నితీశ్ కుమార్… రాజకీయ రంగంలో పరిచయం అవసరం లేని పేరు. రాజకీయ చదరంగాన్ని తన ఎత్తుగడలతో చిత్తు చేసి విజయాన్ని కైవసం చేసుకోగలిగే రాజకీయ చాణక్యుడు. రాజకీయ పావులను తనకు అనుకూలంగా మలచుకోవడంలో దురందరుడిగా పేరు గాంచిన నేత. బిహార్ పేరు వింటేనే… అభివృద్ధి మచ్చుకైనా లేని రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించి తన కంచుకోటగా మలచుకున్నాడీ 70 ఏళ్ల రాజకీయ యువకుడు. వేరొకరికి అవకాశం ఇవ్వాలి అనే ఆలోచననే ప్రజలకు రానివ్వకుండా తన పాలనతో ప్రజలను ఆకట్టుకుంటూ.. వరుసగా 4వ సారి బిహార్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుని రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యయాన్ని లిఖించారు.
రాజకీయ చాణక్యుడు
వరుసగా 4వ సారి… గడిచిన 20 సంవత్సరాల్లో ఇలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఏడవ సారి కావడం మరో విశేషం. తాజాగా వెలువడిన బిహార్ ఎన్నికల ఫలితాల్లో 43 సీట్లు మాత్రమే సాధించగలిగింది జేడీయూ. కానీ, బీజేపీ, నితీశ్‌నే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నుకుందంటేనే ఆయన విలువ ఎంతటితో తెలుస్తుంది. అంతేనా.. నితీశ్ ఎంతటి రాజకీయ చాణక్యుడనేది కూడా తెలియజేస్తుంది. గత ఎన్నికల సమయంలో ఆర్జేడీని అక్కున చేర్చుకున్న నితీశ్… తాజా ఎన్నికల్లో మాత్రం తన ఓటును బీజేపీకి వేశారు. తద్వారా బిహార్ పీఠం తన చేజారకుండా మరొకసారి దక్కించుకున్నారు. కాలానుగుణంగా… రాజకీయ రంగును అంచనా వేయడంలో తనకు సాటిరాగలవారు లేరని మరోసారి నిరూపించారీ బిహారీ నేత.
Must Read ;- మోడీ, షాలు చేయకూడని తప్పులు చేస్తున్నారా?
అవినీతి మచ్చలేని నేత
మామూలుగా రాజకీయాల్లో ఉన్న నేతల పై అవినీతి ఆరోపణలు రావడం సర్వసాధరణమైన విషయమైపోయింది. అందునా నేటి రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు లేని నేతలను వేళ్ల మీద లెక్కపెట్టచ్చు అనడంలో అతిశయోక్తి కాదు. అటువంటి కలుషిత రాజకీయాల్లో మచ్చలేని నేతగా పేరు గాంచిన అతి కొద్ది మందిలో ‘నితీశ్’ పేరు ముందు వరసలో ఉంటుందనడంలో సందేహం లేదు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం… 2 దశాబ్దాల అధికార పర్వం.. అయినా అవినీతి ఆరోపణంటూ ఒక్క వేలూ నితీశ్ వైపు చూపెట్టలేదు. రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్ధిని చిత్తుచేయడంలో ఎంత కరడుకట్టిగా వ్యక్తిగా ఉంటాడో.. తను నమ్మిన విలువలను పాటించడంలో అంతే అప్రమత్తంగా ఉండే వ్యక్తిగా పేరుగాంచారు.
నైతిక విలువలే పెట్టుబడి
అది ఆర్జేడీ అయినా లేక బీజేపీ అయినా… నితీశ్‌తో నిస్సందేహంగా చేతులు కలపడానికి కారణం ఆయన పాటిస్తున్న నైతిక విలువలే కారణమని చెప్పచ్చు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించే నితీశ్… తన కొడుకును రాజకీయాలకు దూరంగా ఉంచి ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు. దేశంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి.. వాటికి నైతిక బాధ్యత వహించేవారు నేటి రాజకీయాల్లో వెతికినా దొరకరేమో. కానీ, తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ప్రమాదానికి బాధ్యత వహించి పదవి నుండి తప్పుకున్నారు. రాజకీయాలకు అనుగుణంగా తన పంధా మార్చుకున్నా… విలువలను వదిలి పెట్టలేదు.
విద్యార్థి నేత నుండి రాజకీయ దిగ్గజంగా ఎదిగారు
దాదాపు 45 సంవత్సరాల క్రితం విద్యార్థి నేతగా తన రాజకీయ అభిలాషను ప్రారంభించిన నితీశ్… 1985లో తొలిసారి ఎన్నికై తన ప్రత్యక్ష రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టారు. 1989లో తొలిసారి ఎంపిగా గెలుపొందారు. అలాగే 1998-99 కాలంలో అటల్ బిహారి వాజ్ పేయి పరిపాలనలో రైల్వే మంత్రిగా సేవలందించారు. 2000 సంవత్సరంలో తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ క్షణం నుండి ప్రజల సంక్షేమానికి, భద్రతకు పెద్ద పీట వేశారు. ఎన్నో కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టి అభివృద్ధి నేతగా ముద్ర వేయించుకున్నారు. ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసి ‘వికాస్ పురుష్’ గా పేరు గాంచారు. రాజకీయానుగుణంగా తన జట్టును మార్చుతూ ఉన్నా… ప్రజలు మాత్రం నితిశ్ జట్టు కట్టిన పార్టీకే తమ ఓటు అనేలా చేసుకున్నారు.
20 ఏళ్లలో 7 సార్లు
2000 సంవత్సరంలో మొదటి సారిగా ముఖ్యమంత్రి అధికార పీఠాన్ని అందుకున్న నితిశ్… నేటికి 20 ఏళ్లు గడుస్తున్నా… తన పై చేయిని నిరూపించుకున్నారు. 2005లో మరొకసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆపై 2010 లో మూడో సారి అధికార పీఠాన్ని అందుకున్నారు. కానీ, 2014 లో జెడీయూ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు. తిరిగి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి సీటును కైవసం చేసుకున్నారు. 2017లో తేజస్వీ యాదవ్‌పై వచ్చిన ఆరోపణలకు తాను బాధ్యత వహించి పదవిని వదులుకున్నారు. తిరిగి అదే నెలలో బీజేపీ మద్ధతుతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ చర్యతో పదవినైనా తృణప్రాయంగా వదులుకుంటారు కానీ, విలువలను వదలరు, ఆరోపణలను సహించరనే నిజాన్ని దేశానికి చూపి ఆదర్శప్రాయంగా నిలిచారు. కొత్త శతాబ్దం లో తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీశ్ ప్రస్ధానం ఎలా సాగనుందో చూడాలి.
Also Read ;- కేవలం 12000 ఓట్లతో అధికారం పోయింది!











