నేను కొట్టినట్టు నటిస్తా..నువ్వు ఏడ్చినట్టు నటించు.. తరువాత మన లెక్కలు మనం తేల్చుకుందాం..కాని నువ్వు నా విషయంలో చూసీచూడనట్టు ఉండాలి…అన్నట్లుంది వైసీపీ-బీజేపీ పరిస్థితి. అప్పుడు వ్యవసాయ బిల్లుకు భేషరతుగా మద్దతు ఇవ్వడం-బిల్లును వ్యతిరేకించిన వాళ్లని విమర్శించడం, మళ్లీ ఇప్పుడు బిల్లుకి వ్యతిరేకంగా జరుగుతున్న బంద్‌కి అనుమతి ఇవ్వడం చూస్తే..అలానే అనిపిస్తోంది.
రాజ్యసభలో మద్దతు
గత సెప్టెంబరులో వ్యవసాయ బిల్లు విషయంలో దేశవ్యాప్తంగా రచ్చ మొదలైంది. కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. లోక్‌సభలో బీజేపీకి మెజార్టీ ఉన్న నేపథ్యంలో అక్కడ ఆ బిల్లు పాస్ అయ్యేందుకు ఇబ్బంది లేదు. రాజ్యసభలో ఆమోదం పొందాలంటే..ఇతర పార్టీల ఎంపీల మద్దతు అవసరం..ఈ బిల్లులకు బీజేపీ, బీజేడీ, వైసీపీ,అన్నాడీఎంకే పార్టీలు రాజ్యసభలో మద్దతు పలికాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, తృణమూల్, డీఎంకే, శివసేన, ఆర్జేడీ, అకాలీదళ్, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్‌ఆద్మీ పార్టీలు వ్యతిరేకించాయి.
రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ బిల్లు రైతుల జీవితాల్లో వెలుగు నింపుతుందనే స్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా పొగిడారు. అదే టైంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ను విమర్శించారు. అసలు రైతులకు ఇన్ని ఇబ్బందులు రావడానికి కాంగ్రెస్ కారణమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ (పరోక్షంగా) రైతులను దళారుల దగాకు బలయ్యేలా చేశారని విమర్శించారు.
మూడు నెలల తరువాత ఇదే అంశంపై భారత్ బంద్‌కు పలుపార్టీలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో టీఆర్ఎస్ అప్పట్లో బిల్లును వ్యతిరేకించింది. ఇప్పుడు బంద్‌కి మద్దతు ప్రకటించిం. ఇక టీడీపీ అధికార పక్షంలో లేదు. కాని ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మూడు నెలల వ్యవధిలో తన స్టాండ్‌ని మార్చుకుంది. ఇదే అంశంపై సోషల్ మీడియాలో ‘జే-టర్న్ ’ అని కామెంట్లూ వస్తున్నాయి.
ఇదంతా ఒక ఎత్తైతే.. అప్పట్లో లోక్‌సభలో కాంగ్రెస్‌ను విమర్శించిన విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో విమర్శలూ వస్తున్నాయి. ‘మీరు విమర్శించిన కాంగ్రెస్ పార్టీ నుంచే వైఎస్ సీఎంగా ఉన్నారు… మహానేతగా వైపీపీ ప్రచారం చేస్తున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా రైతులను ముంచిన వారిలో ఉన్నారా’..అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
Must Read ;- జగన్ ‘సోషల్’ గా దిగజారాడా.. నేతల బాటలోనే క్యాడర్
స్టాండ్ మార్చుకుంది ఎవరు..
మరోవైపు తాము బంద్‌కి అనుమతి ఇస్తామని, మనోభావాలను గౌరవిస్తామని చెబుతున్న వైసీపీ నేతలు మళ్లీ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. భారత్ బంద్‌కి తాము అనుమతి తెలుపుతున్నామని చెబుతూనే.. అప్పట్లో తాము రైతులకు ఇబ్బంది ఉండదు అన్న కేంద్రం హామీతోనే రాజ్యసభలో మద్దతు ఇచ్చామని, చంద్రబాబు మాత్రం భేషరతుగా మద్దతు ఇచ్చారని చెప్పారు. అంటే ఈ మూడు నెలల కాలంలో కేంద్రం తన స్టాండ్ మార్చుకుని..రైతులకు ఇబ్బంది వస్తుందని చెప్పిందా.. లేక వైసీపీ స్టాండ్ మారిందా అనే చర్చ మొదలైంది. ఇప్పటికీ రైతులకు ఇబ్బంది ఉండదని అధికారంలో ఉన్న బీజేపీ చెబుతూనే ఉంది. అయినా ఆందోళన మొదలైంది. కాని మూడు నెలల్లోనే వైసీపీ స్టాండ్‌లో తేడా వచ్చింది.
తిరుపతి లోక్‌సభ కోసమా..
దేశవ్యాప్తంగా రైతుల తరఫున ఆందోళనలు పెరుగుతున్నాయి. విద్యార్థి, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. రైతులకు క్రమేణా మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాము బీజేపీకి వత్తాసు పలికితే.. ప్రతిపక్షాలకు మరో ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో 22 మంది ఎంపీలున్నా ప్రయోజనం ఏంటనే ప్రశ్నలు వస్తున్న తరుణంలో తాము కూడా బీజేపీకి వ్యతిరేకంగా బంద్‌కు మద్దతు ఇచ్చామని, తాము మెడలు వంచలేదని చెప్పేందుకు వీలుంటుంది. తద్వారా రానున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలకు మరోసారి ‘మాట తప్పం..మడమ తిప్పం’ అని ప్రచారం చేసుకోవచ్చనే ఆలోచన ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక టీడీపీ నాయకులు ఈ విషయంలో వైసీపీకి కౌంటర్ కూడా ఇచ్చారు. ఆరోజు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారు అనే వీడియోను వైరల్ చేస్తున్నారు.
అయ్యన్న కౌంటర్..
విజయసాయిరెడ్డి చేసిన తాజా ట్వీట్‌పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. మతిమరుపు రోగం వచ్చిందా..ఆరోజు వ్యవసాయ బిల్లుకు భేషరతు మద్దతు ఇచ్చారు. వ్యవసాయ బిల్లుని సమర్ధించని వాళ్ళు అందరూ దళారీలు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాజ్యసభలో మిమ్మల్ని చాలా మంది తిట్టిన విషయం మర్చిపోయారా.. అసలు నీ ప్రసంగంలో ఎక్కడైనా “స్వామినాథన్ కమిటీ ” పేరు ఎత్తావా? అని ప్రశ్నించారు. మొత్తం మీద ఏ ప్రయోజనం కోసం వైసీపీ ఏ టర్న్ తీసుకున్నా.. ఆ టర్న్ ప్రతి అంగుళంలోనూ ప్రజాప్రయోజనాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తోందని భావించవచ్చు.
Also Read ;- ‘బాగా బురద చల్లారా.. సర్కారీ కొలువు గ్యారంటీ’