నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఉన్నతాధికారి. కరోనా సమయంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేసి, లక్షలాది మంది కరోనా బారిన పడి చనిపోకుండా ప్రాణాలు కాపాడిన ధీరోదాత్తుడు. అందుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాలు కొంతమందికి మింగుడు పడకపోయినా, సామాన్యుల నుంచి మేధావుల వరకు నిమ్మగడ్డను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆనాడు నిమ్మగడ్డ ఆ నిర్ణయం తీసుకోవడం అధికారపార్టీ నేతలకు మింగుడు పడకపోయినా, నేడు ఆయన ఆ నిర్ణయం తీసుకోకుండే ఎన్ని వేల మంది కరోనాతో చనిపోయి ఉండే వారో, తలచుకుంటేనే భయమేస్తోందని మేధావులు సైతం నిమ్మగడ్డ నిర్ణయాన్ని కొనియాడుతున్నారు.
సొంత ఎజెండాతో ఛానళ్లలో స్టోరీలు
కొన్ని ఛానళ్లు అధికార పార్టీ నేతలతో అంటకాగుతూ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విష ప్రచారానికి తెరలేపాయి. ఆయన గురించి బొత్తిగా తెలియని జర్నలిస్టులు నిమ్మగడ్డను ఏకిపారేశారు. నిర్దిష్టమైన విమర్శలకంటె.. పనిగట్టుకుని చేసిన విషం చిమ్మే విమర్శలే అందులో ఎక్కువగా కనిపిస్తాయి.
ఒక న్యూస్ ఛానెల్లో కొన్ని నెలల కిందట నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి ఒక కథనం వచ్చింది. ఈ కథనం చూస్తే నవ్వొస్తుంది. జుగుప్స కలుగుతుంది. నాకిష్టమైన పార్టీ నేతల భుజాలపై చేతులేసుకుని తిరుగుతా, నాకేంటి సిగ్గు అంటూ నిమ్మగడ్డ తిరుగుతున్నారని ఆ కథనంలో గొంతు చించుకుని మరీ చెప్పారు. ఇంతకీ నిమ్మగడ్డ ఎవరి భుజాలపై చేతులు వేశారు. వైఎస్ ముఖ్యమంత్రి ఉండగా నిమ్మగడ్డ రమేష్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా మూడు సంవత్సరాలు పనిచేశారు. ఆయన పనితీరును వైఎస్ ఎన్నోసార్లు కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిమ్మగడ్డ మంచి పదవుల్లో ఉన్న విషయాన్ని సదరు జర్నలిస్టుకు తెలిసినట్టు లేదు.
Must Read ;- ఐజీ సంజయ్‌కు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు
జనంసొమ్ము శాలరీగా తీసుకుంటూ
ప్రభుత్వ సిబ్బంది ఎవరైనా ప్రజలు పన్నులు చెల్లించిన సొమ్ముతోనే జీతాలు తీసుకుంటారనే విషయం కూడా సదరు ఛానల్ అధినేత మరచినట్టున్నారు. నిమ్మగడ్డ ఓ ఐఏఎస్ అధికారిగా జనంసొమ్మును శాలరీగా తీసుకునే ఈ పెద్దమనిషి, పెద్దల అండతో పెద్దపెద్ద పోస్టులు కొట్టేసి కూడా జనంసొమ్ముపైనే ఆధారపడి బతుకుతున్నారనేశారు. ఎంత బరితెగింపుకు పాల్పడ్డారో ఈ కథనం చూసినవారికి ఎవరికైనా ఇట్టే అర్థమైపోతోంది. అధికారులు జనం సొమ్ము జీతంగా తీసుకుంటే.. నాయకులేమైనా.. చెమటోడ్చి సంపాదించిన సొమ్మును జీతంగా తీసుకుంటున్నారా?
ఇదే కథనంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తీసుకోలేదట. కానీ అప్పటి గవర్నర్ నరశింహన్ వద్ద పనిచేసి పలుకుబడి సాధించిన నిమ్మగడ్డ, గవర్నర్ రిఫరెన్స్ తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి సాధించుకున్నారని కథనం సారాశం. మరి నిమ్మగడ్డకు చంద్రబాబు పదవి ఇవ్వలేదు. మరి నిమ్మగడ్డ ఓ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడని కథనంలో వండివార్చారు. అంటే ఇంతకీ నిమ్మగడ్డ ఏ పార్టీ కార్యకర్తలో కథనం వండిన జర్నలిస్టుకే తెలియాలి. ఓ వైపు చంద్రబాబు తొత్తు అంటారు. మరోవైపు చంద్రబాబునాయుడు, నిమ్మగడ్డకు పదవి ఇవ్వడానికి అంగీకరించలేదని వారే చెబుతున్నారు. ఏది నిజం. సదరు ఛానల్లో ఇచ్చిన ఏడు నిమిషాల కథనంలోనే స్పష్టత లేనప్పుడు మీరు జనానికి ఏమి నూరిపోయాలనుకున్నారో, సదరు విలేఖరికే తెలియాలి.
ఈ న్యూస్ స్టోరీ కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద విషం చిమ్మడమే లక్ష్యంగా సాగిపోయింది. అప్పటినుంచి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలే.. ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించినవి అని.. చట్టబద్ధంగా తీసుకున్న నిర్ణయాలు అని కోర్టుల సాక్షిగా నిరూపణ అయింది. ఈ సందర్భంలో.. నిమ్మగడ్డకు సంబంధించి అవాకులు చెవాకులు పేలుతూ సదరు టీవీ వండివార్చిన ఈ దుర్మార్గమైన కథనం మరోసారి సోషల్ మీడియాలో నలుగురి దృష్టికి సర్కులేట్ అవుతోంది.
Also Read ;- నిమ్మగడ్డపై మరో అస్త్రం వదిలిన జగన్ సర్కారు
సీఎం మారగానే అందరూ పదవులు వదిలేయాలా?
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పోయి 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినా రమేష్ కుమార్ తన పదవిని వదిలిపెట్టలేదని సదరు జర్నలిస్టు బాగానే కనిపెట్టారు. సీఎం మారగానే, లేదంటే ఓ పార్టీ ఓడిపోగానే అందరూ పదవులకు రాజీనామా చేయాలట. ఇదెలాంటి డిమాండో, ఇదేమి జర్నలిజమో వారికే అర్థం కావాలి. ఎక్కడో ఊరు పేరులేని, ఎవరికీ తెలియని పాస్టర్ కనగరాజ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి అర్హుడు. కానీ సీనియర్ ఐఏఎస్ అధికారి మాత్రం అర్హుడు కాదా. చంద్రబాబునాయుడు నిమ్మగడ్డను నియమించలేదని వారే వండివారుస్తారు, మరలా చంద్రబాబు పదవి కోల్పోగానే నిమ్మగడ్డ రాజీనామా చేయలేదని పెడబొబ్బలు పెడతారు. ఆ టీవీ పెద్దలు, సదరు స్టోరీని వండి వార్చిన జర్నలిస్టు ప్రముఖులు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి అంటే అదేదో.. ఆలయ ధర్మకర్తల పదవి లాగా.. నామినేటెడ్ పోస్టు అనుకున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ కథనం ద్వారా మీరు ఏం సాధించాలని ప్రయత్నం చేశారో వారికే అంతుపట్టాలి. అధికార పార్టీకి భజన చేయడమే జీవితాశయంగా చెలరేగదలచుకున్నా కూడా.. మరీ ఇంత నీతిబాహ్యంగానా? అనే చర్చల్లో ప్రజల్లో నడుస్తోంది.
స్థానిక ఎన్నికలు నిలిపివేయడమే మంచిదైంది
స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయడం మంచిదా కాదా అనేది పక్కన పెడితే నిలిపివేయడం వెనుక ఉన్న దురుద్దేశాలు గమనిస్తే ఆయన వెనుకున్న ఓ పార్టీ కార్యకర్త, రాజకీయవేత్త స్పష్టంగా కనిపిస్తారట. నిమ్మగడ్డలో ఏ పార్టీ కార్యకర్త, రాజకీయవేత్త కనిపించారో సదరు షాడో జర్నలిస్టుకే తెలియాలి. 1982 క్యాడర్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజలకు ఉపయోగపడే ఒక్క కీలక నిర్ణయం కూడా కనిపించదట. అసలు నిమ్మగడ్డ ఏయే పదవుల్లో పనిచేశారో స్టోరీ రాసిన జర్నలిస్టుకు తెలిసినట్టులేదు. కాంగ్రెస్ పాలన కాలంలోనే నిమ్మగడ్డ కీలక పదవులకు వన్నెతెచ్చారు. ఆ విషయాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. మరి దీనికి సమాధానం ఏం చెబుతారు?
Also Read ;- అయినా సరే.. తొడకొడుతున్న జగన్!
ప్రతిభావంతుడు కాదట
నిమ్మగడ్డ పని చేసిన ప్రతి చోటా తన అభిమాన పార్టీ అజెండా అమలు చేసేవారనే ఆరోపణలు ఉన్నాయట, పెద్దగా ప్రతిభావంతుడు కాకపోయినా, ఓ పార్టీ అండ, ఎవరినైనా బుట్టలో పడేసుకునే సామర్థ్యం ఇవన్నీ ఆయనకు కలసి వచ్చాయని సదరు ఛానళ్ల అధినేత అభిప్రాయపడినట్టున్నారు. ప్రతిభ లేకపోతే ఐఏఎస్ కు ఎలా సెలెక్ట్ అయ్యారు. జర్నలిస్టు కావడానికి ఏదైనా కొన్ని అర్హతలు ఉండాలి.. కానీ.. ఒక ఛానెల్ యజమాని కావడానికి ఎలాంటి అర్హతలు అక్కర్లేదనే సిద్ధాంతానికి నిదర్శనంగా ఉండేవాళ్లంతా.. ఇలాంటి విషాన్ని ప్రజల మెదళ్లలోకి చొప్పించడానికి చేస్తున్న ప్రనయత్నాలు జుగుప్స కలిగిస్తాయి. ఏది పడితే అది రాసి జనాలమీదకు వదిలితే, జనం పిచ్చివారు కాదు. సరైన సమయంలో బుద్ధి చెబుతారు. ఇప్పటికే సదరు ఛానల్ ఏపీలో 8వ స్థానంలోకి పడిపోవడానికి, వారి ఏకపక్ష ప్రసారాలే కారణం. వారు ఇలాగే ముందుకు సాగితే వారి స్థాయి మరింత దిగుజారుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
సుజనా చౌదరిని కలవడం నేరమా?
ఐఏఎస్ అధికారులు పార్టీ నాయకులను కలవడం నేరం అన్నట్టు ఉంది ఆ ఛానల్లో వచ్చిన కథనం. చీకట్లో ఓ హోటల్ లో బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని నిమ్మగడ్డ కలిశారని, ఇంత కంటే నేరం మరొకటి ఉంటుందా? అని సదరు జర్నలిస్టు అభిప్రాయం. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా సుజనా చౌదరిని కలవలేదని గుర్తుపెట్టుకోవాలి. లక్షలు వెచ్చించి పోయిన పదవికోసం లాయర్ ను పెట్టుకునే సామర్థ్యం నిమ్మగడ్డకు ఎక్కడిది? ప్రజాధనం వేలకోట్లు కొల్లగొట్టి, సీఎంగా వెలగబెడుతున్నవారు రోజుకు 5 కోట్లు ఖర్చు చేసి న్యాయవాదిని నియమించుకోవచ్చు. అది ఆ పేటీఎం జర్నలిస్టుకు కనిపించదు. అసలు స్క్రిప్టు ఆ ఛానల్లో తయారైందా? లేదంటే పుష్కలమైన జర్నలిజం అనుభవం ఉన్న పాలకపక్షంలోని గణాలు వండి, ఈ ఛానెల్లో వార్చారా? అనేది ప్రజల సందేహంగా ఉంది. రమేష్ కుమార్ పదవిలో ఉండేది ఏడు నెలలే, ఈ ఏడు నెలల్లో స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా జరగవని కథనంలో వాదించారు. ఇంత నమ్మకంగా ఎలా చెప్పగలిగారు, ప్రభుత్వ సలహాదారులు వారికేమైనా సంకేతాలిచ్చారా? అనే అనుమానం కలగక మానదు.
శ్రీశ్రీ మాటలు గుర్తొచ్చేలా.. పెట్టుబడులకు, రాజకీయ దళారీలకు పుట్టే విషపుత్రికల్లాంటి ఇలాంటి ఛానెళ్లు.. ఇలాంటి విషప్రచారాల్ని యథేచ్ఛగా సాగిస్తూ వచ్చాయి. ఇప్పుడు వారి నోర్లు మూత పడ్డాయి. కానీ వారు చిమ్మిన నిరాధార ఆరోపణల, అబద్ధాల విషం మాత్రం సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూనే ఉంది.
Also Read ;- కత్తి దూసిన నిమ్మగడ్డ.. వేటు షురూ!