ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత కరణం బలరాం. దాదాపు నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవం ఆయన సొంతం. గత ఎన్నికల్లో అనూహ్యంగా చీరాల నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. దీంతో వారసుడి భవిష్యత్ డోలాయమానంలో పడిపోయింది. పెద్దాయన చీరాల టీడీపీ నుంచి గెలిచినా, వెంటనే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే చీరాలలో వైసీపీ నేతలు ఎవరూ బలరాంకు మద్దతు ఇవ్వడం లేదు. వచ్చే ఎన్నికల్లో చీరాల వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇక అద్దంకి వెళదామంటే అక్కడ రవికుమార్ కూడా వైసీపీలో చేరడం ఖాయంగా తెలుస్తోంది. దీంతో కరణం బలరాం వారసుడు పోటీ చేయడానికి నియోజకవర్గం లేకుండా పోయింది.
పరుచూరు ఖాళాగానే ఉందిగా..
పరుచూరు నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి దగ్గుబాటి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. దాదాపు ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పినట్టే తెలుస్తోంది. అందుకే పరుచూరు వైసీపీ ఇంఛార్జిగా రామనాథాన్ని నియమించారు. కరణం బలరాం తనయుడు వెంకటేష్‌ను పార్టీ అధిష్టానం పరుచూరు నియోజకవర్గం చూసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే పరుచూరులో ఏలూరి సాంబశివరావుపై గెలవడం అంత ఈజీ కాదని ముందే తప్పుకున్నారు. కరణం వెంకటేష్ అద్దంకి నియోజకవర్గంపైనే దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎలాగైనా అద్దంకిలోనే గొట్టిపాటి రవికుమార్‌పై గెలవాలని కసిగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో వైసీపీ అధిష్టానం కూడా ఏ నిర్ణయం తీసుకోలేక పోతోందని సమాచారం.
Must Read ;- Breaking: చీరాల వైసీపీ ప్రతిరోజూ రావణ కాష్టమే!

గొట్టిపాటితో మంత్రి బాలినేని చర్చలు
అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను వైసీపీలోకి తీసుకు వచ్చేందుకు ఆ పార్టీ నేతలు చేయని ప్రయత్నాలు లేవు. గొట్టిపాటి రవికుమార్‌కు చెందిన 13 గ్రానైట్ కంపెనీలకు 3 వందల కోట్ల రూపాయల అపరాధ రుసుం వేసి, వాటిని సీజ్ చేశారు. అయినా రవికుమార్ లొంగకపోవడంతో, మంత్రి బాలినేనిని రంగంలోకి దింపారని తెలుస్తోంది. మంత్రి బాలినేనితో గొట్టిపాటి రవికుమార్‌కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో బాలినేనికి గొట్టిపాటి రవికుమార్ ఆర్థికంగా సాయం చేశారని జిల్లాలో టాక్ నడుస్తోంది. అందుకే వారి మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయట. మంత్రి బాలినేనితో ఇప్పటికే పార్టీ మారే విషయంలో గొట్టిపాటి రవికుమార్ చర్చలు జరిపారని తెలుస్తోంది. వెంటనే వైసీపీలో చేరకుండా కొన్నాళ్లు టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉండి ఆ తరవాత వైసీపీలో చేరాలని గొట్టిపాటి రవికుమార్ భావిస్తున్నారట. అందుకే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనూ గొట్టిపాటి రవికుమార్ టీడీపీ సభ్యులకు దూరంగా కూర్చున్నారని తెలుస్తోంది. సభలో రచ్చ జరుగుతున్నా గొట్టిపాటి రవికుమార్ మాత్రం ఇవేమీ పట్టనట్టు వ్యవహరించారని తెలుస్తోంది. అందుకే అద్దంకి నియోజకవర్గం వైసీపీ సీటు వచ్చే ఎన్నికల నాటికి గొట్టిపాటి రవికుమార్‌కే కేటాయిస్తారని చర్చ సాగుతోంది. అందుకే కరణం వెంకటేష్‌ను అద్దంకి వైసీపీ ఇంఛార్జి పదవికి దూరంగా ఉంచుతున్నారని తెలుస్తోంది.
కరణం వారసుడికి కానరాని భవిష్యత్
చీరాలలో తేల్చుకుందామంటే వైసీపీ శ్రేణులు కరణం బలరాంను స్వాగతించడం లేదు. పైగా అక్కడ ఆమంచి కృష్ణమోహన్ హవా కొనసాగుతోంది. చీరాలలో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం, మరలా వచ్చే ఎన్నికల నాటికి అక్కడే వైసీపీ నుంచి గెలవడం కష్టమని వారికే తెలిసి వచ్చింది. అద్దంకి వెళదామంటే గొట్టిపాటి రవికుమార్ వ్యవహారం తేలడం లేదు. పైగా పరుచూరుకు కరణం బలరాం నాన్ లోకల్ . టీడీపీ నేత ఏలూరు సాంబశివరావుపై గెలవడం అంటే అది సాధ్యం అయ్యే పనిలా కనిపించడం లేదు. ఇన్ని ఈక్వేషన్స్ మధ్య కరణం వారసుడి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read ;- పార్టీ తీరుపై నోరు జారుతున్న సొంత ఎమ్మెల్యేలు.. ఇరకాటంలో వైసీపీ










