(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో రాములవారి విగ్రహం శిరస్సును ఖండించడాన్ని నిరసిస్తూ బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి కొండపై దట్టమైన మంచు, చలిలో మంగళవారం అర్ధరాతిర దాటే వరకు కూడా నిరవధిక నిరసన నిర్వహిస్తున్నారు.
Also Read ;- పుణ్యక్షేత్రం కోటప్పకొండను తవ్వేస్తున్న అక్రమార్కులు
తాగునీటికీ అనుమతించడం లేదు : పావని
హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించుమని కోరుతుంటే రాష్ట్ర ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని రెడ్డి పావని ఆరోపించారు. మహిళలు, పెద్దలు ఉన్నారని కూడా చూడకుండా కనీసం తాగటానికి నీటిని తెచ్చుకునేందుకు, చలి బాగా ఉన్నందున దుప్పట్లు తెచ్చుకునేందుకు పోలీసులు అనుమతించకపోవడం ప్రభుత్వ దాష్టీకానికి పరాకాష్టగా అభివర్ణించారు. ఈ రాష్ట్రంలో భద్రత రాముడికీ లేదు .. ప్రజలకూ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేవుడికి భద్రత కల్పించండి .. అపచారానికి పాల్పడిన దుండగులను తక్షణమే పట్టుకొని శిక్షించండి.. హిందుత్వాన్ని రక్షించండి అని కోరుతుంటే ..’ మమ్మల్ని హింసించాలని పోలీసులు ప్రయత్నిస్తుండటం విచారకరమన్నారు. ఈ విధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని, ఉద్యమం రేపటికి మరింత పెచ్చరిల్లుతుందని హెచ్చరించారు. ‘మీ చేతగాని తనం కప్పిపుచ్చుకోవడానికి .. మాపై ప్రతాపం చూపొద్దని .. చేతనైతే దుండగులను తక్షణమే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాములోరికి ఎలానూ భద్రత కల్పించలేక పోయారని, ఉన్న విగ్రహాలకైనా భద్రత కల్పిస్తారనే నమ్మకం కూడా లేదని ఆమె అన్నారు. దేవుడికి భద్రత కల్పించేందుకు ఇక్కడ ఉన్నామని, మీరు దుండగులను పట్టుకుంటే మేం వెళ్లిపోతామని, అంతవరకు మాకు ఆటంకం కల్పించవద్దని ఆమె కోరారు.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో..
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం కొండపై కోదండ రాముడి విగ్రహం తల తొలగించిన దుండగుల దురాగతాల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై నెల్లిమర్ల నియోజకవర్గ నేతలు తమ కార్యకర్తలతో నిరసన తెలిపారు.. దుండగులను తక్షణమే పట్టుకొని శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
విచారణకు ఆదేశించిన మంత్రి
రామతీర్థం ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. విజయనగరం జిల్లాలో రామతీర్ధాల కొండపై శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. ఫోన్ లో జిల్లా ఎస్పీ రాజకుమారితో మాట్లాడారు. విచారణ వేగవంతం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనపై రీజనల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని విచారణ అధికారిగా నియమించాలని దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్ ను ఆదేశించారు. వెనువెంటనే మల్టీ జోన్ టు ఆర్ జె సి డి. భ్రమరాంబను విచారణ అధికారిగా నియమించినట్లు ప్రకటించారు.
Must Read ;- పథకం ప్రకారమే దేవాలయాలపై దాడులు : చంద్రబాబు