చట్టం గావుకేకలు పెట్టింది.. న్యాయం సైతం ఆర్తనాదాలు చేసింది.అయినా సరే పగ బట్టిన బందిపోట్లలా..చేతిలో అధికారం ఉంది కదాని చెలరేగిపోతూ చేసిన రంకెల మధ్య ఆ గావుకేకలు,ఆర్తనాదాలు ఎవరికీ వినపడలేదు..కేవలం బాధితులకు తప్ప. న్యాయదేవత కళ్లకు గంతలు కట్టేసి..చట్టాన్ని మడతెట్టి మరీ భూమిలో పాతిపెట్టేసి.. తామిష్టమొచ్చినట్లు కేసులు పెడుతూ..ఇష్టమొచ్చినట్లు తిప్పుతూ..పేట్రేగిపోయిన సీఐడీ అధికారుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో అసలు రాజ్యాంగం, చట్టం అనేవి ఉన్నాయా లేవా అనే అనుమానం కలిగించింది.
నిర్బంధ కాండ..
నిర్బంధ కాండ.. అవును వారం రోజుల పాటు రఘురామకృష్ణరాజు అరెస్టు పర్వం చూసినవారికి అదే అనిపిస్తోంది. మూర్ఖుడు బలవంతుడు అన్నట్లు..ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తూ..పగ, ప్రతీకారాలతో బుసలు కొడుతూ..దెబ్బ తిన్న అధినేత అహాన్ని చల్లార్చేందుకు ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేస్తూ..అధికారులు అడుగులు వేశారు.ఇప్పుడు కేసుల భయంతో చేతులు నులుముకుంటున్నారు.అసలు ఆయన సిట్టింగ్ ఎంపీ,బలం బలగం ఉంది కాబట్టి.. టకటకా హైకోర్టులో పిటిషన్..ఆ వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ ఇలా వరుసగా వేస్తూ.. ఎట్టకేలకు సీఐడీ వేగానికి బ్రేకులు వేయగలిగారు.
సామాన్యుడు అయితే..
అదే సామాన్యుడు మరి అడ్వకేట్‌నే మాట్లాడుకోలేడు..పోలీస్ స్టేషన్‌లో సమాధానం కూడా ఇవ్వలేరు..అలాంటివారు ఏం చేయాలి..ఇక వారు ఏం నోరు విప్పుతారు..ఏం జరిగినా నోరు కుక్కుకుని.. ఎవరూ చూడకుండా ఏడ్చుకోవడం తప్ప.. ఇంకేమీ చేయలేరు.. అంతలా ప్రభుత్వ యంత్రాంగం ఆంధ్రప్రదేశ్‌లో విరుచుకుపడుతోంది.నీతి,నియమం,నిబంధన, చట్టం,న్యాయం ఏమీ పట్టించుకోవడం లేదు..వారికి తోచిందే న్యాయం..వారు చెప్పిందే చట్టం అన్నట్లుగా వ్యవహారాలు నడిపిస్తూ ప్రజలను భయపెడుతున్నారు.
రచ్చబండ పేరుతో విమర్శలు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత పార్టీపైనే ఆగ్రహం ప్రదర్శించారు.రచ్చబండ పేరుతో వరుసగా విమర్శలు చేస్తూ వైసీపీకి తలనొప్పిగా మారారు.ఢిల్లీలో ఆయనకు పరపతి ఉండటంతో ఏం చేయలేక పళ్లు నూరుకున్నారు.ఆ తర్వాత ఓ బ్యాంకు కేసులో సీబీఐ రఘురామకృష్ణపై కేసు పెట్టింది.దీంతో రఘురామ మరింత చెలరేగిపోయారు.ఈసారి ఏకంగా జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు.దానిపై విచారణ మొదలైంది.అది నడుస్తుండగానే రఘురామ గతంలో కంటే తీవ్రంగా సీఎంపై విమర్శల వర్షం కురిపించారు.వ్యంగ్యంగా సెటైర్లు విసురుతూ సీఎంపైనే పంచ్‌లు వేశారు.ఈ పరిణామాలు వైసీపీలో ఆగ్రహాన్ని కలిగించాయి.
Also Read ;- రఘురామ కాలికి ఫ్యాక్చర్ తో పాటు మరికొన్ని గాయాలు : సుప్రీంకోర్టు
పక్కాగా పథక రచనతో..
అవకాశం ఎదురు చూస్తూ..పక్కాగా పథక రచన చేసుకుని..రఘురామను హైదరాబాద్‌లోని ఆయన ఇంటి నుంచే అరెస్టు చేశారు.సిట్టింగ్ ఎంపీపై రాజద్రోహం కేసు పెట్టారు.పైగా ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన టీవీ5, ఏబీఎన్ సంస్థలపైనా కేసు పెట్టారు.ఇక్కడి నుంచి ఇక నిర్బంధకాండ మొదలైంది.ఎంపీని సైతం బలవంతంగా తీసుకుపోవడమే కాక.. కస్టడీలో కొట్టారని తేలింది.
అంతా తానై..
రాజుగారిని కొట్టినా.. అవమానభారంతో ఆయన బయటపెట్టుకోలేరని సీఐడీ అధికారులు భావించారట.ప్రభుత్వానికి వీర విధేయుడిగా..వీరభక్తి ప్రదర్శిస్తున్న అడిషనల్ ఢీజీ సునీల్ కుమార్ మొత్తం ఎపిసోడ్‌లో అంతా తానై వ్యవహరించారు. ఆయన దూకుడు వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని అధికారులు చెప్పుకుంటున్నారు.వారు ఊహించినదానికి భిన్నంగా రఘురామరాజు కోర్టులో నేరుగా తనను కొట్టారని చెప్పడం..రాతపూర్వకంగా ఇవ్వడంతో సీఐడీ అధికారులు చిక్కుల్లో పడ్డారు.
ఇక అక్కడి నుంచి తాము బయటపడటం కోసం నానా తంటాలు పడ్డారు..ఆఖరికి రఘురామకృష్ణరాజును ఆస్పత్రిలో కలిసి సునీల్‌కుమార్ నేరుగా రాజీ ప్రతిపాదన చేశారని ప్రచారం జరుగుతోంది.అది కూడా కుదరకపోవడంతో కోర్టు చెప్పినట్లు రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా..హైకోర్టుకు జిల్లా కోర్టు చెప్పిందని.. జిల్లా కోర్టులో హైకోర్టు చెప్పిందని..రకరకాల కారణలు చెప్పి.. కన్‌ఫ్యూజ్ చేసి.. ఎంపీని నేరుగా జిల్లా జైలుకు తీసుకుపోయారు.
ఎంపీకి సొరియాసిస్ ఉందని.. ఎడిమా ఉందని..ఆయనే కొట్టుకున్నాడని ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు.కోర్టులో సైతం అవే చెప్పారు.జిల్లా స్థాయిలో మెడికల్ రిపోర్టు కూడా తమకు అనుకూలంగా రాయించుకున్నారు. ఆ రిపోర్టు రాయించడానికి పెద్ద తతంగమే నడిచింది.వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడి భార్యే అక్కడ వైద్యాధికారిగా ఉండటంతో వారి పని సులువు అయిపోయిందని అంటున్నారు.
అడ్డం తిరిగిన కథ
సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతోనే..వారు ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని చెప్పడంతో కథ అడ్డం తిరిగింది.ఇప్పుడు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు రఘురామరాజును కొట్టారని తేల్చారు.ఇప్పుడు ఎవరు కొట్టారు..ఎలా కొట్టారనేది తేలాల్సి ఉంది.ఇలా ఇష్టమొచ్చినట్లు చట్టాన్ని, న్యాయాన్నితుంగలో తొక్కి.. బీహార్‌లోనో..ఏ ఈశాన్య రాష్ట్రంలోనో చేసినట్లు.. సీఐడీ అధికారులు..ప్రభుత్వ అధినేతల మద్దతుతో రెచ్చిపోయారు.ఇప్పుడు సుప్రీంకోర్టు దెబ్బకు …మరి ఆ అధికార మదం దిగుతుందో లేదో.. చూడాలి మరి.
Must Read ;- సుప్రీంలో సుదీర్ఘ విచారణ.. ఎంపీ రఘురామరాజుకు షరతులతో బెయిల్










