ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 35 సంవత్సరాలు దాటిన వాలంటీర్లను తొలగిస్తూ ప్రభుత్వం జీవో 104, 201 జారీ చేయడం సంచలనంగా మారింది. అధికారంలోకి రాగానే రెండున్నర లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం జగన్మోహన్‌రెడ్డి, తాజాగా తీసుకున్న నిర్ణయం వైసీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు.
జవాబుదారీదనం కోసమే..
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నవరత్నాల పథకాలను సమర్థంగా అందించేందుకు, ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో 35 సంవత్సరాలు దాటిన వాలంటీర్లను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో వెల్లడించారు. కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 35 నిర్ణయించారు. 35 ఏళ్లు దాటిన వారిని విధుల నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఇప్పటకే 35 సంవత్సరాలు దాటిన వారికి 6 నెలలుగా జీతాలు కూడా నిలిపి వేశారు. తాజాగా వారిని తొలగించడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.
Must Read ;- జగన్ సైలెన్స్.. ఏపీ రైతుల ఖర్మేనా?
95 శాతం వాలంటీర్ ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకే..
ఏపీ ప్రభుత్వం ప్రతి 50 కుంటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమించింది. 2.5 లక్షల మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అంటే దాదాపు 95 శాతం మంది వైసీపీ కార్యకర్తలనే తీసుకున్నామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వయంగా వెల్లడించారు. తాజాగా ప్రభుత్వం 35 సంవత్సరాలు వయసు నిబంధనతో తొలగించడంతో వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి మరో అడుగు ముందుకు వేసి వారి సోషల్ మీడియాల్లో పనిచేస్తున్న పదివేల మంది వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటించారు. ఇటీవల విశాఖలో సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో కొందరు కార్యకర్తలు విజయసాయిరెడ్డిని నిలదీశారు. ‘పదవులు మీకు.. కేసులు మాకా’ అంటూ నిలదీయడంతో ఎంపీ కొత్త తాయిలం ప్రకటించారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా మొదటి దఫా 2 వేల మందికి శిక్షణ ఇప్పించి, కొత్తగా విశాఖలో రాబోతున్న 84 పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.
ప్రభుత్వ ఉద్యోగాలకు 42, వాలంటీర్లకు 35 సంవత్సరాలా..
ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలు రాసేందుకు 42 సంవత్సరాల వరకూ అనుమతిస్తున్న ప్రభుత్వం, వాలంటీర్లకు 35 సంవత్సరాలే గరిష్ఠ వయసు నిబంధన పెట్టడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. పారదర్శక పాలన అందించాలనే 35 సంవత్సరాలు దాటిన వారిని తీసి వేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అంటే 35 సంవత్సరాలు దాటిన వారు అవినీతికి పాల్పడతారని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. పారదర్శకత పేరుతో తమను తొలగించడం అవమాన పరచడమేనని వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం 15 వేల మంది వాలంటీర్లకు 35 సంవత్సరాలు దాటుతాయి. వారిని కూడా తొలగించుకుంటూ పోతారా? అని ప్రశ్నిస్తున్నారు.
Also Read ;- ఏపీకి షాకిచ్చిన కాగ్ నివేదిక… రుణం తీర్చాల్సిందే