచరణ లేదనేది ఆ వార్తల సారాంశం. ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రచారానికి ప్రాధాన్యం, ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే మోదీ ప్రభుత్వం ఆసక్తి చూపించడం,మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యంగా ఉండడం, కుంభమేళాకు అనుమతులు లాంటి విమర్శలు, ఆరోపణలు, కథనాలు, ఎడిటోరియల్‌లో ప్రస్తావించారు. వీటితోపాటు లండన్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలూ మోదీ ప్రభుత్వ విధానాల్లోని లోపాలు ఎత్తి చూపాయి.
Also Read ;- వరంగల్ లో కరోనా విలయం : ఎంజీఎంలో 27 మంది మృతి
కేంద్రం వైఖరిపై రాష్ట్రాలు కూడా..
ఇక ఆ వార్తల సారాంశం ఎలా ఉన్నా కొవిడ్ నియంత్రణ విషయంలో కేంద్రం వైఖరిపై రాష్ట్రాలు కూడా పలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. వ్యాక్సిన్‌కి రెండురకాల ధరలను నిర్ణయించడం, రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా ఒకే వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు పంపించడం, అందులోనూ రాష్ట్రాల మధ్య వివక్ష చూపెడుతున్న ఆరోపణలు రావడం కూడా చర్చనీయాంశాలుగా మారాయి. ఈ క్రమంలోనే రిజైన్ పీఎం మోదీ జీ హ్యాష్ ట్యాగ్ ప్రపంచంలోనే 2వ ట్రెడింగ్ అంశంగా నిలిచేందుకు కారణమైంది. ఒకేరోజులో 20 లక్షల మంది ఈ హ్యాష్ ట్యాగ్‌ను రీట్వీట్ చేశారు.గతంలో వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేసే విషయంలో చూపెట్టిన శ్రద్ద దేశ ప్రజలకు అందించే విషయంలో చూపెట్టలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.
ట్విట్టర్ ఖాతాలపై ఆంక్షలు
కాగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ట్విట్టర్‌లో మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న దాదాపు 52 మంది ట్విట్టర్ ఖాతాలు బ్లాక్ అయినట్టు తెలుస్తోంది. ఫేక్ వార్తలు, ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలు లేదా సమాచారం విషయంలో కేంద్రం ట్విట్టర్‌కు నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ట్విట్టర్ ఈ మేరకు కొన్ని ఖాతాలను భారత్‌లో బ్లాక్ చేసింది. ఏప్రిల్ 22 – 23 మధ్య కాలంలో పోస్ట్ అయిన సమాచారం ఆధారంగా కొన్ని ఖాతాలను బ్లాక్ చేసినట్లు ల్యూమెన్ వెబ్ సైట్ వెల్లడించింది. కాగా ట్విట్టర్ బ్లాక్ చేసిన ఖాతాల విషయానికి వస్తే తెలంగాణ ఎంపీ రేవంత్‌రెడ్డి, బెంగాల్ మంత్రి మోలాయ్ ఘటక్, నటుడు వినీత్ కుమార్ సింగ్, ఫిల్మ్ మేకర్లు వినోద్ కాప్రి, అవినాష్ దాస్‌లతో పాటు పలువురి ఖాతాలు ఉన్నాయి. మొత్తం మీద కరోనా నియంత్రణ విషయంలో గతంలో కీర్తిని అందుకున్న మోదీ ప్రభుత్వం సెకండ్ వేవ్ విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
must read ;- మీరు రెస్ట్ తీసుకోండి.. మేము టెస్ట్ తీసుకుంటాం అంటున్న సోనూ సూద్











