ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 26 అంశాలు చర్చకు వచ్చాయి. వచ్చే ఏడాది జనవరి తొమ్మిదో తేదీ నుంచి రెండో విడత అమ్మఒడి కార్యాక్రమానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు అవసరం అయిన రూ.6 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లను ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది మూడో విడత రైతు భరోసా కింద 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
వైద్య విద్య పరిశోధనా కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న 16 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాలు, వాటి నిర్వహణను పర్వవేక్షించేందుకు వైద్య విద్య పరిశోధనా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. అయితే 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం వద్ద నిధులు సమస్యగా మారింది. అందుకే వైద్య విద్య పరిశోధనా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.8వేల కోట్లు రుణాలు తెచ్చుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 11 మెడికల్ కాలేజీలు, మరో 16 కొత్త కాలేజీలు ఈ కార్పొరేషన్ కిందకు తీసుకురావాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. 27 కాలేజీలకు రూ.16 వేల కోట్ల నిధులు కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయాలని క్యాబినెట్ తీర్మానించింది.
నివర్ నష్టం కింద ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు
నివర్ తుఫాను వల్ల రైతులకు రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. 2020లో ఖరీఫ్ పంటలకు బీమా కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో కంపెనీలు బీమా చెల్లించే అవకాశం లేదు. అందుకే నివర్ వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకునేందుకు రూ.1000 కోట్లు ఇవ్వాలని ఇప్పటికే సీఎం కేంద్రాన్ని కోరారు. దీనిపై కూడా క్యాబినెట్లో చర్చ జరిగింది. డిసెంబరు 29న నివర్ నష్టం కింద రూ.718 కోట్లు ఇన్‌పుట్ రాయితీగా రైతులకు చెల్లించాలని క్యాబినెట్ నిర్ణయించింది. పంట నష్టం జరిగిన నెల రోజుల్లోనే ఇన్ పుట్ రాయితీ జమ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
మరికొన్ని అంశాలు
తిరుపతిలో ల్యాండ్ సర్వే అకాడమీ ఏర్పాటుకు 40 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నూతన పర్యాటక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రివర్గం, పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా రూ.5 వేల కోట్లు అప్పు తేవాలని నిర్ణయం తీసుకుంది. సర్వే, సరిహద్దుల చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పశువుల వ్యాధుల నిర్థరణ కేంద్రం ఏర్పాటుకు, పులివెందులలో ఏపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.సమగ్ర భూ సర్వేకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. చింతలపూడి లిప్ట్ ఇరిగేషన్‌కు రూ.1900 కోట్లు నాబార్డు రుణం తీసుకునేందుకు జలవనరుల శాఖకు అనుమతి ఇచ్చిన మంత్రివర్గం. సినీ పరిశ్రమకు రీస్టార్ట్ ప్యాకేజీకి మంత్రవర్గం ఆమోదం తెలిపింది.
Must Read ;- పంటల బీమా పచ్చి మోసం.. బయటపడ్డ వైసీపీ సర్కారు బండారం